Omicron BF.7 symptoms: నీళ్ల విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలూ బీఎఫ్.7 లక్షణాలే-know these omicron bf 7 symptoms including diarrhea gastric problems and uncontrolled diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Omicron Bf.7 Symptoms: నీళ్ల విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలూ బీఎఫ్.7 లక్షణాలే

Omicron BF.7 symptoms: నీళ్ల విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలూ బీఎఫ్.7 లక్షణాలే

HT Telugu Desk HT Telugu
Published Dec 22, 2022 06:01 PM IST

Omicron BF.7 symptoms: కోవిడ్ ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 లక్షణాల్లో నీళ్ల విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలూ ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు.

కోవిడ్ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ లక్షణాలు
కోవిడ్ ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ లక్షణాలు (HT_PRINT)

ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ బీఎఫ్.7 చైనాలో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు భారీగా పెరిగేలా చేసింది. అదే వేరియంట్‌కు సంబంధించి 4 కేసులు ఇండియాలో కూడా నమోదయ్యాయి. అయితే దీనిపై ఇప్పటికైతే ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ యంత్రాంగం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అవసరమైన సందర్భాల్లో టెస్టులు చేయించుకోవాలని, అర్హులంతా బూస్టర్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెబుతున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్ట వచ్చని చెబుతున్నారు.

భారత దేశంలో కోవిడ్ కేసులు ఇప్పటి వరకైతే నియంత్రణలో ఉన్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున వాక్సిన్లు చేయించుకోవడం కోవిడ్ వ్యాప్తి అదుపులో ఉండడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత వేరియంట్‌కు సంబంధించిన సాధారణ, అసాధారణ లక్షణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కోవిడ్ ఒమిక్రాన్ బీఎఫ్.7 సబ్‌వేరియంట్ లక్షణాల్లో జ్వరం, చలి, దగ్గు, అలసట, ఒళ్లునొప్పులు, రుచి, వాసనలు కోల్పోవడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ సబ్‌వేరియంట్‌ వైరస్ సోకితే కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ (జీర్ణ వ్యవస్థ సంబంధిత) లక్షణాలు, చర్మ సమస్యలు, కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. నియంత్రణలో లేని డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, తీవ్రమైన వీక్‌నెస్ కూడా కోవిడ్ లక్షణాలేనని నిపుణులు చెబుతున్నారు

సీకే బిర్లా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం వైద్య నిపుణులు డాక్టర్ రాజీవ్ గుప్తా ఈ అంశంపై హెచ్‌టీ డిజిటల్‌తో మాట్లాడారు.

Common Covid-19 symptoms: కోవిడ్-19లో సాధారణ లక్షణాలు

‘జ్వరం, అధిక జ్వరం, దగ్గు-లోజ్వరం, గొంతు నొప్పి, చాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం, నీరసం, తలనొప్పి, కళ్ల చుట్టూ నొప్పి, వాసన కోల్పోవడం, రుచి కోల్పోవడం వంటివి కోవిడ్ 19లో కనిపించే సాధారణ లక్షణాలు. కొందరు పేషెంట్లలో వికారం, డయేరియా ఉంటాయి..’ డాక్టర్ గుప్తా అని వివరించారు.

Unusual Covid-19 symptoms: కోవిడ్ 19 అసాధారణ లక్షణాలు

వాంతులు, విరేచనాలు

గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కోవిడ్‌లో సహజం. కానీ కొందరిలో ఇవేవీ కనిపించవు. అలాంటి కేసుల్లో ఆయా పేషెంట్లు వాంతులు, వికారం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డయేరియాతో పాటు కడుపు నొప్పి కూడా ఉంటుంది. దానిని ఒక్కోసారి గ్యాస్ట్రోఎంటరైటిస్ లేదా టైఫాయిడ్ ఫీవర్‌గా పొరపాటు పడుతుంటారు.

Rashes or blistering: దద్దుర్లు పొక్కులు

కొందరు పేషెంట్లలో దద్దుర్లు, పొక్కులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని, ద్రవంతో ఉన్న పొక్కులు కూడా కనిపిస్తాయని డాక్టర్ గుప్తా చెప్పారు. దీనిని వేరే ఏదో సమస్యగా పొరబడుతుంటారని వివరించారు.

Confusion, hallucinations: కన్ఫ్యూజన్, భ్రాంతి

కోవిడ్ కేంద్ర నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా కన్ఫ్యూజన్, మతిమరుపు, భ్రాంతి వంటి సమస్యలు కనిపిస్తాయి. కోవిడ్ వల్ల గుండె సంబంధిత జబ్బులు, శ్వాస కోసం సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Uncontrolled diabetes: అదుపులో లేని డయాబెటిస్

కోవిడ్ కారణంగా డయాబెటిస్ వచ్చే సమస్యలు ఉన్నాయి. ఇదివరకే డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజు స్థాయిలు ఇంకా ఎక్కువవ్వొచ్చు.

Kidney issues: కిడ్నీ సమస్యలు

కోవిడ్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీడీకే) ఉన్న వారు, డయాలసిస్ చేయించుకుంటున్న వారిలో కోవిడ్ వస్తే ఆ వ్యాధులు మరింత ముదురుతాయి. ఇతర వ్యాధులు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఇంకా సమస్యాత్మకంగా మారుతాయి.

Extreme weakness: తీవ్రమైన నీరసం

కోవిడ్ వచ్చి పోయిన చాలా కాలం తరువాత కూడా తీవ్రమైన నీరసం కనిపిస్తుంది. తీవ్రమైన అలసట కనిపిస్తుంది. అయితే ఈ లక్షణాలను వేరే వ్యాధులుగా భావించే అవకాశం ఉందని డాక్టర్ గుప్తా వివరించారు.

Whats_app_banner