India Open 2023: ఇండియాలో ప్రస్తుతం పురుషుల బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్. అలాంటి ప్లేయర్ స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ 2023లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ప్రణయ్‌ను మరో యంగ్ సెన్సేషన్, డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్యసేన్ ఇంటిదారి పట్టించడం విశేషం.
మంగళవారం (జనవరి 17) జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ 8 ప్లేయర్ అయిన లక్ష్యసేన్.. రెండు వరుస గేమ్స్‌లో గెలిచాడు. మ్యాచ్ మొత్తం పూర్తి ఆధిపత్యం చెలాయించిన లక్ష్యసేన్.. 21-14, 21-15 తేడాతో ప్రణయ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో చాలా అనవసర తప్పిదాలు చేసిన ప్రణయ్.. మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నాడు.
మరోవైపు లక్ష్యసేన్ మాత్రం చాలా దూకుడుగా కనిపించాడు. కోర్టులో వేగంగా కదిలిన అతడు.. ప్రణయ్‌ను ఆశ్చర్యానికి గురి చేశాడు. బాడీ షాట్స్‌తోపాటు నెట్ ముందు తెలివైన షాట్లతో ప్రణయ్‌ను బోల్తా కొట్టించాడు. గతేడాది టాప్ ఫామ్‌లో కనిపించిన లక్ష్యసేన్‌కు ఇండియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే ప్రణయ్‌ను ఓడించడం అతని కాన్ఫిడెన్స్‌ను పెంచేదనే చెప్పాలి.
2022లో ఇండియా తొలిసారి థామస్ కప్ గెలవడంలోనూ లక్ష్యసేన్ కీలకపాత్ర పోషించాడు. ప్రణయ్‌తో కలిసే అతడు ఇండియాకు ఊహించని విజయాన్ని అందించాడు. అయితే ఇప్పుడీ ఇండియా ఓపెన్‌లోనూ ఫేవరెట్స్‌లో ఒకడిగా బరిలోకి దిగిన ప్రణయ్.. ఇలా తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం అతనికి మింగుడు పడనిదే.
సంబంధిత కథనం
టాపిక్