work stress: ఆఫీసు పనితో ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారా?-work stress motivation and mistakes to avoid at work place ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Work Stress Motivation And Mistakes To Avoid At Work Place

work stress: ఆఫీసు పనితో ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారా?

Koutik Pranaya Sree HT Telugu
May 04, 2023 05:49 PM IST

work stress: పని ప్రదేశంలో ఉండే ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలో, సానుకూలంగా ఎలా ఉండాలో తెలుసుకోండి.

పని ప్రదేశంలో ఒత్తిడి
పని ప్రదేశంలో ఒత్తిడి (SHVETS production)

పని ప్రదేశంలో ఒత్తిడి చాలా మంది ఎదుర్కునే విషయం. మీటింగులు, టార్గెట్లు… వీటన్నింటివల్ల ఇంటినీ, ఆఫీసు పనినీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. దీని ప్రభావం మీమీదే కాదు మీరు పని చేసే సంస్థ పనితీరు మీద కూడా ప్రభావం చూపుతుంది. “ కొన్ని సార్లు ఎక్కువ గంటలు పని చేయాల్సి రావడం, లేదా కొన్ని కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడం వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది. మీ సహోద్యోగితోనో, మీ పై అధికారితోనో గొడవలు రావడం వల్ల ఈ ఒత్తిడి ఇంకాస్త ఎక్కువవుతుంది. లేదా తరచూ ఉద్యోగాలు మారడం వల్ల, జాబ్ పోతుందో ఏమోనన్న దిగులుతోనో” ఒత్తిడి పెరుగుతుందని, క్లినికల్ సైకాలజిస్ట్ డా. రాహుల్ దిలీప్ అన్నారు.

అయితే పనిలో ఉండే ఒత్తిడిని సానుకూలంగా మార్చుకోవచ్చు. మనం సమయాన్ని చక్కగా వాడుకుంటూ, మంచి ప్రణాళికతో పని చేస్తే అసలు పని ఒత్తిడి అనే సమస్యే ఉండదు అంటారు డా. మెహెజాబిన్. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ ముందుకెళితే అదే మీరు పనిచేయడానికి మీకు స్పూర్తినిస్తుంది. మీ లక్ష్యాలను చేదించడంలో సాయపడుతుంది.

మీకున్న ఒత్తిడినే మీ మోటివేషన్‌ గా మార్చుకోవాలంటే..

లక్ష్యాలు: మీరు చేరుకోదగ్గ లక్ష్యాలను మీరే పెట్టుకోండి. వాటిని సాధించేందుకు కష్టపడండి. దానివల్ల మీరు చేసే పనిలో సంతృప్తి ఉంటుంది. ఒత్తిడి అనిపించదు.

ప్రాధాన్యతలు: టైం మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైనది. మీరు చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనవేవో ప్రధాన్యత ప్రకారం చేస్తూ వెళ్లండి. మీరు చేయాల్సిన పనిని ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక వేసుకోండి.

ఫీడ్‌బ్యాక్: మీ సహోద్యోగుల నుంచి, మీ పైస్థాయి వ్యక్తుల నుంచి మీ పని గురించి సమీక్ష ఇవ్వమనండి. మీ పనితీరు మెరుగుపడుతుంది. పనిచేయడానికి ప్రేరేపితులవుతారు.

సానుకూలత: ప్రతి విషయంలో తప్పులు వెతకొద్దు. మొదట సానుకూలంగా ఆలోచించండి. దీనివల్ల సగం సమస్యలు పరిష్కృతం అవుతాయి.

బ్రేక్ తీసుకోవడం: ఇక కూర్చుంటే లేవకుండా అలా పనిచేస్తూ పోతే మీ పనిమీద మీకు విసుగొస్తుంది. అవసరమైనపుడు, మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి. దానివల్ల మనసుకు కొత్త ఉత్సాహం వస్తుంది.

కలిసి పనిచేయడం: నా పని నాదే అనే ధోరణి సరైంది కాదు. కలిసి పనిచేస్తే కొత్త ఆలోచనలు తెలుస్తాయి. చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడటం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మీరు పై స్థాయి అధికారి అయితే మీతో పనిచేసే వాళ్ల బలాలు బలహీనతలు కనిపెట్టండి. వాటిలో సహాయం చేయండి. వీలైనపుడల్లా సరదాగా ఏవైనా చిన్న వేడుకలు ఏర్పాటు చేయడం వల్ల అందరికీ సరదాగా అనిపిస్తుంది. పని చేయడానికి కొత్త ఉత్సాహం వస్తుందని డా. రాహుల్ దిలీప్ సలహా ఇచ్చారు.

WhatsApp channel

టాపిక్