Tulasi plant: ఎండిన తులసి మొక్క కాండం, ఆకులను ఇలా వాడండి
Tulasi plant: మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే దాన్ని అలా వదిలేయకండి. దాన్ని ఎలా ఉపయోగించాలో తెల్సుకోండి. ఎండిన ఆకు నుంచి కాండం దాకా దాంతో అనేక ప్రయోజనాలున్నాయి.
తులసి దాదాపు ప్రతి ఇంట్లో ఉండే మొక్క. ఇది సాంప్రదాయంగా, శాస్త్రీయ కోణంలో కూడా చాలా ముఖ్యమైనది. ఈ మొక్క పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, దీని ఆకులను ఆరోగ్య సమస్యల కోసం ఉపయోగిస్తారు. తులసి యొక్క పచ్చగా ఉన్నప్పుడు ఎన్ని ప్రయోజనాలున్నాయో, అది ఎండిపోయినా కూడా దాన్ని అనేక రకాలుగా వాడొచ్చు. ఎప్పుడైనా మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే దానిని వృథాగా పడేయకండా వివిధ మార్గాల్లో ఉపయోగించండి. అదెలాగో తెలుసుకుందాం.
ఆకులు
మొక్క ఎండిపోతే దాని ఆకులను తెంపి వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఎండిన తులసి ఆకులను మిక్సీ గ్రైండర్ లో వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దానిని గాలి చొరవని డబ్బాలో వేసుకోండి. ఈ పొడిని హెర్బల్ టీ లేదా కషాయం తయారీకి ఉపయోగించవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శీతాకాలపు జలుబు సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. చర్మం కోసం వాడే ఫేస్ ప్యాక్స్ లో ఈ పొడిని కలుపుకున్నా మంచిదే.
ఎరువుగా
కుండీలోని తులసి మొక్క ఎండిపోతే దాన్ని తోటలోని ఇతర మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. ఇందుకోసం కుండీ నుంచి ఎండిన తులసి మొక్కను తొలగించి దాని ఆకులను వేరు చేయాలి. ఇప్పుడు మీ చేతులతో నలిచి పొడి చేయాలి. దీన్ని కుండీల్లో, మొక్కల వేర్ల దగ్గర మట్టిలో కలపండి. దీంతో భూసారం పెరుగుతుంది. ఈ మట్టిలో ఏ మొక్క నాటినా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది.
విత్తనాలు
తులసి మొక్క ఎండిపోతే అదే ఎండిన మొక్క నుండి కొత్త తులసి మొక్కను పెంచేయొచ్చు. ముందుగా ఎండిన తులసి మొక్కను తీసేసి దాని దలాలు లేదా గింజలను వేరు చేయండి. అదే కుండీలో ఈ విత్తనాలు చల్లండి. ఎప్పటికప్పుడు నీరు పోస్తూ ఉంటే తొందరగానే కుండీలో కొత్త తులసి మొక్క పెరుగుతుంది.
తులసి కాండం
తులసి కాండాన్ని కూడా అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఎండిన తులసి కాండాలను ఆకులు లేకుండా వేరు చేసి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. ఇంట్లో హోమం, పూజలు చేస్తున్నప్పుడు ఈ కర్రలను వాడొచ్చు. దాని కలప నుండి వెలువడే సువాసన ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇందులో ఉండటం వల్ల దాన్ని కాల్చినప్పుడు ఇంట్లో ఉండే క్రిములు తొలగిపోతాయి. అంతేకాకుండా ఎండిన తులసి కాండాన్ని గంధంలా కూడా వాడుకోవచ్చు. తులసి కలపను నీళ్లలో మరిగించి హెర్బల్ టీ తయారు చేయొచ్చు.
టాపిక్