Women's day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎందుకు నిర్వహించుకుంటాం, దీని ప్రాముఖ్యత ఏమిటి?
Women's day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న నిర్వహించుకుంటాం. ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఎందుకు కేటాయించారు? దీని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోండి.
International Women's Day: మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళ కష్టానికి గుర్తింపుగా ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహించుకుంటారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఎంతోమంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
పోరాటాల ఫలితం
1908లో న్యూయార్క్ సిటీకి చెందిన 15 వేలమంది మహిళలు తమకు పనిగంటలను తగ్గించాలని, పురుషులతో సమానమైన జీతాన్ని ఇవ్వాలని, ఓటు వేసే హక్కును కల్పించాలని కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. ఆ ప్రదర్శన ఫలితంగా 1999లో జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. ఈ దినోత్సవం కేవలం ఒక దేశానికే చెందినది కాదని క్లారా జెట్కిన్ అనే మహిళ ఆలోచించింది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాల్లోని మహిళలకు చెందినదిగా ప్రకటించాలని పోరాటం చేసింది. 1910లో కోపెన్ హాగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కార్యక్రమంలో ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మార్చాలని ప్రతిపాదన చేసింది. ఆ సదస్సులో పాల్గొన్న 100 మంది మహిళలు ఈ ప్రతిపాదనను అంగీకరించారు.
మొదటి మహిళా దినోత్సవం
అలా తొలిసారిగా 1911లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా... ఇలా ఎన్నో దేశాల్లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైంది. అయితే ఐక్యరాజ్యసమితి 1975వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి అన్ని దేశాలు కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలుపెట్టాయి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశం ముఖ్యంగా లింగ సమానత్వం. మగవారికి ఎక్కువ జీతం, ఎక్కువ విలువ ఎలా ఇస్తున్నారో మహిళలకు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా వారితో సమానంగా జీతాన్ని, విలువను, గుర్తింపును ఇవ్వాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచంలో మహిళల పట్ల ఉన్న వివక్షను బద్దలు కొట్టడమే ఈ ప్రత్యేక దినోత్సవం ప్రధాన లక్ష్యం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చి 8న నిర్వహించుకుంటారు. దీనికి ఒక కారణం ఉంది. 1917లో రష్యా మహిళలు యుద్ధం వల్ల చాలా నష్టపోయారు. ఆహారం, ప్రశాంతత లేక తల్లడిల్లారు. వారంతా కలిసి సమ్మెకు దిగారు. వారి సమ్మెకు రష్యా రాజు నికోలస్ సింహాసనాన్ని వదిలేయాల్సి వచ్చింది. అప్పుడు ఒక ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పడింది. ఆ తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును కూడా ఇచ్చింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం మొదలుపెట్టారు.
రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆరోజు రష్యాలో జాతీయ సెలవు. మార్చి 8 వచ్చిందంటే ఆ దేశంలో బహుమతులు, పువ్వుల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఆరోజు మహిళలంతా తమకు నచ్చిన పనులు చేస్తారు. ఆఫీసులు ఉండవు. అలాగే చైనాలో మార్చి 8న మహిళలకు సగం రోజు సెలవు లభిస్తుంది. ఇప్పుడు ప్రతి దేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది.
మనదేశం వేడుకలు
మనదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుం్టా, వారి జీవితంలోని మహిళలను హృదయపూర్వక హావభావాలతో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. డిన్నర్ కోసం వారికి ఇష్టమైన రెస్టారెంట్ కు తీసుకెళ్లడం, హ్యాండ్ మేడ్ గిఫ్ట్ లు తయారు చేయడం, మహిళా రచయితలు రాసిన పుస్తకాలను వారికి బహుమతిగా ఇవ్వడం, మహిళల హక్కులు, లింగ సమానత్వంపై అవగాహన కల్పించడం, వారికి ఇష్టమైన సినిమాలు చూడటం ఇలా ఎన్నో చేయవచ్చు.