Vegan Diet | ఆకుపచ్చవి తింటే.. ఆరోగ్యం మీ వెంటే, సంపూర్ణ శాఖాహారంతో ప్రయోజనాలివే
వేగన్ డైట్ తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు, కొన్ని వ్యాధులు దరిచేరవు. అసలు ఈ వేగన్ డైట్ ఏమిటి? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
ఒకవైపు బరువు తగ్గాలని కఠినమైన వ్యాయామాలు చేస్తూ మరోవైపు బిర్యానీలు, పులావులు తింటే ఇంకా లావు అవుతారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామంతో పాటు సరైన డైట్ కూడా ముఖ్యమే. ఇటీవల కాలంలో కీటో డైట్, ఫ్లెక్సిటేరియన్ డైట్, అట్కిన్స్ డైట్ అంటూ రకరకాల డైట్‌లను అవలంబిస్తున్నారు. అయితే వీటన్నింటికంటే వేగన్ డైట్ ఎంతో ప్రభావవంతమైనదని ప్రాచుర్యంలోకి వచ్చింది. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిసెలబ్రిటీలు తమనితాము ఫిట్‌గా ఉంచుకునేందుకు వేగన్ డైట్‌కు మారిపోతున్నారు.
బరువు తగ్గడానికి, ఆపై తగ్గిన బరువును మెయింటెయిన్ చేయడానికి, శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేగన్ డైట్ చాలా మంచి ఆప్షన్ అని చెబుతున్నారు. ఇంతకీ ఈ వేగన్ డైట్ అంటే ఏమిటి, ఏమేం తినాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
వేగన్ డైట్‌లో ఎలాంటి ఆహారం ఉంటుంది
వేగన్ డైట్ అంటే పూర్తిగా వెజిటేరియన్ డైట్ అని అర్థం. సంపూర్ణమైన శాఖాహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వేగన్ డైట్‌లో భాగంగా శాకాహార ఉత్పత్తులైన ఆకుపచ్చ కూరగాయలతో పాటు పండ్లు, గింజలు ఉంటాయి. అలాగే కాయధాన్యాలు, నట్స్, చపాతీలు తీసుకోవచ్చు. వండుకోవటానికి నూనె కూడా వెజిటెబుల్ ఆయిల్ అయి ఉండాలి.
వేగన్ డైట్ పాటిస్తున్నపుడు మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కనీసం గుడ్లు, పాలు, ఇతర పాలపదార్థాలు, తేనే, మయోనీస్ సాస్, ఐస్ క్రీమ్ లాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. జంతువులు నుంచి వచ్చే పాలకు ప్రత్యామ్నాయంగా శాఖాహార పాలు అయినటువంటి స్వచ్ఛమైన బాదాంపాలు, సోయాపాలు, కొబ్బరిపాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ వేగన్ డైట్‌లోనూ రకాలు కూడా ఉంటాయి. ఇంకా కఠినంగా పాటించేవారు కనీసం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే బియ్యం, బంగాళాదుంపలు, అలాగే కొవ్వు కలిగిన ఆహారాలు కూడా ఫైబర్ అధికంగా ఉండేలా పచ్చికూరగాయలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు.
వేగన్ డైట్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- వేగన్ డైట్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి, ఈ ఆహారంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగే పదార్థాలేవీ ఉండవు. ఈ కారణంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.
- పండ్లు, కూరగాయలు, నట్స్ మొదలగు వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను అధిగమించవచ్చు. తద్వారా మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
- ఈ ఆహారంలో ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా మంచి శక్తి లభిస్తుంది, అలసట అనేది ఉండదు. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.
- ఈ ఆహారం బరువు తగ్గడానికి ఎంతో ఉత్తమమైనదని. దీని వల్ల శరీరానికి కావాల్సిన మొత్తంలో కేలరీలు అందుతాయి కానీ కొవ్వు పేరుకుపోదు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గించడంలో ఈ డైట్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.
- శాకాహారులు మంచి గుండె ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని, అలాగే వీరికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఊబకాయం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు తలెత్తవు.
- కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో GI ట్రాక్ట్ , రొమ్ము క్యాన్సర్, అండాశయాలు, గర్భాశయం క్యాన్సర్లు రాకుండా రక్షణ ఉంటుంది.
- జీవితకాలం మెరుగుపడుతుంది.
రిస్క్ కూడా ఉంటుంది
పూర్తిగా వేగన్ డైట్ పాటిస్తే మాంసం, పాలు ఇతర పదార్థాల ద్వారా లభించే పోషకాలు అందవు. ముఖ్యంగా కాల్షియం లేమి ఏర్పడి దంత సమస్యలు వస్తాయి, ఎముకలు బలహీనం అవుతాయి, పోటీన్ లేమితో కణాలు వృద్ధి చెందవు. కాబట్టి ఎదిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ డైట్ శ్రేయస్కరం కాదు.
సంబంధిత కథనం
టాపిక్