Manchu Family Issue : జల్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత, మీడియాపై మోహన్ బాబు దాడి- చిరిగిన చొక్కాతో బయటకొచ్చిన మనోజ్
Manchu Family Issue : జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొది. మంచు కుటుంబ వివాదాన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. అంతకు ముందు మనోజ్ ను ఇంట్లోకి రానీవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన గేటు తోసుకుని లోపలికి వెళ్లారు. ఆయన పై కూడా దాడి జరిగింది.
Manchu Family Issue : హైదరాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లిపోవాలని మోహన్ బాబు సూచించడంతో... ఆయన తన వస్తువులు తరలించేందుకు మూడు భారీ వాహనాలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మనోజ్ దంపతులు మోహన్ బాబు ఇంటి రాగా...సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో కారు దిగి గేట్లను తోసుకుంటూ మనోజ్ ఇంట్లోకి వెళ్లారు. గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్ పై మోహన్ బాబు, ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దీంతో ఆయన చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు.
మంచు ఫ్యామిలీ వివాదాన్ని కవర్ చేస్తున్న మీడియాపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని కోపంతో నేలకేసి కొట్టారు. మీడియా ప్రతినిధులు గేటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు మోహన్ బాబును అదుపుచేశారు. మీడియాపై మోహన్ బాబు బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు.
మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్
మీడియాపై మోహన్ బాబు దాడికి పాల్పడడంతో జల్ పల్లిలో హైటెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు. మోహన్ బాబు నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం -మోహన్ బాబు ఆడియో
కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్‌బాబు స్పందించారు. మంగళవారం రాత్రి తన ఇంటి చోటుచేసుకున్న ఘటనపై ఆడియో మెసేజ్ విడుదల చేశారు.
"మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే ఎంతో గారాబంగా పెంచాను. అందరికంటే నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని చూశాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావు మనోజ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరం గొడవ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. జల్‌పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం. ఈ ఇంటితో నీకు సంబంధం లేదు. మనోజ్ మద్యానికి బానిసై పోయాడు. మద్యం మత్తులో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు.
నా ఇంట్లో పనిచేస్తోన్న వారిపై దాడికి చేయడం సరికాదు. నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు ఇక చాలు. నన్ను ఇప్పటి వరకూ ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపం. ఆస్తులు ముగ్గురికీ సమానంగా ఇవ్వాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా? దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం. నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం నీకు లేదు. మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రి పాలైంది. భార్య మాటలు విని తాగుడుకు బానిసై ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇక చాలు ఇంతటితో ఈ గొడవను ముగిద్దాం" అని మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు.
సంబంధిత కథనం