Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!-who is jd s mp prajwal revanna accused of being in sex tapes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Sharath Chitturi HT Telugu
Apr 29, 2024 11:13 AM IST

Prajwal Revanna sex scandal : కర్ణాటక ఎంపీ, మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు ప్రజ్వల్​ రేవన్నపై తీవ్ర లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. చాలా మంది మహిళలపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటి మధ్య.. ఆయన ఇండియాను విడిచి వెళ్లిపోయారు.

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్​ రేవన్న..
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్​ రేవన్న..

Prajwal Revanna : 2024 లోక్​సభ ఎన్నికల మధ్య.. కర్ణాటకను సెక్స్​ కుంభకోణం కుదిపేస్తోంది. ఎన్నికల వేళ బీజేపీ పొత్తు కుదుర్చుకున్న జేడీఎస్​కు చెందిన హసన్​ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి మంత్రి హెచ్​డీ దేవేగౌడ మనవడు.. ప్రజ్వల్​ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఓ మహిళను ఆయన చాలా కాలం పాటు లైంగికంగా హింసించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు.. హసన్​ జిల్లాలో సర్క్యులేట్​ అవుతున్నాయి.

ఎవరీ ప్రజ్వల్​ రేవన్న? అసలేం జరిగింది?

మాజీ ప్రధాని, జేడీఎస్​ నేత హెచ్​డీ దేవే గౌడ మనవడు ఈ ప్రజ్వల్​ రేవన్న. ఈయన దేవేగౌడ కుమారుడు హెచ్​డీ రేవన్న కుమారుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి.. రేవన్నకు బాబాయ్​ వరుస అవుతారు. ప్రస్తుతం.. ఎంపీ ప్రజ్వల్​ రేవన్న.. హసన్​​ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశలో భాగంగా.. ఆయన బరిలో దిగిన హసన్​ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్​ జరిగింది.

ఓ మహిళ.. లైంగిక దాడికి గురవుతున్న దృశ్యాలు శుక్ర, శనివారాల్లో వైరల్​ అయ్యాయి. ఆ వీడియోలో నిందితుడుగా ఉన్నది హసన్​ ఎంపీ ప్రజ్వల్​ రేవన్న అని సమాచారం. బాధితురాలు ప్రజ్వల్​ రేవన్న ఇంట్లో పని చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదుతో.. రేవన్నపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. అంతేకాదు.. ప్రజ్వల్​ రేవన్న తండ్రి హెచ్​డీ రేవన్నపైనా ఆరోపణలు చేసింది ఆ మహిళ.

HD Ravanna Prajwal Revanna news : "హెచ్​డీ రేవన్న, ప్రజ్వల్​ రేవన్నలు.. తమ ఇంట్లో పనిచేసే మహిళా సిబ్బందిపై లైంగిక దాడి చేశారు. వారిలో నేను కూడా ఉన్నాను. నేను ఉద్యోగంలో చేరిన నాలుగో నెలకు.. నన్ను ప్రజ్వల్​ రేవన్న తన క్వార్టర్స్​కి పిలిచాడు. ఇంట్లో మొత్తం ఆరుగురు మహిళా సిబ్బంది ఉన్నారు. అందరు జాగ్రత్తగా ఉండాలని సిబ్బందిలోని పురుషులు చెప్పేవారు," అని ఆ మహిళ చెప్పుకొచ్చింది.

"భార్య ఇంట్లో లేనప్పుడు.. హెచ్​డీ రేవన్న.. మహిళా సిబ్బందిని స్టోర్​రూమ్​కి పిలిచేవాడు. పండ్లు ఇస్తున్నట్టు నటించి.. ముట్టుకునేవాడు. మా చీరలకు పిన్నులు తీసేసి, లైంగిక దాడి చేసేవాడు," అని బాధితురాలు ఆరోపించింది.

అంతేకాదు.. ప్రజ్వల్​ రేవన్న.. వీడియో కాల్స్​లో తన కూతురితోనూ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు బాధితురాలు తెలిపింది. చాలాసార్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండటంతో.. తన కూతురు, ప్రజ్వల్​ రేవన్న నెంబర్​ని బ్లాక్​ చేసినట్టు వివరించింది.

