Wednesday Motivation : మీరు నాస్తికులైనా పర్లేదు కానీ.. రోజు చివరిలో ఓ ప్రార్థన చేయండి-wednesday motivation prayer is the most important conversation of the day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : మీరు నాస్తికులైనా పర్లేదు కానీ.. రోజు చివరిలో ఓ ప్రార్థన చేయండి

Wednesday Motivation : మీరు నాస్తికులైనా పర్లేదు కానీ.. రోజు చివరిలో ఓ ప్రార్థన చేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 04, 2023 06:30 AM IST

Wednesday Motivation : ఓ మనిషి జీవితంలో ప్రార్థన అనేది అత్యుత్తమైన భాగాలలో ఒకటి. ఓ రకంగా చెప్పాలంటే ప్రార్థన అనేది దేవుడికి మన అవసరాలు చెప్పడం కాదు. మనకి ఏమి కావాలో కోరుకుంటూ.. దైవానికి చెప్తున్నట్లు మనతో మనం మాట్లాడుకోవడం. కాబట్టి మీరు దైవాన్ని నమ్మినా.. నాస్తికులైనా.. ప్రార్థన చేయండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : మీరు నాస్తికులైనా.. దైవ భక్తిని కలిగి ఉన్నవారు అయినా సరే.. మీరోజు చివరిలో ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏదో అనేసుకోకండి. మన అంతరంగంతో మాట్లాడుకోవడమే ప్రార్థన చేయడం. మీరు ఏమి కావాలనుకుంటున్నారో.. మీకు ఏది వద్దో.. మీకు ఏది అవసరమనే విషయాలు గుర్తించి.. దేవుడికి విన్నవించుకోవడమే ప్రార్థన. దైవం ఉందని నమ్మేవారికి ఇది ప్రార్థనే అయినా.. దైవం నమ్మనివారికి కూడా దీనివల్ల లాభం ఉంది. రోజూ చివరిలో మీకు కావాల్సిన అంశాలను గురించి.. జరిగిన వాటి గురించి అంతర్గతంగా చర్చించుకోవడమే ప్రార్థన.

మీరు దీనిని అలవాటు చేసుకోవడం వల్ల మీకు జీవితంలో చాలా క్లారిటీ వస్తుంది. చాలామంది తమకి ఏమి కావాలో.. ఏమి వద్దో అనే విషయాలు తేల్చుకోలేరు. కొన్ని విషయాలను ఎటూ తేల్చుకోలేరు. అలాంటి వారికి ప్రార్థన అనేది ఓ వరం అని చెప్పవచ్చు. దేవుడిని కోరుకునే నేపథ్యంలో మనం కొన్ని విషయాల పట్ల క్లారిటీ తెచ్చుకుంటాము. ఇలా చేయడం వల్ల మీ దైవం మీ కోరికలు విన్నా.. వినకపోయినా.. మీకు కావాల్సిందేమిటో మీకో క్లారిటీ వచ్చేస్తుంది. తద్వారా ఎలా ముందుకు వెళ్లాలో మీరే డిసైడ్ చేసుకుంటారు. మనకి ఏమి కావాలో తెలిసినప్పుడు.. దానికోసం కృషి చేస్తున్నప్పుడు కాలం కూడా మీకు సహకరిస్తుంది.

మీరు రోజంతా అలిసిపోయి.. ఇంటికి వచ్చి.. కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు. కానీ కొన్ని సంఘటనలు మిమ్మల్ని వెంటాడుతాయి. ప్రశాంతంగా పడుకోనివ్వవు. ఆ సమయంలో మీరు భయంతో లేదా బాధతో నిద్రకు దూరంగా ఉంటారు. కానీ మీరు అప్పుడు ఓ ప్రార్థన చేసుకున్నా.. లేదా ప్రశాంతమైన వాతావరణంలో అంతర్గతంగా మాట్లాడుకున్నా.. మీకు చాలా విషయాలపై క్లారిటీ వచ్చేస్తుంది. సరి కదా మీ బాధ కూడా దూరం అవుతుంది. తెలియకుండానే మీరో రకమైన హాయిని పొందుతారు. అంతే కాదు మీ భారాన్ని.. దైవానికి చెప్పి.. మీ హృదయంలోని బరువు తగ్గించుకుంటారు. ఎవరికైనా చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అంటారు కదా.. మీ దైవం మీ మాట వింటుందని నమ్మి.. మీ కష్టాలను, బాధలను వారికి చెప్పేసి హ్యాపీగా పడుకోండి. ఎలాగూ వాటిని క్లియర్ చేసుకోవాల్సింది మీరే. మీరు నమ్మే దైవమే మీకు ఇలా చేయడం వల్ల.. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ధైర్యాన్ని ఇస్తుందేమో.

మనకి ఎంత క్లోజ్ ఉన్నవారితోనైనా ఏదైనా విషయాలు షేర్ చేసుకునేప్పుడు మూడవ పర్సన్ ఉంటే మనకు నోట మాటరాదు. కానీ మీ దైవంతో మాట్లాడేప్పుడు ఏ థర్డ్ పర్సన్ ఉండడు. కాబట్టి మీ కష్టాలను, బాధలను సిగ్గువిడిచి చెప్పవచ్చు. ఎవరూ వినట్లేదు అనే ఆలోచన.. మీ భావనలకు ఫిల్టర్ లేకుండా.. ఓపెన్ గా చెప్పేలా చేస్తుంది. దీనివల్ల మీ మనసు కచ్చితంగా తేలికపడుతుంది. ప్రార్థన అనేది ఓ మెడిటేషన్ వలె ఫీల్ అవ్వండి. కచ్చితంగా ఇది మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. అంతేకాకుండా మరుసటి రోజు.. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి.. మీ దినచర్యలో ప్రార్థనలను చేర్చుకోండి. దైవంపై కాకపోయినా మీపై మీరు నమ్మకం ఉంచండి. మీరు ప్రేరణ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీలోనే దైవం ఉందని గుర్తించండి. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం