Weekend Motivation | ఎప్పుడూ డబ్బు సంపాదనేనా? జ్ఞాపకాలు సంపాదించుకోండి, జీవితాన్ని ఆస్వాదించండి!
Weekend Motivation: జీవితంలో చిన్నచిన్న ఆనందాలను, మీరు ఎంత డబ్బు పోసినా కొనలేరు, అప్పుడు మీ వద్ద ఎంత డబ్బు ఉండి ఏం లాభం. ఈ కథ చదవండి.. ఆదివారాన్ని హుషారెత్తించండి.
Weekend Motivation: కొంతమంది సంపాదనే జీవితం, జీవితమే సంపాదన అన్నట్లుగా కష్టపడతారు. తమకు తమ పని, వ్యాపారాలు తప్ప వేరే ధ్యాసే ఉండదు. నిజమే సుఖంగా జీవించడానికి డబ్బు అవసరమే, కష్టపడటంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఎంతవరకు? నీ జీవితం మొత్తం ఇలాగే కష్టపడుతూ పోతే ఇంక సుఖపడేదెప్పుడు, సంతోషంగా జీవించేది ఎప్పుడు? డబ్బు ధ్యాసలో పడి మీరు మీ జీవితాన్ని కోల్పోవడం లేదు కదా? మీకంటూ కొన్ని మధుర జ్ఞాపకాలైనా ఉండాలి కదా? తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీ వద్ద చాలా డబ్బు ఉంటుంది, కానీ మీతో అయిన వాళ్ల ప్రేమ ఉండదు, వారితో మీరు పంచుకునే అపురూప క్షణాలు ఉండవు. చివరకు మీరు కోల్పోయిన కొన్ని చిన్నచిన్న ఆనందాలను, మీరు ఎంత డబ్బు పోసినా కొనలేరు, అప్పుడు మీ వద్ద ఎంత ఆస్తి ఉండి ఏం లాభం, మీరు ఎంత ధనవంతులై ఏం లాభం. గడిచిన సమయం తిరిగి రాదు, అందుకే సమయం అన్నింటికన్నా విలువైనది అని చెబుతారు. ఇక్కడ మనమొక చిన్న కథ చెప్పుకుందాం. ఇది అందరికీ తెలిసిన కథే కావచ్చు, కానీ మిమ్మల్ని ఆలోచింపజేసే కథ.
ఒకసారి ఒక మత్స్యకారుడు సముద్రపు ఒడ్డున ఒక చెట్టు నీడలో కూర్చుని బీడీ తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఒక ధనిక వ్యాపారి అతని వద్దకు వచ్చి, ఇలా చెట్టుకింద హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకోడానికి నీకు సిగ్గుగా లేదా? ఎందుకు పనిలేకుండా కూర్చున్నావు అంటాడు. దానికి ఆ పేద మత్స్యకారుడు తనకు రోజుకు సరిపడా చేపలు దొరికాయని బదులిస్తాడు.
అది విని ఆ ధనవంతుడు కోపం తెచ్చుకుని.. ఇలా ఖాళీగా కూర్చొనే బదులు ఇంకా ఎక్కువ చేపలు పట్టుకోవచ్చు కదా అంటాడు.
మత్స్యకారుడు మాట్లాడుతూ మరిన్ని చేపలను పట్టుకొని నేను ఏమి చేస్తాను? అంటాడు.. అందుకు ధనిక వ్యాపారి స్పందిస్తూ ఎక్కువ చేపలు పడితే, ఎక్కువ అమ్ముకోవచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు, పెద్ద పడవను కొనుగోలు చేయవచ్చు. నాలాగా నువ్వు ధనవంతుడిలా మారవచ్చు అంటాడు..
ధనికుడి మాటలకు మత్స్యకారుడు నవ్వి, మీలా ధనవంతుడిగా మారితే ఏంటి ఉపయోగం అంటాడు. మత్స్యకారుడి మాటలను మూర్ఖపు మాటలుగా భావించిన ధనికుడు.. ఓరి పిచ్చివాడా ఎక్కువ డబ్బు సంపాదించి, ధనవంతుడిగా మారితే జీవితాన్ని ప్రశాంతగా, ఆనందగా ఆస్వాదించవచ్చు అని హితబోధ చేస్తాడు. అందుకు మత్స్యకారుడు ధనవంతుడి వైపు ఒక చూపు చూసి ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా అంటూ హాయిగా రిలాక్స్ అవుతాడు. మత్య్సకారుడి మాటకి ధనిక వ్యాపారి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కసారిగా ఆలోచించి ఇతడు చెప్పింది నిజమే కదా అనుకుంటాడు. ప్రశాంతంగా, ఆనందంగా బ్రతకడానికి డబ్బే ఉండనవసరం లేదని జ్ఞానోదయం పొందుతాడు.
నీతి ఏమిటి? రేపు సంతోషంగా ఉండటానికి ఈరోజు మీ జీవితంలోని ఆనందాన్ని కోల్పోనవసరం లేదు. మనకు ఉన్నది ఒక్కటే జీవితం, ఈ క్షణాన్ని మనసారా ఆస్వాదించండి, సంతోషంగా జీవించండి. ఈ ఆదివారాన్ని సెలవు రోజును హాయిగా గడపండి. హ్యాప్పీ సండే!
సంబంధిత కథనం