Winter Oral Health । చలికాలంలో దంత సమస్యలు పెరుగుతాయి.. నోటి ఆరోగ్యానికి చిట్కాలు ఇవిగో!-tips for oral health and dental care during winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Oral Health । చలికాలంలో దంత సమస్యలు పెరుగుతాయి.. నోటి ఆరోగ్యానికి చిట్కాలు ఇవిగో!

Winter Oral Health । చలికాలంలో దంత సమస్యలు పెరుగుతాయి.. నోటి ఆరోగ్యానికి చిట్కాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 10:04 PM IST

Winter Oral Health Tips: చలికాలంలో దంతాల సమస్యలు, నోటి సమస్యలు ఎక్కువవుతాయి. వీటి నివారణకు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Winter Oral Health Tips:
Winter Oral Health Tips: (Unsplash)

చలికాలంలో రోజురోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఎముకలు కొరికే చల్లటి గాలి, పొడి వాతావరణం మీ చర్మంపై వినాశనం కలిగిస్తాయని మీకు తెలుసు. కానీ ఈ రకమైన వాతావరణ పరిస్థితులు మీ నోటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? నోరు పొడిబారి పెదాల పగుళ్లకు దారితీస్తుంది. చల్లని ఉష్ణోగ్రతలు సాధారణ దంత సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. దంతాలలో పగుళ్లు, పుప్పి పళ్లు, సున్నితమైన దంతాలు కలిగిన వారికి జివ్వుమని లాగిన అనుభూతి ఈ చలికాలంలో తరచూ అనిపిస్తుంది. ఈ సీజన్‌లో నిద్రపోతున్నప్పుడు, మీ దంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని గుర్తుంచుకోండి. ఇది దంతాల సున్నితత్వం, నోరు పొడిబారటం వంటి సాధారణ నోటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

Winter Oral Health Tips- చలికాలంలో నోటి ఆరోగ్యానికి చిట్కాలు

ఈ శీతాకాలంలో నోటి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు సంభవిస్తాయి, అందుకు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. వీటిని ప్రయత్నించి చూడండి.

మీ పెదాలను మాయిశ్చరైజ్ చేయండి

చలికాలపు చలి ఉష్ణోగ్రతలు మీ పెదవులపై ఉన్న సున్నితమైన చర్మాన్ని ప్రభావితం చేస్తాయి, పెదవులు పొడిబారడంతోపాటు, పగలడం జరుగుతుంది. కొద్దిగా పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం ద్వారా పగిలిన పెదాలకు ఉపశమనం కల్పించవచ్చు. అయితే సన్‌స్క్రీన్‌తో కూడిన లిప్ బామ్‌ను రోజువారీగా ఉపయోగించాలి. లిప్ బామ్‌ని పెదవులకు పూసుకోవడం వలన పొడి వాతావరణం నుండి వాటిని రక్షించుకోవచ్చు. అలాగే హైడ్రేటెడ్ గా ఉండటానికి చాలా నీరు త్రాగాలి, ఇది పొడి చర్మంను, పెదాలు పగలకుండా నివారిస్తుంది. ఈ చలి కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉన్నందున, మీ ఇంట్లో హ్యూమిడిఫైయర్‌ని ఇన్‌స్టాల్ చేయడం వల్ల అదనపు తేమను సృష్టించవచ్చు.

నోటి పరిశుభ్రత పాటించండి

గాలిలో తక్కువ తేమ మీ నోటిలో తక్కువ లాలాజల ఉత్పత్తికి దారి తీస్తుంది, ఈ కారణంగా మీ నోరు పొడిగా అనిపించవచ్చు. మీకు ముందు నుంచే నోరు పొడిబారడం సమస్య ఉంటే, ఈ చలికాలంలో అది మరింత తీవ్రమవుతుంది. అలాగే నోరు, పెదవుల చుట్టూ చిన్న పొక్కులు ఏర్పడతాయి. ఇవి వైరస్ వల్ల ఏర్పడే పొక్కులు. దీనిని నివారించేందుకు మీ పెదాలను, మీ నోటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తేమగా ఉంచండి. సన్‌స్క్రీన్‌ కలిగిన లిప్ బామ్‌ను ఉపయోగించండి. పొక్కుల ద్వారా మీ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రవేశాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోండి. మీ చేతులను తరచుగా కడుక్కోండి, మీ నోటిని తాకకుండా ఉండటానికి ప్రయత్నించండి. పొక్కులు కలిగిన వారి తినే పాత్రలు, తువ్వాలు వంటి వస్తువులను పంచుకోవద్దు. నోటి పరిశుభ్రత కోసం రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. తరచూ మీ దంతాలను ఫ్లాసింగ్ చేయండి.

నోరు పొడిబారకుండా ఎలా నివారించాలి

గాలిలో తక్కువ తేమ మీ నోటిలో తక్కువ లాలాజల ఉత్పత్తికి దారి తీస్తుంది, ఈ కారణంగా మీ నోరు పొడిగా అనిపించవచ్చు. మీకు ముందు నుంచే నోరు పొడిబారడం సమస్య ఉంటే, ఈ చలికాలంలో అది మరింత తీవ్రమవుతుంది. నోరు పొడిబారకుండా నివారించాలంటే పుష్కలంగా నీరు త్రాగండి. మీ నోటిని హైడ్రేట్ గా ఉంచుకోండి. చక్కెర, కెఫిన్ కలిగిన పానీయాలను నివారించండి. మీ నోటి ద్వారా శ్వాస తీసుకోవడం మానుకోండి, గాలిలో తేమను పెంచడానికి మీ ఇంట్లో హ్యూమిడిఫైయర్‌ని ఉంచడానికి ప్రయత్నించండి. ఇది శీతాకాలంలో నోరు పొడిబారడానికి సహాయపడుతుంది.

దంతాల సున్నితత్వం

చలిగా ఉన్నప్పుడు పంటి నొప్పి పెరుగుతుంది. చల్లటి గాలికి మీ దంతాల పైన ఉండే ఎనామెల్ దెబ్బతినవచ్చు. అలాగే మీ చిగుళ్ళు కుచించుపోయి మీ దంతాల సున్నితమైన మూలాలను బహిర్గతం చేయవచ్చు. దీంతో దంతాలలో నొప్పి, చిగుళ్లలో మంట కలుగుతుంది. దంతాల సున్నితత్వాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా సున్నితమైన దంతాల కోసం రూపొందించిన ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. ఈ రకమైన టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్, హైడ్రాక్సీథైల్ సెల్యులోజ్, కార్బాక్సిమీథైల్ సెల్యులోజ్ , పాలిథిలిన్ గ్లైకాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి దంతాల సున్నితత్వాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మీ దంతాలను చాలా గట్టిగా బ్రష్ చేయకండి, తేలికగా మృదువైన ముళ్ళతో కూడిన టూత్ బ్రష్‌ను ఉపయోగించండి.

వేడి, చల్లని లేదా ఆమ్ల ఆహారాలు, పానీయాలను నివారించండి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతినకుండా జాగ్రత్తపడండి. దంతాలలో, చిగుళ్లలో మంట ఎక్కువగా ఉంటే దంత వైద్యులను సంప్రదించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం