Rainy Season Tour : చినుకులు పడుతుంటే కర్ణాటకలోని ఈ ప్రదేశాలకు వెళ్తే వచ్చే కిక్కే వేరప్పా
Rainy Season Karnataka Tour : మన పక్క రాష్ట్రం కర్ణాటకలో చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని వర్షాకాలంలో సందర్శిస్తే వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. అక్కడ ఏ ప్రదేశాలు వానాకాలంలో చూసి ఎంజాయ్ చేయవచ్చో తెలుసుకుందాం..
జూన్ నెల ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. కారణం వరుణుడి రాక మెుదలవుతుంది. జూన్ నెలలో వర్షాలు పడటమే కాదు, అనేక పర్యాటక ప్రదేశాలు మనల్ని ఆకర్షిస్తాయి. జూన్‌కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల జాబితా చూద్దాం..
వర్షాకాలం అంటే అందరికీ ఇష్టమే. చల్లటి వాతావరణం, పచ్చని కొండలు, ఉరుముల శబ్దాలు, నెమలి నాట్యాలు, జింకల చిందులు, ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలు, వంకరగా ప్రవహించే నది మొదలైనవి ఈ వానాకాలం ఆకర్శిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణించాలని మనసును తహతహలాడుతుంది. చలి, చినుకులు, పొగమంచు వాతావరణంలో స్నేహితులతో కలిసి జాలీ రైడ్‌కి వెళ్లడమంటే లైఫ్ టైమ్ మెమోరీ. మీరు ట్రావెలర్ అయితే మీ జూన్ ట్రిప్‌ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. జూన్‌లో కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల జాబితా HT Telugu మీకు అందిస్తుంది.
హాసన్ జిల్లాలోని సకలేష్‌పూర్ జూన్ నెలకు మంచి గమ్యస్థానం. శెట్టిహళ్లి చర్చి, మంజరాబాద్ కోట, జెనుకల్లు గూడ వంటి అనేక కొండలు, జలపాతాలతో అందమైన పర్యాటక ప్రదేశం. పచ్చని ప్రకృతి మధ్య ఉన్న సకలేష్‌పూర్ జూన్ నెలలో చూసేందుకు బాగుంటుంది.
బెంగళూరు నుండి సకలేష్‌పూర్ 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి.. అక్కడ నుంచి బస్సు, రైలు, సొంత వాహనంలో ఇక్కడికి వెళ్లవచ్చు.
జూన్ నెలలో కర్ణాటక కాశ్మీర్‌గా పిలువబడే కూర్గ్‌కు విహారయాత్ర అద్భుతం. మీరు స్వర్గాన్ని చూడవచ్చు. పొగమంచుతో కప్పబడిన పచ్చని కొండల మధ్య ప్రవహించే వాగులు మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అంతేకాదు ఇక్కడి కాపీ తోటలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ నుంచి కావేరి జన్మస్థలానికి కూడా వెళ్లవచ్చు.
కర్ణాటకలోని చిరపుంజీ అని కూడా పిలువబడే అగుంబే వర్షాకాల యాత్రకు అనుకూలమైన ప్రదేశం. దట్టమైన అరణ్యం, వర్షాలు చూస్తే మతిపోతుంది.
హంపి యాత్రకు జూన్ నెల బాగుంటుంది. వేసవిలో మీరు హంపిలో తిరగడం చాలా కష్టంగా ఉంటుంది. జూన్ కోసం ప్లాన్ చేయండి. చల్లటి వాతావరణం, తంపర్ల వాన మధ్య ఈ చారిత్రక స్థలాన్ని చూడటం ఆనందంగా ఉంటుంది.
మైసూర్‌లో కూడా వర్షాకాలంలో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. బందీపూర్ అభయారణ్యం, హిమవద్ గోపాలస్వామి, ఊటీ మైసూర్ హైవే మొదలైనవి జూన్ నెలలో వర్షాలు కురిసినప్పుడు తప్పక సందర్శించాలి.
షిమోగా జిల్లాలోని జోగ్ జలపాతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పై నుంచి నీరు కింద పడుతుంటే మనసు కూడా ఉవ్వెత్తున ఎగిరినట్టుగా అనిపిస్తుంది. జోగ్ వాటర్ ఫాల్స్ మీరు జూన్ నెలలో సందర్శించవచ్చు. వర్షం కురిస్తే పర్వతాల అందాలు చూడ్డానికి బాగుంటుంది.
అడవి జంతువులు, పక్షులతో సమయం గడపడానికి ఇష్టపడితే బందీపూర్ పర్యటనకు వెళ్లవచ్చు. పులి, ఏనుగు వంటి జంతువులను ఇక్కడ చూడవచ్చు. పచ్చదనంతో పాటు పొగమంచు వాతావరణం మీకు నచ్చుతుందనడంలో సందేహం లేదు. అంతే కాదు చందనంతో పాటు వివిధ రకాల చెట్లు ఈ ప్రదేశంలో ఉంటాయి.
చిక్కమగళూరు జూన్ పర్యటనకు తగిన గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో ఉన్నాయి. మీరు చాలా థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందుతారు.
రోడ్డుకు ఇరువైపులా పచ్చని కొండలు, జలపాతం, పొగమంచు వాతావరణంలో జాలీ రైడ్‌కి వెళ్లాలనుకుంటే వర్షాకాలంలో చార్మడి వెళ్లండి.
మీరు ప్రకృతి అద్భుతాలను చూడాలనుకుంటే, తప్పనిసరిగా కుద్రేముఖ్‌ను సందర్శించాలి. పొగమంచు కమ్ముకున్న కొండల నడుమ కాసేపు గడిపితే ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది.
మీరు చారిత్రక ప్రదేశాలను చూడాలనుకుంటే బాదామిని కూడా సందర్శించవచ్చు. జూన్ నెలలో సందర్శించడానికి ఇది ఉత్తమమైన పర్యాటక ప్రదేశం.
వర్షం కురిస్తే దండేలి అడవుల్లో గడిపే మజా వేరు. దండేలి వర్షాకాలంలో, ముఖ్యంగా జూన్ నెలలో సందర్శించడానికి సరైన ప్రదేశం.