Low-Carb Breakfast| తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండి, ఎక్కువ శక్తినిచ్చే అల్పాహారాలు
ఉదయం అల్పాహారంలో ఏదో ఒకటి అని కాకుండా తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ఫైబర్ కలిగిన ఈ ఆహార పదార్థాలను తీసుకోండి..
ప్రతిరోజు ఉదయం అల్పాహారం మిస్ కాకుండా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి భోజనం చేసినప్పటి నుంచి ఉదయం వరకు మనం ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వలన అంతర్లీనంగా వివిధ విధులు నిర్వర్తించడానికి శరీరానికి తగిన శక్తి లభించదు. జీవక్రియ రేటు మందగిస్తుంది. క్యాలరీలను కరిగించే శక్తి అందకపోవడంతో అది కొవ్వుగా మారుతుంది. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలంటే ఉదయం అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి.
అలాగే ఉదయం ఏదోఒకటి కాకుండా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం అన్ని విధాల ఉత్తమం. ఇడ్లీ నుంచి మసాల దోశల వరకు అనేక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వండటం తేలిక అని తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు, తేలికగా మాత్రం జీర్ణం అవవు. అందుకే మీ కోసం ప్రత్యేకంగా తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి ఇక్కడ సమాచారం ఇస్తున్నాం. ఇవి నిండుగా అనిపిస్తాయి. మిమ్మల్ని రోజులో గంటల తరబడి బలంగా ఉంచుతాయి. బరువు నియంత్రించడంలోనూ సహాయపడతాయి.
పాలక్ ఆమ్లెట్
ఆలివ్ నూనెతో పాలకూర, ఉల్లిపాయలతో కలిపిచేసే ఆమ్లెట్ ఎంతో పోషక విలువలతో నిండి ఉంటుంది. దీనిని తయారుచేయడం చాలా సింపుల్ అలాగే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి.
కీటో తెప్లా
తెప్లా అనేది ఒక గుజరాతీ వంటకం. పరోటా లాగే ఉంటుంది అయితే మరింత తేలికగా ఉంటుంది. ఇందులో పూర్తిగా గోధుమ పిండి కాకుండా మిల్లెట్లతో చేసిన పిండి, కొద్దిగా పెరుగు, కసూరి మెంతి, నీరు కలిపి పరోటా లాగే చేసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
కీటో ఉప్మా
ఉప్మా గురించి మనందరికీ తెలిసింది. అయితే కీటో ఉప్మా చేసేటపుడు తాజా కూరగాయలను అనగా క్యారెట్, కాలీఫ్లవర్‌తో కలిపి తయారు చేస్తారు. ఉప్మా ఇలా చేస్తే రుచికిరుచి ఉంటుంది. లైట్ ఫూడ్ కూడా. ఏ సమయంలోనైనా అల్పాహారంగా తీసుకోవచ్చు.
కీటో పోహా
ఇక్కడ పోహా అంటే అటుకులతో చేసేది అనుకునేరు. అస్సలు కాదు. మెత్తని అటుకులు చేసుకున్నట్లే ఈ అల్పాహారాన్ని తయారుచేసుకోవాలి. అయితే అటుకులకు బదులుగా కాలిఫ్లవర్ - పువ్వు, కాండంతో కలిపి తయారుచేసుకోవాలి. ఇలా తింటే ఆరోగ్యానికి మంచిది, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి.
ఆపిల్ సబ్జా స్మూతీ
ఒక ఆపిల్ పండు, ఒక కప్పు పెరుగు, ఒక టీస్పూన్ సబ్జా గింజలు, ఒక టీస్పూన్ పీనట్ బటర్ కలిపి స్మూతీలాగా చేసుకొని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీవక్రియ రేటు మెరుగవుతుంది. త్వరగా శక్తి లభిస్తుంది.
సంబంధిత కథనం