Malaysia Masters 2023: చరిత్ర సృష్టించిన ప్రణయ్.. మలేషియా మాస్టర్స్ టైటిల్ సొంతం చేసుకున్న షట్లర్
Malaysia Masters 2023: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. మలేషియా మాస్టర్స్ టైటిల్‌ను గెలిచిన అతడు ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా రికార్డు సృష్టించాడు. ఫైనల్‌లో వెంగ్ హాంగ్‌పై గెలిచాడు.
Malaysia Masters 2023: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. బీడబ్ల్యూఎఫ్ టోర్నీ అయిన మలేషియా మాస్టర్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్‌లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్‌పై గెలిచి టైటిల్ సాధించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో 30 ఏళ్ల ప్రణయ్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్. గంటా 34 నిమిషాల పాటు నువ్వా నేనా అంటు జరిగిన మ్యాచ్‌లో భారత్ స్టార్.. చైనా షట్లర్‌ను మట్టి కరిపించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌ను ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు పైచేయి భారత షట్లర్‌దే అయింది. ఫలితంబా బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను తొలిసారిగా ముద్దాడాడు.
ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో వెంగ్ హాంగ్‌ను ప్రణయ్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరి మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో వెంగ్ హాంగ్ 5-7తో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. అద్భుతంగా పుంజుకున్న ప్రణయ్ 9-9 స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత 15-12తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్.. చివరి వరకు తీవ్రంగా శ్రమించాడు. ఆఖరుకు 21-19 తేడాతో ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
తొలి సెట్ కోసం చెమటలు చిందించిన ప్రణయ్.. రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేశాడు. ప్రత్యర్థి ఎటాకింగ్ మోడ్‌లో ఆడాడు. 13-17 తేడాతో వెంగ్ హాంగ్ ఆధిక్యంలోకి వచ్చి దాన్ని అలాగే చివరి వరకు కొనసాగించాడు. ఫలితంగా ఆ సెట్‌ను ప్రణయ్ 13-21 తేడాతో ఓడిపోయాడు. దీంతో మూడో సెట్ కీలకంగా మారింది.
గెలుపును నిర్దేశించే ఈ మూడో గేమ్‌లో ప్రణయ్-వెంగ్ హాంగ్ ఎక్కడా తగ్గలేదు. ఆరంభం నుంచి సమంగా రాణించారు. మొదటి అర్ధ భాగం వరకు ఇరువురు నువ్వా నేనా అంటూ పోరాడగా.. రెండో సగం భాగం నుంచి ప్రణయ్ గేరు మార్చారు. వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్‌పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి చివరకు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఫలితంగా మలేషియా మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
మలేషియా మాస్టర్స్ మహిళల విభాగంలో గతంలో 2013, 2016 సీజన్‌లో పీవీ సింధు విజేతగా నిలిచింది. 2017లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి షట్లర్ ప్రణయ్‌నే. ఫలితంగా మలేషియా మాస్టర్స్ సాధించిన తొలి పురుష భారత షట్లర్‌గా రికార్డు సృష్టించాడు ప్రణయ్.