Matti Vasana: వానలో తడిసిన మట్టి నుంచి నోరూరించే సువాసన రావడానికి కారణం ఇదే
Matti Vasana: బాగా ఎండిన మట్టిపై తొలకరి జల్లులు పడితే చాలు, మట్టి వాసన ఘుమఘుమలాడిపోతుంది. కొందరికి మట్టిని తినేయాలన్న కోరిక కూడా పుడుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసుకోండి.
Matti Vasana: ఎండిన మట్టిపై వాన చినుకులు పడగానే ఒక ప్రత్యేకమైన పరిమళం మన ముక్కును తాకుతుంది. ఆ పరిమళాన్ని పెట్రికోర్ అని పిలుస్తారు. దీనిపై ఎప్పటినుంచో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా పెట్రీకోర్ ఏర్పడడానికి అసలైన కారణం ఏమిటో తేల్చేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
బ్యాక్టీరియానే కారణమా
బాగా ఎండిపోయిన మట్టి నేలలపై వాన పడగానే ఆ మట్టిలోంచి వచ్చే సువాసనకు ఒక బ్యాక్టీరియానే కారణం అని అంచనా వేస్తున్నారు. ఆ బాక్టీరియా.. జియోస్మిన్ అనే రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది అని చెబుతున్నారు. ఆ రసాయన సమ్మేళనం వాసనే మన ముక్కును తాకే పరిమళమని వివరిస్తున్నారు. ఆ బాక్టీరియా పేరు స్ట్రెప్టోమైసెస్ అని వివరిస్తున్నారు.
మట్టి సువాసన ఎంతగా మనిషికి నచ్చుతుందంటే ఆ సువాసనతో సెంట్లు తయారు చేసేవారు కూడా ఉన్నారు. మనదేశంలోనే మట్టి సువాసనను వేసే అత్తర్లను తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ లో ఈ అత్తర్ల తయారీ జరుగుతుంది.
మట్టి నుంచి వచ్చే సువాసన తాలూకు రహస్యాన్ని కనుగొనేందుకు వందేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. 1960లో ఆస్ట్రేలియా పరిశోధకులు ఆ పరిమళానికి పెట్రికోర్ అని పేరు పెట్టారు. ఈ పదాన్ని గ్రీకు భాష నుండి తీసుకున్నారు.
స్వచ్ఛమైన మట్టిలో మాత్రమే ఈ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను యాంటీబయోటిక్ మందుల తయారీలో కూడా వినియోగిస్తున్నారు. ఆ బాక్టీరియా మనకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చే వాసనను జంతువుల కంటే మనుషులే తెలుసుకోగలరని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే వాసన బాగుంది కదా అని రుచి చూస్తే మాత్రం అసహ్యంగా ఉంటుంది. మట్టి వాసనను చూసి ఎంతో మందికి నోరూరిపోతుంది. తినేయాలన్న కోరిక పుడుతుంది. కానీ నోట్లో పెడితే మాత్రం రుచి బాగోదు.
మొక్కల నుంచి కూడా
మట్టి నుంచే కాదు, మొక్కల నుంచి కూడా ఇలాంటి సువాసన వస్తుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మొక్కల్లో జీవక్రియ సరిగా జరగదు. ఎప్పుడైతే తొలకరి జల్లులు పడతాయో మొక్కల నుంచి టాపీన్ అని పిలిచే కార్బన్ సమ్మేళనాలు విడుదలవుతాయి. అవి కూడా మంచి సువాసన భరితంగానే ఉంటాయి. ఈ మట్టి వాసన మొక్కలపై పడిన వాసన కలిపి మన ముక్కుపుటాలు అదిరిపోయేలా సువాసనను వేస్తాయి. కొంతమందికి ఈ సువాసన నోరూరించేస్తుంది.
కేవలం బ్యాక్టీరియాలు, మొక్కల నుంచే కాదు, ఉరుములతో కూడిన గాలి వానలు పడినప్పుడు కూడా ఈ వాసన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు పరిశోధకులు. వాతావరణంలో దుమ్ము ధూళి చేరుకుంటాయి. ఒక్కసారిగా వర్షాలు పడ్డప్పుడు గాలి పరిశుభ్రంగా మారిపోతుంది. ఆ సమయంలో ఓజోన్ పొర నుంచి కూడా ఒక రకమైన వాసన వస్తుందని, అది కూడా ఆహ్లాదంగా ఉంటుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఏది ఏమైనా మట్టి వాసనను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. మిగతా వాసనలను మనిషి పెద్దగా గుర్తించలేడు, కానీ మట్టి వాసన మాత్రం పీల్చగానే అతని నరాలు జివ్వుమంటాయి. ఏదైనా తినేయాలన్న కోరిక పెరిగిపోతుంది.
టాపిక్