ఆస్ట్రేలియాతో గబ్బా టెస్టు ముంగిట భారత్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్.. రిలాక్స్ అవుతున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే జరిగిన పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు కూడా భారత్ జట్టుకి సంక్లిష్టంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో.. గబ్బా టెస్టులో గెలిచి సిరీస్‌లో పుంజుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.
ఆస్ట్రేలియా గడ్డపై తొలి రెండు టెస్టుల్లో ఫెయిలైన రిషబ్ పంత్.. గబ్బాలోనైనా సత్తాచాటాలని టీమిండియా ఆశిస్తోంది. భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాలో జాలీగా చక్కర్లు కొట్టకుండా సీరియస్‌గా ప్రాక్టీస్ చేయాలని సూచించారు. కానీ.. రిషబ్ పంత్ మాత్రం ఆస్ట్రేలియా వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు. అక్కడ వీధుల్లో ఒక చిన్న పాపతో కలిసి పంత్ సరదాగా ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వాస్తవానికి రిషబ్ పంత్‌కి మంచి బేబీ సిట్టర్ అని పేరుంది. గతంలో మహేంద్రసింగ్ ధోనీ కూతురు జీవాతో కలిసి అతను ఆడుకుంటున్న ఫొటోలు, వీడియోలు చాలా బయటికి వచ్చాయి. దాంతో 2019లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ టిమ్ పైన్.. పంత్‌ను బేబీ సిట్టర్ అని ఎగతాళి కూడా చేశాడు.
2022లో కారు ప్రమాదం తర్వాత భారత్ జట్టులోకి తిరిగొచ్చిన పంత్ అతి తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ మళ్లీ రెగ్యులర్ ప్లేయర్‌గా మారిపోయాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకి లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన ప్లేయర్‌గా పంత్ రికార్డ్ నెలకొల్పాడు.