Thyroid Awareness Month: థైరాయిడ్ సమస్యలా? ఈ ఫుడ్‌కు దూరంగా ఉండండి
Thyroid Awareness Month: థైరాయిడ్ డిజార్డర్స్‌లో హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజయం అని రెండు రకాలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం తినకూడదు వంటి నిపుణుల సలహాలు చదవండి.
థైరాయిడ్ అవగాహన మాసంగా జనవరిని గుర్తించారు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయా ఉత్పత్తులు, వేరుశనగ వంటివి, అలాగే కొన్ని రకాల ఔషధాలు థైరాయిడ్ హార్మోన్ సింథసిస్‌తో పడక హైపోథైరాయిడిజం వస్తుంది. అంటే థైరాయిడ్ నిర్వహించే కీలక విధులను ప్రభావితం అవుతాయి. మెటబాలిజం, గుండె పనితీరు, జీర్ణక్రియ, కండరాల ఆరోగ్యం, మెదడు అభివృద్ధి, ఎముకల ఆరోగ్యం దెబ్బతింటాయి.
థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో బటర్‌ఫ్లై ఆకృతిలో ఉండే చిన్న గ్రంథి. ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని, టిష్యూని, అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. మన శరీరం సక్రమంగా పనిచేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు థైరాయిడ్ సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ఎంతగా అంటే డయాబెటిస్, హైబీపీ వంటి వాటిలా అందరికీ రావడం కామన్ అయిపోయింది.
రోజువారీ వ్యాయామం, బరువు అదుపులో ఉంచుకోవడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాజా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, లీన్ ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి. రోజూ 7 నుంచి 9 గంటల పాటు నిద్ర పోవడం వల్ల థైరాయిడ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
హెచ్‌టీ లైఫ్ స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపోలో హాస్పిటల్స్ సీనియర్ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ వర్షా గోరే థైరాయిడ్ హెల్త్ గురించి మాట్లాడారు. ‘హైపర్‌థైరాయిడిజం ఉన్న పేషెంట్లు ప్రత్యేకంగా ఒక డైట్ అనుసరించాల్సిన అవసరం లేదు. అయితే ఆరోగ్యకరమైన తిండి తినడం వల్ల నిర్ధిష్ట సూక్ష్మ, స్థూల పోషకాలు లభిస్తాయి. తద్వారా థైరాయిడ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. డైట్‌లో తగినంతగా అయోడిన్ కంటెంట్ ఉండాలి. ఇది ఉప్పు ద్వారానే లభిస్తుంది. లో సాల్ట్ డైట్ తీసుకుంటున్న వారు సిఫారసు చేసిన మొత్తంలో అయోడిన్ అందేలా చూసుకుంటే పరిస్థితి మరింతగా దిగజారదు..’ అని వివరించారు.
‘మైదా, పిండిపదార్థాలు, స్వీట్లు అధిక బరువుకు కారణమవుతాయి. బరువు పెరగడం వల్ల హైపోథైరాయిడిజం పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. వారిలో బద్దకం పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవడంతో పాటు శారీరకంగా చురుగ్గా ఉండేలా తగిన వ్యాయామాలు చేస్తుండాలి. శరీరంలో ఏవైనా విటమిన్ లోపాలు ఉన్నట్టయితే తగిన సప్లిమెంట్లు వాడాలి..’ అని వివరించారు.
కేడీఏహెచ్‌లో కన్సల్టెంట్ డైటిషియన్ ప్రతీక్ష కదమ్ థైరాయిడ్ హెల్త్ గురించి వివరించారు. ‘హైపోథైరాయిడ్ ఉన్న వారు సోయాబీన్, వేరుశనగలు, పియర్స్, స్ట్రాబెర్రీలు, పాలకూర, ఆలు గడ్డ, బ్రొకోలి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి వంటి వాటిని ఆహారంలో తీసుకోరాదు. అలాగే వీటితోపాటు గుడ్డులోని పచ్చసొన, ఎండు చేపలు, మాంసానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వ్‌డ్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. అజినోమోటో, బేకింగ్ పౌడర్, సోడా బై-కార్బొనేట్ వంటివి కూడా హైపోథైరాయిడిజయం ఉన్న వారికి మంచిది కాదు. ఇక హైపర్‌థైరాయిడిజంతో బాధపడుతున్న వారికి డైట్‌లో ఆంక్షలు ఏం లేవు. మితాహారం మంచిది..’ అని వివరించారు.