Karnataka sex scandal : తనతో పాటు చాలా మంది బాధితులు ఉన్నారని, వారు గొంతు విప్పేందుకు ప్రయత్నిస్తుండటం చూసి.. తాను ముందుకు వచ్చానని బాధితురాలు చెప్పుకొచ్చింది.

కాగా.. బాధితురాలు.. ప్రజ్వల్​ రేవన్నకు బంధువని తెలుస్తోంది! ఆమె.. హెచ్​డీ రేవన్న భార్య భవానీ రేవన్నకు బంధువని సమాచారం.

మరోవైపు.. ఆదివారం ఉదయం ప్రజ్వల్​ రేవన్న ఇండియాని విడిచి.. జర్మనీ వెళ్లారు. ఆయన జర్మనీ ఎందుకు వెళ్లారో తెలియరాలేదు. కానీ.. వెళ్లే ముందు ఆయన కూడా పోలీసు కేసు పెట్టారు. వీడియోలను మార్ఫ్​ చేసి, తనని ఇరికిస్తున్నారని పేర్కొన్నారు.

మరోవైపు.. ఇదంతా రాజకీయ కుట్ర అని, ప్రజ్వల్​ రేవన్న పేరును చెడగొట్టేందుకు, ఎన్నికల్లో ఓడించేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని.. బీజేపీ, జేడీఎస్​ ఎలక్షన్​ ఏజెంట్​ ఆరోపించారు.

Hasan sex scandal : "మార్ఫ్​డ్​ వీడియోలను సర్క్యులేట్​ చేసి.. హసన్​ ప్రజలు ప్రజ్వల్​ రేవన్నకు ఓటు వేయవద్దని నవీన్​ గౌడ, అతని మద్దతుదారులు చెబుతున్నారు. పెన్​డ్రైవ్​, సీడీలు, వాట్సాప్​ల ద్వారా ప్రజ్వల్​ రేవన్న పేరును నాశనం చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇందులో నిజం లేదు," అని ఎలక్షన్​ ఏజెంట్​ పూర్ణచంద్ర తెలిపారు.

రాజకీయ దుమారం..

ఇక 2024 లోక్​సభ ఎన్నికల మధ్యలో ఈ హసన్​ సెక్స్​ కుంభకోణం వార్తలకు ఎక్కడంతో.. కర్ణాటకలో ఈ విషయంపై రాజకీయ దుమారం చెలరేగింది.

ప్రజ్వల్​ రేవన్న అశ్లీల దృశ్యాలకు సంబంధించి.. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకోగా.. అధికారంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం.. దర్యాప్తు చేపట్టేందుకు సిట్​ని నియమించింది.

అంతేకాదు.. ఈ విషయంపై బీజేపీ, జేడీఎస్​లు స్పందించాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తోంది.

Hasan sex scandal victim : ప్రజ్వల్​ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల మీద.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి స్పందించారు.

"నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. కానీ సిట్​ బృందం దర్యాప్తు ముగిసేంతవరకు వేచి చూద్దాము. నిజం తెలుస్తుంది. ఇది నాకు సంబంధించినది కాదు. సిట్​ దర్యాప్తునకు ఆదేశించారు. ఒకవేళ.. ప్రజ్వల్​ రేవన్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే.. ఆయన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత.. సిట్​ టీమ్​దే," అని హెచ్​డీ కుమారస్వామి తెలిపారు.

ఈ పూర్తి వ్యవహారంపై బీజేపీ మౌనంగా ఉండిపోయింది. హసన్​ సెక్స్​ కుంభకోణం నుంచి దూరం జరిగిపోయింది. ప్రజ్వల్​ రేవన్నకు సంబంధించిన అశ్లీల వీడియోలకు తమకు సంబంధం లేదని చెప్పింది. తాము కామెంట్లు చేయమని స్పష్టం చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం