Friday Motivation: ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే కోడి కూయక ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి
Friday Motivation: మనదేశంలోని ధనవంతుల జాబితాను ఒకసారి చూడండి. వారిలో ఎవరూ కూడా ఉదయం ఆరు దాటాక నిద్రలేచేవారు కాదు. అందరూ కోడి కూయక ముందే లేచి తమ పనులను మొదలు పెడతారు.
Friday Motivation: మనదేశంలో అత్యంత ధనవంతులు అనగానే అందరికీ గుర్తొచ్చేది అంబానీలు, అదానీలే. వీరి విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వీరందరికీ కామన్ గా ఉండే ఒక అలవాటు మాత్రం కోడి కూయకముందే తెల్లవారుజామునే లేవడం. అలా లేచి తమ పనులు ప్రారంభిస్తారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని ధనవంతుల్లో 75 శాతం మంది ఇలా తెల్లవారుజామునే లేస్తారట.
మన దేశంలో అపర కుబేరుడు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ. అతని జీవనశైలి చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. కొడుకు పెళ్లి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి ఉదయం లేచేది మాత్రం నాలుగు గంటలకే. ఐదింటికల్లా ఆయన సాధారణ దినచర్య మొదలైపోతుంది. అతనికి ఉదయం నాలుగ్గంటలకే మెలకువ వచ్చినా నిద్రమత్తు వదిలించుకొని సాధారణ పనుల్లోకి దిగేందుకు కొంత సమయం తీసుకుంటారు. అలా ఐదు గంటల నుంచి వ్యాయామంతో తన పనులు మొదలుపెడతారు. కాసేపు ఈత కొడతారు. వార్తాపత్రికలు చదువుతారు. స్నానం చేసి బ్రేక్ ఫాస్ట్ తింటారు. ఎనిమిదిన్నరకల్లా కచ్చితంగా తన ఆఫీసుకు చేరుకుంటారు. తన తండ్రి తన రోల్ మోడల్ అని, అతను ఏ రోజూ పొద్దెక్కదాకా నిద్ర పోవడం తాను చూడలేదని అంటాడు ముకేశ్ అంబానీ.
ఇక పెప్సికో అధినేత్రి ఇంద్రానూయి. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. నిద్రకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఆమె. తన ముగ్గురు పిల్లలు పుట్టాక ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం తగ్గిపోయిందని, అదే తనకు అలవాటైపోయింది అని అంటారు. అందుకే ఆ అలవాటు వల్లే ఉదయం నాలుగ్గంటలకే ఆమె నిద్రలేస్తారు. ఏడింటికల్లా ఆఫీసులో ఉంటారు. సాధారణ ఉద్యోగిలాగే తన సమయాన్నికల్లా ఆఫీస్‌కి చేరుకుంటారు. అంత క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి ప్రపంచంలోనే విజయవంతమైన, శక్తివంతమైన మహిళగా పేరు తెచ్చుకున్నారు.
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ కూడా తెల్లవారుజామున 4:30కే నిద్రలేస్తారు. అతను నివసించే బంగళాలో 4:30 నుంచే బల్పుల వెలుగులు మొదలవుతాయి. ఒక కాఫీ తాగి రోజును మొదలు పెడతారు. ఆయన ఆఫీస్ పనిని ఉదయం ఐదు గంటలకే ప్రారంభిస్తారు. ఇంత కష్టపడతారు కాబట్టే విప్రోను దేశ విదేశాలకు వ్యాపించేలా చేశారు. కేవలం వీరే కాదు సిస్కో, మోటరోలా వంటి సంస్థలకు పని చేసిన వ్యాపార దిగ్గజం పద్మశ్రీ వారియర్, ఆపిల్ సీఈవో టీమ్ కుక్ వంటి వారంతా కూడా ఉదయం నాలుగున్నరకే నిద్ర లేవడం అలవాటు చేసుకున్నారు.
తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని, శరీరం ఉత్సాహంగా పనిచేస్తుందని చెబుతారు. అంతేకాదు రోజుల్లో ఎంతో సమయం మిగిలిపోయినట్టు అనిపిస్తుందని, ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి అధికంగా నిద్రపోయేవారు వీరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధనవంతులు కావాలని కోరుకుంటే సరిపోదు, అందుకు తగ్గట్టు కృషి కూడా చేయాలి. పొదెక్కదాకా నిద్రపోయేవారు ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు.