Vlogging। మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారా? మంచి వ్లాగర్ అవ్వడానికి ఇవిగో టిప్స్!
Vlogging Day: వ్లాగ్ అంటే ఏమిటి? వ్లాగ్స్ ఎలా చేస్తారు, మీ వ్లాగ్ ఛానెల్ విజయవంతం కావడానికి ఏం చేయాలి? కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
Vlogging Day: మీరు YouTube స్టార్ అవ్వాలనుకుంటున్నారా? లేదా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ప్రపంచంతో ముఖ్యమైన జ్ఞానాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? అలాంటప్పుడు మీరు మీ స్వంత వ్లాగ్‌ను ఎందుకు ప్రారంభించకూడదు? మీరు వ్లాగ్స్ చేస్తూ మీకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకోవచ్చు, సమాచారాన్ని అందరితో పంచుకోవచ్చు, అంతేకాదు మీ వ్లాగ్స్ కు వీక్షకులు పెరిగితే దానితో కొంత ఆదాయాన్ని అందుకోవచ్చు. ఇంతకీ అసలు వ్లాగ్ అంటే ఏమిటి? వ్లాగ్స్ ఎలా చేస్తారు, మీ వ్లాగ్ ఛానెల్ విజయవంతం కావడానికి ఏం చేయాలి? దీనికి సంబంధించి మీకు కావలసిన సమాచారం, వ్లాగ్ చేయడానికి ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.
వ్లాగ్ అంటే ఏమిటి?
బ్లాగ్ లేదా బ్లాగింగ్ అంటే మీకు తెలుసా? ఏదైనా రచనను పబ్లిష్ చేయడం బ్లాగ్ అనిపించుకుంటుంది, అది వీడియో రూపంలో పబ్లిష్ చేస్తే బ్లాగ్ అవుతుంది. వ్లాగ్ అనేది వీడియో రూపంలో ఉన్న బ్లాగ్. వీడియో బ్లాగ్ లేదా వీడియో లాగ్ కోసం చెప్పే సంక్షిప్త పదమే వ్లాగింగ్. దీన్ని మీ స్వంత టీవీ షో లేదా స్వంత ఛానెల్‌గా భావించండి, అయితే వ్లాగ్ అనేది వెబ్‌కు మాత్రమే పరిమితం.
మీరు వ్లాగింగ్ ఛానెల్‌ని సృష్టించడానికి, వీడియో కంటెంట్‌ను ప్రచురించడానికి అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అయితే అత్యధికంగా వీక్షించబడే, విజయవంతమైన వ్లాగ్‌లు యూట్యూబ్ వ్లాగ్‌లు. యూట్యూబ్ కాకుండా మీరు ఇన్‌స్టాగ్రామ్, షేర్‌చాట్, జోష్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోనూ వ్లాగ్స్ పబ్లిష్ చేయవచ్చు.
వ్లాగ్ చేయడానికి కంటెంట్ ఏం ఉండాలి?
మీరు దేనినైనా వ్లాగ్ రూపంలో చేయవచ్చు కానీ మీరు చేసే వ్లాగ్‌కు వీక్షకులు, ప్రేక్షకులు కావాలి. కాబట్టి ఎక్కువ మందిని ఆకర్షించగల విషయాన్ని వ్లాగ్ చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే ఒక సెలబ్రిటీ అయితే మిమ్మల్ని అనుసరించే ఫాలోవర్స్ మీ వ్లాగ్స్ చూస్తారు. మీరు సెలబ్రిటీ కారు, అయినప్పటికీ వ్లాగ్స్ చేయాలనుకుంటే ఎక్కువ మందికి నచ్చేలా, మెచ్చేలా మంచి వీడియో క్వాలిటీతో వ్లాగ్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినా కూడా మీకు వీక్షకులు వస్తారని, మీరు స్టార్ అయిపోతారని చెప్పడం లేదు. ఒక్కరోజులోనే ఏదీ జరిగిపోదు, నిరంతరమైన కృషి అవసరం. కొంతమంది ఏదైనా వైరల్ వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు, కానీ సబ్జెక్ట్ తెలిసిన వారు, మంచి కంటెంట్ ను వీక్షకులకు అందించే వారే వ్లాగ్ స్టార్లుగా కొనసాగగలరు.
వ్లాగ్ చేయడానికి మీరు ఎంచుకునే సబ్జెక్ట్ ఏమిటి? మీరు దేనిలో మేటి అనేది మీకు తెలిసి ఉండాలి. ట్రావెల్ వ్లాగ్‌లు చేయవచ్చు, వంటలు నేర్పించవచ్చు, ట్యూషన్లు చెప్పవచ్చు, డ్యాన్స్ - యాక్టింగ్ వంటివి ఏదైనా కళాత్మకంగా చూపించగలగాలి.
వ్లాగింగ్ చేయడానికి కావలసిన పరికరాలు, నైపుణ్యాలు
వ్లాగ్‌ను రూపొందించడానికి మీరు ఒక గొప్ప సినిమా డైరెక్టర్, సినిమటోగ్రఫర్ లేదా ప్రొడ్యూసర్ కానవసరం లేదు. ప్రత్యేకమైన కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. మీ చేతిలో నాణ్యమైన స్మార్ట్‌ఫోన్ కెమెరా ఉంటే, దానితో అందంగా, కళాత్మకంగా వీడియో చిత్రీకరించి పబ్లిష్ చేయవచ్చు. మీకు వీక్షకులు పెరుగుతున్నారంటే, ఒక మంచి కెమెరా, ట్రైపాడ్, అప్ లోడ్ చేయడానికి కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం అవసరం. వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేర్చడం వంటి వాటిలో నైపుణ్యాలను పెంచుకుంటూ పోవాలి, వీటన్నింటితో పాటు కొంత సృజనాత్మకత ఉండాలి. అప్పుడు మీరే గొప్ప వ్లాగర్, సోషల్ మీడియా స్టార్ అయిపోవచ్చు.
మరి ఇంకే మీరు మీ వ్లాగ్ ఛానల్ ప్రారంభించండి. అన్నట్టూ ఈరోజు వ్లాగింగ్ దినోత్సవం. ప్రతీ ఏడాది ఆగష్టు 10న వ్లాగింగ్ డేగా పాటిస్తారు. మంచి మంచి వీడియోలను రూపొందించడం కోసం, వ్లాగర్లను ప్రోత్సహించడానికి ఈరోజు అంకితం.
సంబంధిత కథనం