World TB Day | టీబీ రోగులు ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే.. ఎందుకంటే-tuberculosis patients diet special story on world tb day 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Tb Day | టీబీ రోగులు ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే.. ఎందుకంటే

World TB Day | టీబీ రోగులు ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే.. ఎందుకంటే

HT Telugu Desk HT Telugu
Mar 24, 2022 11:29 AM IST

భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో క్షయవ్యాధి ఒకటి. క్షయ అనేది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక అంటు వ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమయ్యే బ్యాక్టీరియా గాలిలోకి చేరి.. వేరే వ్యక్తికి సోకే ప్రమాదముంది. దీని తగ్గించుకోవడం కోసం ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో పాటు సరైనా ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం.

ప్రపంచ టీబీ దినోత్సవం
ప్రపంచ టీబీ దినోత్సవం

World Tuberculosis Day | రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు టీబీ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో, వైరస్, బాక్టీరియాకు వ్యతిరేకంగా శరీరాన్ని బలోపేతం చేయడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. క్షయవ్యాధికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తికి రక్షణగా పనిచేస్తుంది. బలహీనత, అనుకోకుండా బరువు తగ్గడం, అలసట, దగ్గు, జ్వరం ఇవన్నీ టీబీ లక్షణాలే. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల.. రోగి చాలా వరకు ప్రయోజనం పొందవచ్చు. టీబీ రోగులకు సిఫార్సు చేసే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు

టీబీ రోగులలో ఎక్కువమంది ఆకలిని కోల్పోతారు. అటువంటి వారు పనీర్, సోయా వంటి ప్రోటీన్-రిచ్ ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం అటువంటి ఆహారాన్ని సులభంగా గ్రహించి, అవసరమైన శక్తిని ఇస్తుంది.

2. అధిక కేలరీలు

టీబీ వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బరువు కోల్పోకుండా టీబీ రోగులు అధిక కేలరీలు, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. తృణధాన్యాలు, అరటిపండు, వేరుశెనగ చిక్కి, రవ్వ లడ్డూ, గోధుమలు, రాగి మొదలైనవి తీసుకోవచ్చు.

3. సూక్ష్మపోషకాలు

ఎ,సి, ఈ, డి వంటి విటమిన్లు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు కీలకం. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం నుంచి పుష్కలమైన విటమిన్‌లు పొందలేని వారు మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకుంటే మంచిది. క్యారెట్, నారింజ, బొప్పాయి, జామ, ఉసిరి, సోయా, స్వీట్ లైమ్, నట్స్, మష్రూమ్ వంటివి పూర్తిగా విటమిన్లతో నిండి ఉంటాయి.

4. సూపర్ ఫుడ్స్

పుట్టగొడుగులు లేదా స్పిరులినా వంటి సూపర్‌ఫుడ్‌లు టీబీ చికిత్సను వేగవంతం చేయడంలో, బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి. ఒక చెంచా పొడి స్పిరులినా పౌడర్‌లో 4 గ్రాముల ప్రొటీన్, 11 శాతం విటమిన్ బి1, 15 శాతం విటమిన్ బి2, 4 శాతం విటమిన్ బి3, 21 శాతం రాగి, 11 శాతం ఇనుము కలిగి ఉంటుంది. ఈ కొంచెం మొత్తం ఒక వ్యక్తికి కావాల్సిన రోజువారీ పోషకాలను అందిస్తుంది. పుట్టగొడుగులు బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతాయి.

ఇవే కాకుండా యోగా, ధ్యానం, ప్రాణాయామాలు కూడా శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. అంతేకాకుండా శ్వాసకోశ వ్యవస్థలో అంటువ్యాధులు, అలెర్జీల వల్ల వచ్చే ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి.

WhatsApp channel