Valentine's Day Banned : ఇక్కడ వాలెంటైన్స్ డే జరుపుకోవడం దేశద్రోహం.. జరిపితే జైలుకే!
Valentine Day 2024 : ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకొంటారు. కానీ కొన్ని దేశాలు మాత్రం వాలెంటైన్స్ డేని నిషేధించాయి.
ఫిబ్రవరి అంటేనే ప్రేమ నెల. ఫిబ్రవరి 7న మెుదలయ్యే వాలెంటైన్స్ వీక్.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోబోయే విషయం ఏంటంటే.. ప్రేమ అనేది అందరికీ సాధారణం.., కానీ వాలెంటైన్స్ డే మాత్రం కాదు. కొన్ని దేశాల్లో ప్రేమికుల దినోత్సవం జరుపుకోరు. ఆ దేశాలు ఏంటో చూద్దాం..
సౌదీ అరేబియా నైరుతి ఆసియాలో ఉన్న ఒక ముస్లిం దేశం. అరేబియా ద్వీపకల్పంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తుంది. సౌదీ అరేబియాలో బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడం నిషేధించబడినందున, వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఆ దేశ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. సౌదీ అరేబియాలో అనేక దేశాల నుండి అన్ని మతాల కార్మికులు ఉంటారు. ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో విదేశీయులు ప్రవేశించడానికి, పని చేయడానికి అనుమతించారు. కానీ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం మాత్రం నిషేధం. ఎర్ర గులాబీలు, టెడ్డీ బేర్స్ వంటి వాలెంటైన్స్ డేకి సంబంధించిన ఏవైనా వస్తువులను కూడా ఆ రోజుల్లో ఎవరూ కొనరు.
ఈ రోజున షాపులపై అధికారులు దాడులు చేసే అవకాశం కూడా ఉంది. వాలెంటైన్స్ డేకి సంబంధించిన ప్రతి వస్తువును జప్తు చేయడంతోపాటు చట్టాన్ని ఉల్లంఘించే షాపు యజమానులను అరెస్టు చేసి శిక్షిస్తారు.
ఉజ్బెకిస్తాన్ విభిన్న సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. 2012 వరకు వాలెంటైన్స్ డే వేడుకలు చేసేవారు. తర్వాత ఆ రోజును జరుపుకోవడానికి వ్యతిరేకంగా దేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వాలెంటైన్స్ డేని పాటించే బదులు, ఉజ్బెకిస్తాన్‌లోని ప్రజలు తమ దేశ వీరుల పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే ఇక్కడ చట్టవిరుద్ధం కాదు, కానీ బాబర్‌ను స్మరించుకోవడం కోసం ఆ రోజును తగ్గించేశారు.
ఇండోనేషియాలో ఈ రోజు జరుపుకోవడాన్ని నిషేధించే చట్టం లేదు. కానీ కొన్ని కారణాల వలన ఇక్కడ వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఆపేశారు. వాలెంటైన్స్ డే వివాహానికి ముందు సెక్స్ ను ప్రోత్సహిస్తుందనే ప్రచారం ఇక్కడ ఎక్కువగా చేశారు. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం నిర్వహించుకుంటారు.
ఇరాన్‌లో ప్రేమికుల రోజున బహుమతులు, వాలెంటైన్స్ డేకి ఇచ్చుకునే ఉత్పత్తుల తయారీని ప్రభుత్వం నిషేధించింది. ఈ వాలెంటైన్స్ డే వేడుక పాశ్చాత్య సంస్కృతిగా చెబుతారు ఇక్కడ. వాలెంటైన్స్ డే స్థానంలో మెహ్రేఖాన్‌తో అనే పండుగను నిర్వహిస్తారు.
పాకిస్థాన్‌లోనూ వాలెంటైన్స్ డే వేడుకులను నిషేధించారు. ప్రేమికుల దినోత్సవం యువ తరంలో ప్రాచుర్యం పొందడంతో వేడుకకు వ్యతిరేకంగా దేశంలో అనేక అల్లర్లు జరిగాయి. ఈ రోజును నిషేధించాలని కోరుతూ ఒక పౌరుడు ఇస్లామాబాద్‌లోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఫిబ్రవరి 7, 2018న హైకోర్టు వాలెంటైన్స్ డే వేడుకలు, మీడియా కవరేజీని నిషేధించింది. పాశ్చాత్య సాంస్కృతిక అని పేర్కొంది. పాకిస్తాన్‌లోని ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు, కానీ నిషేధం నేటికీ ఉంది.
2005 నుండి మలేషియాలో వాలెంటైన్స్ డే వేడుకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు యువతలో దురదృష్టం, చెడు ఆలోచనలకు ప్రవేశ ద్వారం అని ప్రచారం చేశారు. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే వ్యతిరేక ప్రచారం కూడా నిర్వహిస్తారు. బయటకు వెళ్లి సంబరాలు చేసుకునే వారు అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఇక్కడ ఉంది.