Solar Eclipse: సూర్య గ్రహణం రోజు ఏం తినాలి? ఎలాంటి ఆహారాలను దూరం పెట్టాలి?
Solar Eclipse: సూర్యగ్రహణం వచ్చేస్తోంది. మరొక మూడు రోజుల్లో ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఆ రోజు ఏం తినాలో? ఏం తినకూడదో తెలుసుకోండి.
Solar Eclipse: కొత్త ఏడాది వచ్చాక తొలి సూర్యగ్రహణం రాబోతోంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ ఖగోళ సంఘటన భూమికి - సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే ఒక అద్భుతం. సూర్యుని కాంతిని చంద్రుడు అడ్డుకోవడం వల్ల భూమిలోని కొన్ని భాగాలపై నీడలా పడుతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు అయితే సూర్యగ్రహణం చుట్టూ పూర్వం నుంచి ఎన్నో నమ్మకాలు, సాంప్రదాయాలు అల్లుకొని ఉన్నాయి.
సూర్య గ్రహణం రోజు ఏం చేయాలి?
సూర్య గ్రహణ సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినకూడదని, కొన్ని నియమాలు పాటించాలని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హిందువులు సూర్య గ్రహణానికి ఎక్కువ విలువనిస్తారు. సూర్యగ్రహణ సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడికి శక్తి వస్తుందని, ఆయన ఈ గాయత్రి మంత్రాన్ని జపించే వారికి దీవెనలు అందిస్తాడని నమ్ముతారు. అలాగే సూర్యగ్రహణం రోజు విష్ణువు లేదా శివునికి చెందిన శ్లోకాలను, మంత్రాలను జపిస్తారు.
సూర్యగ్రహణం రోజు ఏం తినాలి?
సూర్య గ్రహణ సమయంలో పూర్వం నుంచి ఉన్న నమ్మకాల ప్రకారం కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. ఆ ఉపవాసంలో కేవలం నీటిని మాత్రమే తాగవచ్చు, లేదా కొన్ని రకాల పండ్లు, నట్స్ వంటివి తినవచ్చు. ఉపవాసం లేనివారు తాజా పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలు, ధాన్యాలతో వండిన వంటలు, నట్స్, పాల ఉత్పత్తులు వంటివి తినవచ్చు. అలాగే కొబ్బరి నీటిని అధికంగా తాగవచ్చు. కొబ్బరినీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. గ్రహణ సమయంలో మనిషిలోని శక్తి స్థాయిలు తగ్గుతాయని నమ్ముతారు. ఆ శక్తి స్థాయిలను పెంచడానికి కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది.
అలాగే పాలల్లో పసుపును కలుపుకొని తాగే అలవాటు కూడా ఎక్కువ మందికి ఉంది. ఇది గ్రహణ సమయంలో తగ్గిన రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. కొన్ని సంస్కృతులలో గ్రహణ సమయంలో నువ్వులతో చేసిన ఆహారాలను కూడా తింటూ ఉంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ. కాబట్టి గ్రహణ సమయంలో తగ్గిన శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే సూర్యగ్రహణ సమయంలో నువ్వులు తినడాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
ఏం తినకూడదు?
గ్రహణ సమయంలో కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉండాలి. ఇవి ప్రతికూల శక్తి వల్ల కలుషితం అవుతాయని నమ్ముతారు. ముఖ్యంగా వండిన ఆహారాలను తినరు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వాటికి దూరంగా ఉంటారు. ఈ రెండూ కూడా ప్రతికూల శక్తులను పెంచుతాయని నమ్ముతారు. అలాగే మాంసాహారాలకి పూర్తిగా దూరంగా ఉంటారు. ఆల్కహాల్ వంటి వాటిని తీసుకోరు. కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలను దూరం పెడతారు. సాధారణ కాఫీ, టీలకు బదులుగా హెర్బల్ టీలు తాగితే ఎంతో మంచిది. గ్రహణం వీడాక తలస్నానం చేసి అప్పుడు మీకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు.
ఏదైనా సరే సూర్య గ్రహణ సమయంలో సాత్విక ఆహారాన్ని ఉపవాసాన్ని చేయడం చాలా మంచిది. సంప్రదాయాలను గౌరవించడంతోపాటు, ఉపవాసాలు చేయడం ఎంతో మంచిది. పది రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది.
టాపిక్