DIY Homemade Ubtan | చలికాలంలో మీరు స్నానానికి వాడే సబ్బుతో చర్మ సమస్యలా? అయితే ఇది వాడండి!
DIY Homemade Ubtan: చలికాలంలో ఏ సబ్బులు మీ చర్మానికి సరిపోవడం లేదా? మీరు చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సబ్బుకు బదులుగా ఉబ్తాన్ ఉపయోగించండి, మృదువైన మెరిసే చర్మం మీ సొంతం.
సీజన్‌ను బట్టి మనం చర్మానికి ఉపయోగించే ఉత్పత్తులలో కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. ఈ చలికాలంలో తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసే ఉత్పత్తులు వాడాలి. కొంతమందికి ఈ చలికాలంలో స్నానం చేసిన తర్వాత చర్మంపై సబ్బు తేలిపోయి, ఆపై చర్మం పొడిగా మారుతుంది. ఇదేకాకుండా చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. దీని కారణంగా కూడా చర్మం నుంచి మిగిలిన తేమ కూడా హరించుకుపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు ఉపయోగించే సబ్బు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుందా, లేదో నిర్ధారించుకోవాలి. మనలో చాలా మంది ఎప్పుడూ ఒకేరకమైన సబ్బును ఉపయోగిస్తారు, కారణం వేరే సబ్బు వాడితే వారికి అలర్జీ అవుతుందని భావిస్తారు. అయితే మీరు ఈ సబ్బులతో ఇబ్బంది పడుతుంటే, సబ్బుకు బదులుగా ఇంట్లో తయారుచేసిన ఉబ్తాన్‌ని ఉపయోగించండి. ఇది చర్మం తేమను కోల్పోకుండా చేస్తుంది, వేడి నీటితో స్నానం చేసిన తర్వాత కూడా చర్మం మృదువుగా ఉంటుంది.
ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఉపయోగించే రసాయనాలు అన్ని చర్మ రకాలకు సరిపోవు. పూర్వం సబ్బులు లేనపుడు నలుగుపిండి లేదా సున్నిపిండితో స్నానం చేసేవారు, దీనినే ఇప్పుడు ఉబ్తాన్ అని కూడా పిలుస్తున్నారు.
పప్పు ధాన్యాలు, కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి ఇంట్లోనే మీకు మీరుగా నలుగుపిండి తయారు చేసుకోవచ్చు. ఇది సహజమైనది, అన్ని చర్మ రకాలకు మేలు చేస్తుంది. మీరు స్నానం చేయడానికి సబ్బుకు బదులుగా ఇంట్లో తయారుచేసిన నలుగుపిండిని ఉపయోగిస్తే, చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. చర్మంలోని డెడ్ స్కిన్ క్లీన్ అవుతుంది, చర్మం శుభ్రపడుతుంది. దీని కారణంగా చర్మం మృదువుగానే మారడం కాకుండా సహజమైన మెరుపు వస్తుంది. నలుగుపిండిని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే చలికాలంలో మీ చర్మాన్ని మృదువుగా ఉంచేలా ఉబ్తాన్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
ముందుగా బాదంపప్పులను పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో శనగపిండి, పసుపు, ఓట్ మీల్ పౌడర్, వేపపొడి వంటివి తీసుకోవాలి. వీటన్నింటిని మిక్స్ చేసి, ఇందులో తగినంత రోజ్ వాటర్ కలపడం ద్వారా మందపాటి పేస్ట్ సిద్ధం అవుతుంది. మీరు రోజ్ వాటర్‌కు బదులుగా, పచ్చి పాలను కూడా ఉపయోగించవచ్చు.
ఈ నలుగుపిండి పేస్టును శరీరం అంతటా అప్లై చేసి రుద్దుకోండి. దీనిలో ఉపయోగించిన ఓట్స్ స్క్రబ్బర్ లాగా పనిచేసి చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. మిగతా పదార్థాలు శరీరాన్ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మట్టి, జిడ్డు తొలగిపోయి చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి. ఈ పేస్ట్ ఉపయోగించి స్నానం చేయడం వలన చర్మం మెరిసిపోవడంతో పాటు, తేమను కూడా పొంది సజీవంగా మారుతుంది.
సంబంధిత కథనం