Mohan Babu Attacked Media : మీడియాపై మోహన్ బాబు దాడిని ఖండించిన జర్నలిస్టుల సంఘాలు, క్షమాపణ చెప్పాలని డిమాండ్
Mohan Babu Attacked Media : మంచు ఫ్యామిలీ వివాదం మరో టర్న్ తీసుకుంది. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనను జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Mohan Babu Attacked Media : హైదరాబాద్ జల్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు కుటుంబ వివాదం రచ్చకెక్కింది. ఈ వివాదంపై కవరేజీకి వెళ్లిన మీడియాపై సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని వారిపై దాడి చేశారు. అసభ్యకరంగా దూషించారు. ఈ దాడిలో టీవీ9, టీవీ5 ప్రతినిధులకు గాయాలయ్యారు.
మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం సాయంత్రం మోహన్ బాబు ఇంటి వద్ద వీడియో జర్నలిస్టులు, రిపోర్టర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఓ ప్రకటన జారీ చేసింది. సమాజంలో పెద్దమనుషులు లాగా చలామణి అవుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది.
"క్రమశిక్షణ గలిగిన మోహన్ బాబు తన ఇంట్లో జరిగే పంచాయితీ గురించి మాకు ఎలా తెలుస్తుంది అది మీరు ఇచ్చే లీకుల వల్లనే కదా. మోహన్ బాబు మీ ఇంటి వద్ద న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి మీ దిగజారుడుతనానికి నిదర్శనం. మీరు సొసైటీలో ఎదగాలనుకున్నప్పుడు, బాగా డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు, పేరు సంపాదించాలనుకున్నప్పుడు మేము అవసరం. మీ కుటుంబ సభ్యులే లీకులు ఇవ్వకపోతే మేము ఎందుకు వస్తాం మీ దగ్గరికి" అని తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అభిప్రాయపడింది. మీడియాపై దాడికి మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మీడియా అకాడమీ ఛైర్మన్, డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు సమక్షంలో దాడి జరగడం జర్నలిస్టుల భద్రతకు భరోసా లేదని మరొకసారి రుజువు అయిందన్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు స్పందించాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ కోరింది.
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని టీడబ్ల్యూజేఎఫ్ ఖండించింది. మీడియా ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా పని చేస్తుందని ఈ సంఘం సభ్యులు అభిప్రాపడ్డారు. సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్దతతో విధులు నిర్వర్తిస్తారున్నారు. తమ కుటుంబ విషయాలపట్ల ఫ్రస్టేషన్ ఉన్న మోహనబాబు టీవీ9, టీవీ 5 జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదన్నరు. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరుతున్నామన్నారు. భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
"సినీ నటుడు మోహన్ బాబు విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడి చేసిన దురుసు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యప్ప దీక్షలో ఉన్న రిపోర్టర్, మరో కెమెరామెన్ పై జరిగిన ఈ దాడిపై వెంటనే స్పందించి మోహన్ బాబుపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. డీజీపీ కలుగజేసుకొని సంబంధిత పోలీస్ ఏసీపీ, ఇన్స్ పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. మానవ హక్కుల కమిషన్ కూడా మీడియాపై జరిగిన ఈ దాడిపై సూమోటోగా స్పందించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించేలా ప్రభుత్వానికి, డీజీపీకి సూచనలు ఇవ్వాలని విన్నపం. మోహన్ బాబుపై వెంటనే పోలీస్ కేసు నమోదు చేయకపోతే మెరుపు ఆందోళనకు సైతం వెనుకాడేది లేదు" - తెలంగాణ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ
సంబంధిత కథనం