Usirikaya Pappu: పుల్లపుల్లని ఉసిరికాయ పప్పు ఇలా చేశారంటే పిల్లలకు నచ్చడం ఖాయం
Usirikaya Pappu: నాలుగు ఉసిరికాయలు ఉంటే చాలు పుల్లపుల్లని పప్పు వండేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పును వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. దీన్ని చాలా సింపుల్ గా వండేయచ్చు.
Usirikaya Pappu: ప్రతి ఇంట్లో రెండు రోజులకోసారైనా పప్పు ఉండాల్సిందే. పప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పప్పును ప్రోటీన్ కోసం ప్రతిరోజూ తినమని చెబుతారు ఆరోగ్య నిపుణులు. పప్పు టమాటా, పప్పు బీరకాయ... ఇలా పప్పు ఉసిరికాయను కూడా వండవచ్చు. ఇది అన్నంలో కలుపుకుంటే రుచి అదిరిపోతుంది. ఈ పప్పు అన్నం తింటూ ఊరగాయ నంజుకుంటే ఆ రుచే వేరు. ఈ పప్పును వండడం చాలా సులువు.
పప్పు ఉసిరికాయ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఉసిరికాయలు - ఆరు
నీరు - సరిపడినన్ని
కంది పప్పు - అరకప్పు
పచ్చిమిర్చి - పది
పసుపు - అర స్పూను
మెంతులు - పావు స్పూను
ఎండు మిర్చి - రెండు
ఆవాలు - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి - పది రెబ్బలు
కరివేపాకులు - గుప్పెడు
ఉల్లిపాయ - ఒకటి
టమాటో - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
పప్పు ఉసిరికాయ రెసిపీ
1. కందిపప్పును శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టుకోవాలి.
2. ఈలోపు ఉసిరికాయలను ఒక గిన్నెలో వేసి నీళ్లు వేయాలి. ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి వేడిచేయాలి.
3. ఉడికిని ఉసిరికాయలను తీసి పక్కన పెట్టుకోండి. వాటిని ఉడికించిన నీటిని పడేయకుండా ఉంచండి.
4. కుక్కర్లో నానెబట్టుకున్న పప్పు రెండు పచ్చిమిర్చి, తగినంత నీరు వేసి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. తరువాత స్టవ్ కట్టేయండి.
5. ఉడికిన ఉసిరిలోని గింజలను తీసి పక్కన పెట్టి మిగతా వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోండి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెల్ మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి, సెనగపప్పు,కరివేపాకులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
7. అన్నీ వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
8. ఉల్లిపాయలు వేగాక టమాటో తరుగును వేసి కలిపి వేయించాలి.
9. అందులో ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఇగురులా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
10. టమోటా ఇగురులా అయ్యాక పసుపు, ఉడికించుకున్న కందిపప్పు వేసి బాగా కలుపుకోవాలి.
11. అయిదు నిమిషాలు ఉడికించుకున్నాక మిక్సీలో రుబ్బుకున్న ఉసిరి పేస్టును, వాటిని ఉడికించుకున్న నీళ్లను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. మూత పెట్టి అయిదు నిమిషాల ఉడికిచుకోవాలి.
13. దించే ముందు కొత్తిమీర తరుగును చల్లుకుంటే పుల్లపుల్లని ఉసిరికాయ పప్పు సిద్ధమైనట్టే.
పెద్ద ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని పప్పులో వేసి వండితే రుచి అదిరిపోతుంది. ఉసిరి తినడం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగిన వాటిలో ఇదీ ఒకటి. ఉసిరి, కందిపప్పు కలిపి వండిన వంటకాలు శరీరానికి ఎన్నో పోషకాలు అందజేస్తాయి. అధికరక్తపోటు ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన కూరల్లో ఇదీ ఒకటి. కంది పప్పులో పొటాషియం అధికంగా ఉంటుంది... కాబట్టి రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహులు కూడా ఉసిరికాయ పప్పును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.