Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు పెరిగితే ఈ సూచనలు తప్పక పాటించాలి.. తేలిగ్గా తీసుకోవద్దు!-tips to prevent joint pains in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pains In Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు పెరిగితే ఈ సూచనలు తప్పక పాటించాలి.. తేలిగ్గా తీసుకోవద్దు!

Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు పెరిగితే ఈ సూచనలు తప్పక పాటించాలి.. తేలిగ్గా తీసుకోవద్దు!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 16, 2024 10:30 AM IST

Joint Pains in Winter: చలికాలంలో సాధారణంగా కీళ్ల నొప్పుల సమస్య చాలా మందిలో ఎక్కువ అవుతుంటుంది. దీనికి కారణాలు ఉన్నాయి. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల కీళ్ల నొప్పుల తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడొచ్చు.

Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు పెరిగితే ఈ సూచనలు తప్పక పాటించాలి.. తేలిగ్గా తీసుకోవద్దు!
Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు పెరిగితే ఈ సూచనలు తప్పక పాటించాలి.. తేలిగ్గా తీసుకోవద్దు! (shutterstock)

చలికాలం సమీపిస్తోంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా మారిపోవడంతో శరీరానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. చాలా మందిలో ఈ కాలంలో కీళ్ల నొప్పులు పెరిగిపోతుంటాయి. ముఖ్యంగా అర్థరైటిస్ ఉన్న వారికి ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. నొప్పులు అధికం అవుతాయి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పుల తీవ్రత పెరగకుండా చేసుకోవచ్చు. అవేవో ఇక్కడ తెలుసుకొని జాగ్రత్త పడండి.

చలికాలంలో ఎందుకు పెరుగుతాయి?

శీతాకాలంలో తీవ్రమైన చలి వల్ల రక్త నాళాలు కాస్త కుచించుకుంటాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగ్గా ఉండదు. వివిధ భాగాలకు రక్త ప్రసరణ సరిగా ఉండకపోవటంతో చాలా మందిలో కీళ్ల నొప్పులు పెరుగుతుంటాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో కండరాలు బిగుసుకుపోతాయి. అలాగే, చల్లదనం వల్ల చాలా మంది ఉదయం ఇంట్లోనే ఉండటంతో సూర్యరశ్మి ద్వారా అందుకోవాల్సిన విటమిన్-డీని పొందలేరు. ఈ విటమిన్ లోపం కూడా కీళ్లనొప్పులు పెరిగేందుకు మరో కారణంగా ఉంటుంది.

చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ కాకుండా కొన్ని టిప్స్ పాటించాలి. దీనివల్ల నొప్పులు తగ్గడంటో పాటు పూర్తి శరీరం మెరుగ్గా ఉంటుంది.

శరీరం వెచ్చగా ఉండేలా..

కీళ్ల నొప్పుల సమస్య ఉన్న వారు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలోని వెచ్చదనం బయటికి పోకుండా ఉండేలా స్వెటర్లు, మంకీ క్యాప్స్ లాంటివి వేసుకోవాలి. ఉన్ని దుస్తులు వేసుకొని శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. వీటి వల్ల కీళ్ల నొప్పుల సమస్య పెరగకుండా ఉంటుంది. చలిమంట కాచుకోవడం, ఇళ్లలో ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు వాడి కూడా శరీరానికి వెచ్చదనం అందించవచ్చు. రోజులో కాసేపైనా శరీరానికి సూర్యరశ్మి తలిగేలా చూసుకోవాలి.

చలి ఉన్నా ఎక్సర్‌సైజ్‍లు తప్పనిసరి

చలికాలంలో జీవనశైలిలో చేసుకున్న కొన్ని మార్పులు కీళ్ల నొప్పులను పెంచేస్తాయి. వాతావరణం చల్లగా ఉందనే కారణంగా శీతాకాలంలో ఉదయం పూట వ్యాయామం చేయడం చాలా మంది మానేస్తారు. అయితే, ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువవుతుంది. బరువు పెరిగే రిస్క్ కూడా పెరిగి మరింత తీవ్రమవుతుంది. అందుకే చలికాలమైనా వ్యాయామాలు తప్పనిసరి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఎక్సర్‌సైజ్‍లు చేయాలి.

నీరు, ఆహారం

డీహైడ్రేషన్ కూడా కీళ్లనొప్పులు అధికం అయ్యేందుకు కారణంగా ఉంటుంది. అందుకే చలికాలంలోనూ శరీరానికి సరిపడా నీరు తాగాలి. అయితే, వాతావరణం చల్లగా ఉండి ఎక్కువగా దాహం వేయకపోవటంతో శీతాకాలంలో కొందరు నీళ్లు సరిపడా తాగరు. నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేస్తే శరీరం డీహైడ్రేషన్ అయి కీళ్ల నొప్పి తీవ్రత పెరుగుతుంది. అందుకే తగినంత నీరు తాగడం తప్పనిసరి. చలికాలంలో కాల్షియం, విటమిన్ డీ, ఐరన్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. కార్బొహైడ్రేట్లు, ఉప్పు, చెక్కర ఎక్కువగా ఉండేవి, ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు.

ఉపశమనం కోసం ఇవి వాడొచ్చు

కీళ్లకు వెచ్చదనం అందించేందుకు కొన్ని పద్ధతులు పాటించవచ్చు. కీళ్లకు వేడి నీళ్ల బ్యాగ్, ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్‍లు వినియోగించవచ్చు. వీటి వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా కీళ్లు, కండరాలు రిలాక్స్ అవుతాయి.

Whats_app_banner