Ubtan at home: నలుగుపిండి తయారుచేసే పద్ధతితే.. ఇది వాడితే ఎలాంటి స్క్రబ్స్ అవసరం ఉండదు..-ubtan or natural scrub making at home and its benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ubtan At Home: నలుగుపిండి తయారుచేసే పద్ధతితే.. ఇది వాడితే ఎలాంటి స్క్రబ్స్ అవసరం ఉండదు..

Ubtan at home: నలుగుపిండి తయారుచేసే పద్ధతితే.. ఇది వాడితే ఎలాంటి స్క్రబ్స్ అవసరం ఉండదు..

HT Telugu Desk HT Telugu
Jul 24, 2023 02:06 PM IST

Ubtan at home: నలుగుపిండిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రయోజనాలేంటో చూసేయండి. ఇది పాతకాలం నుంచి వస్తున్న ఉత్తమ చర్మ సంరక్షణ పద్ధతి.

నలుగుపిండి తయారీ
నలుగుపిండి తయారీ (freepik)

చర్మం మీద పేరుకున్న జిడ్డు, మృతకణాలు తొలగించడానికి స్క్రబ్ వాడటం మంచిది. పాతకాలం నుంచి పెద్దలు వాడే నలుగుపిండి వల్ల కలిగే ఉపయోగం అదే. అయితే సబ్బులు, క్రీముల వాడకం పెరిగి పాతకాలం నాటి కిటుకులు మర్చిపోతున్నాం. ఈ నలుగు పిండిని ఎలా తయారుచేసుకోవాలో కూడా కొన్ని సందేహాలుంటాయి. ఎలాంటి రసాయనాలు లేకుండా దీన్ని తయారు చేసుకుంటాం కాబట్టి చర్మానికి చాలా మేలు చేస్తుంది. దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, దాని లాభాలేంటో చూద్దాం.

  1. ఎక్స్‌ఫోలియేషన్: దీన్ని చర్మానికి రుద్దు కోవడం వల్ల చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. మృతకణాలు తొలిగిపోతాయి.
  2. ప్రకాశవంతంగా మారుతుంది: నలుగుపిండిలో ఉండే పసుపు, కుంకుమపువ్వు, శనగపిండిలో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. దీనివల్ల చర్మం మీదున్న నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. ప్రకాశవంతంగా మారుతుంది.
  3. క్లెన్సింగ్: నలుగు చర్మం రంధ్రాల్లోకి ఇంకి జిడ్డు తొలగిస్తుంది. చర్మం మీద పేరుకున్న మళినాలు తొలగిపోతాయి. దీనివల్ల యాక్నె లాంటి సమస్యలు తగ్గిపోతాయి.
  4. మాయిశ్చరైజింగ్: పాలు, పెరుగు, తేనె లాంటివి కలపడం వల్ల చర్మానికి అవసరమైన తేమ దొరుకుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
  5. టోనింగ్: చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. యవ్వనమైన చర్మం సొంతమవుతుంది.

నలుగుపిండి ఎలా తయారుచేయాలి?

రెండు చెంచాల శనగపిండి

సగం చెంచా పసుపు

చిటికెడు కుంకుమపువ్వు (ఒక చెంచా గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి)

1 చెంచా పచ్చిపాలు

1 చెంచా తేనె

రోజ్ వాటర్

తయారీ విధానం:

  1. ఒక గిన్నెలో శనగపిండి , పసుపు కలుపుకోవాలి. శనగపిండి క్లెన్సర్ లాగా, పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ఉండి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
  2. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది చర్మానికి సహజ మెరుపు తీసుకొస్తుంది.
  3. ఇప్పుడు పచ్చిపాలు లేదా పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. పాలు నేచురల్ క్లెన్సర్ లాగా పనిచేస్తాయి.
  4. కాస్త తేనె కూడా వేసుకోవాలి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవాళ్లకి చాలా మేలు చేస్తుంది.
  5. చివరగా రోజ్ వాటర్ పోసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. అంతే..

నలుగు ఎలా రాసుకోవాలి?

  1. నలుగు రాసుకునే ముందు ముఖం, మెడను శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్ ఉంటే తీసేయాలి.
  2. ఇప్పుడు నలుగు మిశ్రమాన్ని ముఖం, మెడకు గుండ్రంగా రుద్దుతూ రాసుకోవాలి.
  3. దీన్ని పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి.
  4. తడి పూర్తిగా ఆరిపోకముందే చేతులకు నీళ్లు రాసుకుని ముఖాన్ని రుద్దుకోవాలి. గుండ్రంగా తిప్పుతూ ముఖం, మెడకు మర్దనా చేయాలి. దీనివల్ల చర్మం మీదున్న జిడ్డు తొలిగిపోతుంది.
  5. గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. మెత్తని టవెల్ తో తుడుచుకుని చివరగా మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు.

Whats_app_banner