Bra less Sleep: రాత్రి బ్రా తీసేసి పడుకుంటే ఏమవుతుంది? లాభమా నష్టమా?
Bra less Sleep: బ్రా వేసుకుని నిద్రపోవడం మంచిదా కాదా అనే సందేహం ఉంటే ఇది పూర్తిగా చదివేయండి. బ్రా వేసుకుని పడుకుంటే ఏమవుతుందో వివరంగా తెల్సుకోండి.
కొందరికి బ్రా వేసుకుంటేనే నిద్ర పడుతుంది. కొందరు బ్రా తీసేయక పోతే నిద్ర పోలేరు. అయితే బ్రా వేసుకుని పడుకోవడం వల్ల నష్టాలుంటాయని కొందరంటే, వేసుకోకపోతేనే నష్టమని మరికొందరు చెబుతారు. బ్రా వేసుకుని పడుకుంటే ఏమవుతుందో తెల్సుకుందాం.
శ్వాస మీద ప్రభావం:
చాతీకి సరైన సపోర్ట్ ఇచ్చేలాగా బ్రాలను డిజైన్ చేస్తారు. కాస్త బిగుతుగా ఉంటేనే అవి ఆ పని చేయగలవు. అలాగే కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు బ్రా వల్ల సరైన మద్దతు దొరుకుతుంది. కానీ పడుకున్నప్పుడు బ్రా కింది వైపుండే బ్యాండ్ చాతీ వైపుకు పైకి వచ్చేస్తుంది. పైకి రావడం వల్ల మరింత బిగుతుగా అయిపోయి అసౌకర్యం మొదలవుతుంది. పక్కటెముకల కదలిక కూడా కాస్త కష్టంగా అయ్యి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. ఉదయం లేవగానే మీకక్కడ నొప్పి ఉంటే దానికి కారణం బిగుతు బ్రా వేసుకుని పడుకోవడమే.
రక్త సరఫరా:
బిగుతుగా ఉన్న బ్రాతో నిద్రపోవడం వల్ల రొమ్ములోని కణజాలానికి రక్త సరఫరా సరిగ్గా జరగదు. కనీసం రాత్రి పూట అయినా వదులుగా ఉన్న బట్టల్లో పడుకుంటే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. దీంతో రొమ్ము ఆరోగ్యమూ బాగుంటుంది.
ర్యాషెస్, ఇన్ఫెక్షన్లు:
సాధారణంగా మనముండే వాతావరణంలో ఏ కాలమైనా కాస్త చెమట పట్టడం మాత్రం కామన్. ముఖ్యంగా చాతీ కింది భాగంలో చెమట ఎక్కువగా వస్తుంటుంది. ఎండాకాలంలో, తేమగా ఉండే వర్షాకాలం రోజుల్లో ఈ సమస్య చెప్పడం వర్ణనాతీతం. ఇలా ఎక్కువసేపు చెమట రావడం వల్ల స్కిన్ ర్యాషెస్ రావచ్చు. బ్రా ఆ చెమటను పీల్చుకుని తేమగా అయిపోతుంది. అలాగే నిద్రిస్తే ఫంగస్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. రొమ్ము మీద చర్మం ఎరుపెక్కుతుంది కూడా. దద్దుర్లు, దురద ఇబ్బంది పెడతాయి. కాబట్టి రాత్రి పూట అయినా బ్రా వేసుకోకపోతే చర్మానికి గాలి తగిలి ఏ సమస్య రాకుండా ఉంటుంది.
చాతీ ఎక్కువగా ఉంటే:
చాతీ సైజు ఎక్కువగా ఉంటే బ్రా వేసుకోకపోతే నిద్ర పట్టదు. అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాంటివాళ్లు ప్యాడింగ్ లేని, వైరింగ్ లేని, మరీ బిగుతుగా లేని సాధారణ కాటన్ బ్రాను రాత్రి నిద్రపోయేటప్పుడు వేసుకోవచ్చు. మీరనుకున్న సౌకర్యంతో పాటూ ఏ ఇబ్బందీ ఉండదు.
ఇవి మాత్రం అపోహలు:
బ్రా వేసుకోకపోతే సాగడం:
బ్రా వేసుకోకపోతే రొమ్ముల ఆకారం మారిపోతుందనేది అపోహ మాత్రమే. దానికోసం బ్రా ఒక్కటే పరిష్కారం కాదు. రకరకాల వ్యాయామాలు, యోగా చేసి సరైన ఆకారంలో ఉంచుకోవచ్చు.
బ్రా వల్ల చాతీ పరిమాణం పెరగదు:
ఒక వయసు వచ్చాక వక్షోజాల్లో ఎలాంటి మార్పు రాదు. కాబట్టి బ్రా వేసుకుని నిద్రించడం వల్ల పరిమాణం మీద ప్రభావం ఉంటుందనేది అపోహ మాత్రమే.
టాపిక్