Healthy Food: ధర తక్కువ.. పోషకాలు ఎక్కువ.. దీన్ని రోజూ తింటే బలం, ఆరోగ్యం!
Healthy Food: కొన్ని రకాల ఆహారాలు ధర ఎక్కువ లేకపోయినా.. పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. అయితే, వాటిని చాలా మంది తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇక్కడ తెలుసుకోండి.
సరైన ప్లానింగ్ చేసుకుంటే, కొన్ని విషయాలు తెలుసుకుంటే ఎక్కువగా ఖర్చు చేయకుండానే పోషకాలతో నిండిన ఆహారాన్ని తినొచ్చు. బడ్జెట్ పాటించినా ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ తీసుకోవచ్చు. ధర ఎక్కువగా ఉంటేనే పోషకాలు అధికంగా ఉంటాయనే భావన సరికాదు. కొన్ని రేటు తక్కువైనా పోషక విలువల్లో మెండుగా ఉంటాయి. అయితే, ఎక్కువగా కళ్ల ముందే ఉన్నా వాటి విలువ తెలియక వాటిని కొందరు పట్టించుకోరు. అలాంటి వాటిలో ‘పచ్చి కొబ్బరి’ కూడా ఒకటి.
పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. కొబ్బరికాయల ధర కూడా ఎక్కువేం ఉండదు. అందుకే కొబ్బరికాయ కొట్టి.. కొబ్బరిను పచ్చిగా తినేయవచ్చు. రోజూ ఓ చిప్ప వరకు కూడా తీసుకోవచ్చు. నేరుగా తినొచ్చు.. వివిధ వంటకాల్లో వేసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. ఆ వివరాలివే..
పచ్చి కొబ్బరిలో పోషక విలువలు ఇలా..
పచ్చి కొబ్బరిలో మ్యాగనీస్, సెలేనియం, కాపర్, పాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్ లాంటి మినరల్స్ ఉంటాయి. విటమిన్ బీ, సీ, డీ, ఈ కూడా ఉంటాయి. ఫైబర్ కూడా దీంట్లో అధికమే. యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.
పచ్చి కొబ్బరితో ప్రయోజనాలు
- ఎనర్జీ: పచ్చి కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిసెరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తింటే వేగంగా శరీరానికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఉదయాన్నే మంచి ఎనర్జీ ఉండాలంటే పచ్చి కొబ్బరి తినేయవచ్చు.
- రోగ నిరోధక శక్తి: పచ్చి కొబ్బరిలో యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇది తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహకరిస్తుంది. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు, వ్యాధులతో శరీరం దీటుగా పోరాడేందుకు సహకరిస్తుంది.
- జీర్ణానికి మేలు: పచ్చి కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పేగుల కదలికలను మెరుగు పరుస్తుంది.
- జుట్టుకు, చర్మానికి కూడా..: పచ్చి కొబ్బరి తినడం జుట్టు, చర్మానికి కూడా మంచిది. పొరిబారకుండా తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలను మెరుగుపచగలదు.
- గుండె ఆరోగ్యానికి..: రెగ్యులర్‌గా పచ్చి కొబ్బరి తినడంవ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేయగలదు. రక్తప్రసరణకు సహకరిస్తుంది. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది.
ఇది గుర్తుంచుకోండి
పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, దీంట్లో క్యాలరీలు, ఫ్యాట్ కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు పరిమితి మేర తీసుకోవాలి. వారి డైట్‍లో క్యాలరీల కౌంట్‍ను బట్టి తినాలి.