Breakfast Dairies : కరకరలాడే రవ్వదోశ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
మనలో చాలా మందికి దోశలంటే ఇష్టముంటుంది. రోజూ దోశ తినేవారు కూడా ఉన్నారు. అయితే దోశల్లో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా ఇవి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే.. దోశ బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి. కానీ దాని కోసం కొన్ని గంటల ముందు మినప్పప్పు నానబెట్టాలి. కానీ రవ్వ దోశకు మాత్రం ఇదేమి అవసరం లేదు. మీరు తినాలని అనుకున్న అరగంట ముందు ఈ పిండిని సిద్ధం చేసుకోవచ్చు.
రవ్వదోశ. ఇది చాలామందికి ఇష్టమైనది. తింటుంటే క్రిస్పీగా ఉంటూ.. అలా అలా కరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ పిండిని సిద్ధం చేసుకోవడానికి గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం అరగంటలో ఈ పిండిని తయారు చేసుకుని.. మీకు ఇష్టమైన రవ్వదోశను తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని తయారు చేసుకోవడం మీకు రాదా? అయితే సింపుల్‌గా దానిని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* రవ్వ - కప్పు
* బియ్యం పిండి - కప్పు
* మైదా - కప్పు
* పెరుగు - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - 1 స్పూన్
* నీరు - 2½ కప్పు
* మిరపకాయ - 1 (సన్నగా తరిగిన)
* అల్లం - అంగుళం (తురిమిన)
* మిరియాలు - 1 స్పూన్ (పొడి)
* జీలకర్ర - 1 స్పూన్
* కరివేపాకు - కొన్ని (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర - 2 స్పూన్స్ (సన్నగా తరిగినవి)
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన)
* నీరు - తగినంత
* నూనె - సరిపడినంతా (వేయించడానికి)
తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నెలో రవ్వ, బియ్యం పిండి, మైదా తీసుకోండి. పెరుగు, ఉప్పు, నీరు వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా బాగా కలపండి. కారం, అల్లం, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసి కలపండి. నీళ్లు సరిపోకపోతే.. మరిన్ని చేర్చి దోశ బ్యాటర్‌ను సిద్ధం చేయండి.
రవ్వ నీటిని పీల్చుకునేందుకు 20 నిమిషాలు పక్కన పెట్టండి. పిండిని మళ్లీ బాగా కలపండి. ఇప్పుడు వేడిగా ఉన్న తవా మీద దోశ పిండిని జాగ్రత్తగా పోయాలి. మంటను తగ్గించి.. దోశ బంగారు రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. చివరగా దోశను మడిచి.. టమోటా చట్నీ లేదా.. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవాలి.
సంబంధిత కథనం