Gym Age : ఏ వయసు నుంచి జిమ్‌కు వెళితే మంచిది?-what is the right age to go to gym all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gym Age : ఏ వయసు నుంచి జిమ్‌కు వెళితే మంచిది?

Gym Age : ఏ వయసు నుంచి జిమ్‌కు వెళితే మంచిది?

Anand Sai HT Telugu
Jan 19, 2024 05:30 PM IST

Gym Age : కొందరు యువకులు బాడీ పెంచేందుకు జిమ్‌కు రోజూ వెళ్తుంటారు. కానీ జిమ్‌కు వెళ్లడంలో మీ వయసు కూడా చూసుకోవాలి.

జిమ్‌
జిమ్‌ (unsplash)

టీనేజర్లు కూడా ప్రతిరోజూ జిమ్‌కి వెళ్తుంటారు. సమయానికి జిమ్‌కి వెళ్లే పిల్లలు ఫిట్‌గా ఉన్నారని అనుకుంటారు. మీ పిల్లలు అదే తప్పు చేస్తే వెంటనే గుర్తించాలి. టీనేజర్ల నోటిలో సిక్స్ ప్యాక్, అబ్స్, కండరాల పేర్లు వినడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండటంతో చిన్న వయసులోనే జిమ్‌కు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. పిల్లలు అందరికంటే మెరుగ్గా కనిపించేందుకు గంటల తరబడి జిమ్‌లో గడుపుతారు. జిమ్‌కు వెళ్లడం గర్వంగా భావిస్తారు. అక్కడ ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడుతూ.. టీనేజర్లు జిమ్‌కి ఎప్పుడు వెళ్లాలో తెలుసుకోవడం మర్చిపోతారు.

జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. అయితే అన్ని వయసుల వారు జిమ్‌కి వెళ్లడం ఆరోగ్యకరం కాదు. జిమ్‌లో చెమటలు పట్టడం టీనేజర్లకు ప్రమాదకరం. అనేక వ్యాధులు వారిపై దాడి చేస్తాయి. జిమ్‌కి వెళ్లడానికి సరైన వయస్సు ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

జిమ్‌లో చేరడానికి సరైన వయస్సు గురించి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో 13-14 సంవత్సరాల వయస్సు గల వారు జిమ్‌లలో కనిపిస్తారు. కానీ జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఈ వయస్సు సరిపోదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఎవరైనా జిమ్‌కు వెళ్లవచ్చు. 13-14 సంవత్సరాల వయస్సులో, పిల్లల శరీరాలు పెరుగుతాయి. వారి ఎముకల్లో ఎదుగుదల ఉంటుంది. ఈ సమయంలో జిమ్‌కి వెళ్లడం వల్ల సమస్యలు వస్తాయి. మీకు కావాలంటే 17-18కి జిమ్‌కి వెళ్లవచ్చు. అది కూడా తేలికపాటి వ్యాయమాలు చేసేందుకు మాత్రమే వెళ్లాలి. మీరు మీ బరువు, ఆహారం, వ్యాయామంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

చిన్న వయస్సులోనే జిమ్‌కు వెళ్లడం ప్రారంభిస్తే కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. కండరాలపై ఒత్తిడి వస్తుంది. కండరం బలహీనంగా మారుతుంది. మీరు జిమ్‌లో కార్డియో లేదా పవర్‌లిఫ్టింగ్ చేస్తే, అది మీ గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. జిమ్‌కు వెళ్లేవారు త్వరగా షేప్‌ పొందాలనే ఆరాటంతో ఉంటారు. దీని కోసం కొన్ని ప్రోటీన్ షేక్స్, స్టెరాయిడ్స్ తీసుకుంటారు. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. అతిగా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు కూడా బలహీనపడతాయి.

మన శరీరానికి వ్యాయామం చాలా అవసరం. పిల్లలు ఊబకాయంతో ఉన్నట్లయితే వారిని ప్లేగ్రౌండ్‌లో వదిలివేయండి. రన్నింగ్, జంపింగ్ వారి శరీరానికి వ్యాయామాన్ని అందిస్తాయి. బరువు కూడా తగ్గుతుంది. నేటి పిల్లలు పాఠశాల తర్వాత వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో తలలు పెట్టేస్తున్నారు. అందులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ కారణంగా బరువు పెరగడం సమస్యగా మారింది. పిల్లలు మైదానంలో ఆడటం లేదా యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

Whats_app_banner