Rat Bite Problems : ఎలుక కొరికితే ఏం జరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Rat Bite : ప్రపంచవ్యాప్తంగా అందరికీ చిరాకు కలిగించేవాటిలో ఎలుకలు మెుదటి స్థానంలో ఉంటాయి. కొన్నిసార్లు అవి కొరకడం చేస్తాయి. ఇలా అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి?
ఇంట్లో ఉన్న ఎలుకలు మనశ్శాంతిని పాడుచేస్తాయి. వాటిని చంపి పట్టుకుని బయట పడేసేదాకా కొందరికి మనశ్శాంతి ఉండదు. ఈ ఎలుకలు ఇంట్లోని వస్తువులను పాడుచేయడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ప్రమాదమే. ఎలుకలు కొరికితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
వైరస్‌ల వాహకాలు
ఎలుకలు వైరస్‌ల వాహకాలు. ఎలుకల మూత్రం, మలం, లాలాజలంతో మానవులకు సంభవించవచ్చు. ఈ పరిస్థితిని హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS) అంటారు. హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (HPS) ప్రాణాంతక శ్వాసకోశ సమస్యలు, కొన్ని పరిస్థితులలో మరణానికి కారణమవుతుంది.
ఎలుక కాటు జ్వరం
ఎలుక కాటుతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎలుక కాటు జ్వరం ఈ ప్రాణాంతకమైన అంటు వ్యాధి ఎలుకలతో ప్రత్యక్ష సంబంధం, వాటి కాటు లేదా వాటి గీతలు ద్వారా కూడా సంక్రమించవచ్చు. ఈ జ్వరానికి సంబంధించిన పరిస్థితులు తీవ్రంగా ఉంటే.. వీలైనంత త్వరగా వైద్య సాయం పొందడం అవసరం. అంతేకాదు ఎలుకలతో ప్లేగు వ్యాధి కూడా వస్తుంది.
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్
లెప్టోస్పిరోసిస్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఎలుకలు ఈ ఇన్ఫెక్షన్‌ను మోసుకెళ్తాయని అంటారు. అవి మీకు తాకినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అవి చిన్న ఫ్లూ లాంటి లక్షణాల నుండి మూత్రపిండాలు, కాలేయానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలను కూడా కలిగించవచ్చు.
సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్
ఎలుకలు సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనితో జ్వరం, పొత్తికడుపులో తిమ్మిరి, విరేచనాలు వంటి లక్షణాలను ఉంటాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు. ఎలుక కాటుకు గురైతే తప్పకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఎలుక కొరికితే ఇలా చేయండి
ఎలుకలను చేతిలో పట్టుకుంటే కొరుకుతాయి. మీరు ఎలుక కరిచినట్లయితే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ఇన్ఫెక్షన్, జ్వరం కలిగిస్తుంది. ఎలుకల వల్ల కలిగే ప్రమాదాన్ని నివారించడానికి ఈ కింది సలహాలను పాటించడం మంచిది.
పంజరంలో చిక్కుకున్న ఎలుకలను తాకవద్దు. అవి కొరకవచ్చు. ఎలుక కొరికితే రక్తం ఎక్కువగా వెళ్లకుండా చూసుకోవాలి. చాలా చల్లటి నీళ్లను గాయానికి పూయడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. రక్తస్రావం ఆగిన తర్వాత సబ్బును రాసి వేడి నీటిలో బాగా కడగాలి.
గాయాన్ని తుడిచి డ్రెస్సింగ్ చేసేటప్పుడు యాంటీబయాటిక్ మందు వేయడం మంచిది. ఎందుకంటే ఎలుక కొరికితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ.
ఎలుక వేలిని కొరికితే, వేలి నుండి ఉంగరాలను తీసివేయండి. లేదంటే వేళ్లు ఉబ్బిపోయి ఉంగరం బిగుసుకుపోయి మరింత నొప్పి వస్తుంది.
ఎలుక కొరికితే దాహం, పెదవులు పొడిబారడం, కరిచిన ప్రదేశంలో ఎరుపు, వేడి అనుభూతి, దురద అనిపిస్తుంది. ఎలుక కొరికితే డాక్టర్‌ని కలవడం మంచిది. ఎలుక కాటు వేసిన 10 రోజుల తర్వాత జ్వరం కనిపించవచ్చు. గాయం పొడిగా ఉన్నప్పటికీ, జ్వరం ఎక్కువగా ఉంటుంది.
ఎలుక కొరికిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. లేదంటే సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు.