Oils for brittle nails: గోళ్లకు ఈ నూనెలతో మర్దనా చేయండి.. మ్యానిక్యూర్ అవసరమే ఉండదు..
Oils for brittle nails: గోళ్లు సులువుగా విరిగిపోతున్నా, నిర్జీవంగా మారినా కొన్ని నూనెలతో మర్దనా చేస్తే ఫలితం ఉంటుంది. ఆ నూనెలేంటో తెలుసుకోండి.
కొన్నిసార్లు ఉన్నట్టుండి చిన్న పని చేసినా గోర్లు విరిగిపోతుంటాయి. తరచూ మ్యానిక్యూర్ చేయించుకోవడం, గోర్లు కొరకడం, నెయిల్ పాలిష్ తరచూ వేసుకోవడం ఇలా చాలా కారణాల వల్ల గోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. సమస్య ఎక్కువవ్వక ముందే ఇంట్లోనే కొన్ని నూనెలతో మర్దనా చేయడం వల్ల గోళ్లు బలంగా మారతాయి. ఈ నూనెల వల్ల సరైన తేమ అందుతుంది. సహజమైన మెరుపు వస్తుంది.
గోళ్లకోసం వాడదగ్గ ఉత్తమ నూనెలు:
1. కొబ్బరి నూనె:
కొబ్బరినూనె లాభాలు బోలెడు. అందానికి, ఆరోగ్యానికి దీన్ని విరివిగా వాడొచ్చు. యాక్నె సమస్య నుంచి పగిలిన కాళ్ల సమస్యల దాకా ఇది నివారిణిగా పనిచేస్తుంది. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్లుంటాయి. దీనికి యాంటీమైక్రోబయల్ లక్షణాలుంటాయి. వీటివల్ల గోళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. ఊరికే విరిగిపోవు. బలంగా మారతాయి. క్రమం తప్పకుండా కొబ్బరినూనెతో గోళ్లకు మర్దనా చేయడం వల్ల మృదువైన, అందమైన గోళ్లు మీ సొంతమవుతాయి. వారానికి రెండు మూడు సార్లయినా కొబ్బరినూనెతో మర్దనా చేసుకోవచ్చు.
2. ఆముదం:
దీంట్లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లుంటాయి. ఆముదంతో గోళ్లకు మర్దనా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. గోళ్లకు కావాల్సిన తేమ అందుతుంది. గోరు చుట్టూ ఉన్న చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది. గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీంట్లో ఉండే రిసినోలిక్ యాసిడ్ వల్ల గోళ్లు బలంగా మారతాయి.
3. లవంగ నూనె:
మైక్రోబయాలజీ జర్నల్ లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం లవంగ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి గోళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. ఇన్ గ్రోన్ గోళ్ల వల్ల ఉన్న సమస్య, వాపు లక్షణాలు కూడా ఈ లవంగ నూనె మర్దనా వల్ల తగ్గిపోతాయి. లవంగ నూనెతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు గోళ్లకు మర్దనా చేయొచ్చు.
4. విటమిన్ ఇ నూనె:
గోర్లు విరిగిపోతున్నా, లేదా గోళ్ల రంగు కాస్త పచ్చగా మారినట్లు అనిపించినా విటమిన్ ఇ నూనె వాడొచ్చు. ఇది మాయిశ్చరైజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది రాసుకున్నప్పుడు గోళ్లకు కావాల్సిన తేమ అంది ఆరోగ్యంగా, బలంగా మారతాయి. గోటి చుట్టూ ఉండే చర్మంలో ఉన్న వాపును కూడా ఈ నూనె తగ్గిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ఉండే పోషకాలవల్ల గోళ్లు బలంగా మారిపోతాయి. ఈ నూనె కూడా వారానికి రెండు సార్లు గోళ్లకు రాసుకోవచ్చు.
5. ఆలివ్ నూనె:
ఆలివ్ నూనె గోళ్లు పెరగడానికి అంతగా పనిచేయదు కానీ గోళ్లు బలంగా మారేలా చేస్తుంది. దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ల వల్ల జుట్టు, చర్మం, గోళ్లకు రాసుకున్నప్పుడు వాటిలోని తేమ కోల్పోకుండా కాపాడుతుందీ నూనె. గోళ్ల, చర్మం సంరక్షణలో దీన్ని రోజూవారీ భాగం చేసుకోవచ్చు.
ఈ నూనెలన్నీ సహజ పోషకాలతో నిండి ఉంటాయి. అయితే అన్ని నూనెలు అందరికీ నప్పాలని లేదు. మీరు వాడేముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుని తర్వాత క్రమం తప్పకుండా వాడటం మొదలుపెట్టండి.
టాపిక్