Brestfeeding tips: ఏడాది దాటిన పిల్లల చేత తల్లిపాలు మానిపించేందుకు చిట్కాలు ఇవిగో-ways to stop breastfeeding a toddler here are some tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brestfeeding Tips: ఏడాది దాటిన పిల్లల చేత తల్లిపాలు మానిపించేందుకు చిట్కాలు ఇవిగో

Brestfeeding tips: ఏడాది దాటిన పిల్లల చేత తల్లిపాలు మానిపించేందుకు చిట్కాలు ఇవిగో

Haritha Chappa HT Telugu
Sep 23, 2024 08:00 AM IST

Brestfeeding tips: చంటి బిడ్డల ఎదుగుదలకు తల్లిపాలు చాలా అవసరం. వారికి ఏడాది వయసు దాటాక ప్రతి తల్లీ తమ బిడ్డకు తల్లిపాలు మానిపించేందుకు ప్రయత్నిస్తుంది. తల్లిపాలు పిల్లలు చేతే మానిపించేందుకు మేము ఇక్కడ కొన్ని చిట్కాలు ఇచ్చాము.

తల్లిపాలు పిల్లల చేత మానిపించడం ఎలా?
తల్లిపాలు పిల్లల చేత మానిపించడం ఎలా?

బిడ్డ పుట్టాక తల్లి జీవితమే మారిపోతుంది. బిడ్డకు కనీసం ఆరు నెలల పాటు తల్లి పాలు ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. తల్లి పాలు బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి, వారి శరీరం ఎదగడానికి సహాయపడతాయి. కొంతమంది తల్లులు ఏడాది వయసు దాటిన పిల్లలకు తల్లిపాలు మానిపించాలని చూస్తుంటారు. కానీ పిల్లలు మానేందుకు ఇష్టపడరు. అలాగే తల్లులు కూడా బిడ్డకు పాలు మానిపించేందుకు చాలా కష్టపడతారు. ఏం చేయాలో వారికి తెలియదు. తల్లిమనసు పాలు పెట్టాలని చెబుతుంది, కానీ ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బరువులు వారికి పాలు పెట్టేంత తీరికను, ఓపికను ఇవ్వవు. అటువంటి పరిస్థితిలో మీ బిడ్డకు పాలు మానిపించాలని భావిస్తే కొన్ని చిట్కాలను పాటించండి.

నిర్ణయానికి కట్టుబడి ఉండండి

మీరు మీ బిడ్డకు తల్లి పాలివ్వడాన్ని ఆపివేయాలని నిర్ణయించుకున్న తర్వాత, ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే మీరు బిడ్డకు పాలు ఆపేసిన కొత్తల్లో ఆమె ఏడవడం, లేదా అరవడం చేస్తూ ఉంటుంది. పాలు తాగేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడు మీ తల్లి మనసు కరిగిపోతే ఆ పాప లేదా బాబు పాలు మానడం కష్టంగా మారుతుంది.

మీ పాలకు ప్రత్యామ్నాయం

మీరు తల్లి పాలివ్వడాన్ని ఆపివేసినప్పుడు లేదా తగ్గించినప్పుడు, పిల్లల ప్రవర్తన మారుతుంది. బిడ్డకు తల్లి పాలు తక్కువగా ఇవ్వాలనుకున్నా, మానిపించాలనుకున్నా వారికి సరైన ప్రత్యామ్నాయాన్ని చూపించండి. పాల డబ్బాలు, సిప్పర్ లు అలవాటు చేయండి. టేస్టీ రుచులను అలవాటు చేయండి. వారి వయసుకు తగ్గట్టు కొత్త ఆహారాన్ని పరిచయం చేయండి.

వీటికి సిద్ధంగా ఉండండి

మీరు తల్లి పాలివ్వడాన్ని తగ్గించాలని లేదా ఆపాలని నిర్ణయించుకున్నప్పుడు, మీ పిల్లవాడు బాగా అల్లరి చేయడం, ఏడవడం చేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితులకు ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉండండి. ఓపికను తెచ్చుకోండి.

పొట్ట నిండా తినిపించండి

మీ బిడ్డకు ఆకలి వేస్తేనే మిమ్మల్ని పాలు పెట్టమని అడుగుతారు. కాబట్టి మీ పిల్లలకు ఆకలి వేయకుండా ముందుగానే ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. వారికి ఏడాది వయసు దాటాక మెత్తగా వండిన అన్నం, పప్పు, క్యారెట్లు వంటివి పెట్టవచ్చు. అలాగే ఇంటో తీసిన పండ్ల రసాలు వంటివి తాగించవచ్చు. వాటన్నింటినీ రెడీగా పెట్టుకుని ఉండండి. ఆ పిల్లాడు అడగక ముందే వాటిని తినిపించండి.

పాలు మానిపించాలన్న నిర్ణయం తీసుకుంటే… ఒక్కసారిగా వారిని తల్లిపాలకు దూరం చేయవద్దు. ఇది వారిలో భయాన్ని, ఆందోళనను పెంచుతుంది. క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. పాలు మానిపిస్తున్నప్పుడే వారితో మీర ఎక్కువ సమయం గడపాలి. అది వారిలో ఎలాంటి భయం వేయకుండా చూస్తుంది.

ఇంట్లోనే సులువుగా పిల్లల చేత పాలు మానిపించవచ్చు. అలాగే పాల ఉత్పత్తిని కూడా తగ్గించుకోవచ్చు. పెప్పర్ మింట్ నూనెను రొమ్ములకు అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. పిప్పరమెంటు నూనె వాసనకు పిల్లలు కూడా తాగేందుకు ఇష్టపడరు.

క్యాబేజీ ఆకులను బాగా కడిగి ఫ్రిజ్ లో పెట్టి వాటిని చల్లగా అయ్యేలా చేయాలి. ఆ ఆకులను నేరుగా రొమ్ముల మీద పెట్టుకోవాలి. వాటిని అలా పెట్టి బ్రా ధరించాలి. వాటిని ఎక్కువ సేపు ఉంచడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. దీన్నే కోల్డ్ థెరపీ అని కూడా అంటారు. వెల్లుల్లి రసం లేదా అల్లం రసం వంటివి మీ చనుమొనలకు రాస్తే వాటి రుచి మీ పిల్లలకు నచ్చదు కనుక తాగడం మానేస్తారు.

Whats_app_banner