Meat banned city: ప్రపంచంలో పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించిన పట్టణం ఇది, మనదేశంలో ఉన్న ఈ ఊరి గురించి తెలుసుకోండి
Meat banned city: ఏదైనా గ్రామంలో శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరూ ఉంటారు, కానీ మాంసాహారులే లేని గ్రామం ఒకటుంది. అది కూడా మనదేశంలోనే ఉంది. ఇది ఎక్కడుందో తెలుసుకోండి.
Meat banned city: చికెన్ ఫ్రై, మటన్ వేపుడు, రొయ్యల బిర్యానీ... ఈ పేర్లు చెబితేనే మాంసాహారులకు నోరూరిపోతుంది. ప్రతి ఊరిలో కూడా మాంసాహారానికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క ఊరిలో మాత్రం మాంసాహారులే లేరు. ఆ ఊర్లో మాంసం దుకాణాలే కనబడవు. పూర్తిగా మాంసాహారాన్ని నిషేధించిన గ్రామం అది. ప్రపంచంలో ఇలా ఒక గ్రామం మొత్తం మాంసాహారం నిషేధించడం కేవలం ఒకే ఒక్క చోట జరిగింది. అది కూడా మనదేశంలోనే. ఆ గ్రామంలో మాంసాహారం తినడం, విక్రయించడం కొనడం పూర్తిగా నిషిద్ధం.
ఎక్కడ ఉంది ఈ పట్టణం?
గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలోని పాలిటానా అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలోని మాంసాహారం, కోడిగుడ్ల అమ్మకం పూర్తిగా నిషిద్ధం. అలాగే ఆ ఊర్లో మాంసాహారాన్ని తినడం కూడా మానేశారు. ఇలా మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించిన మొదటి నగరంగా పాలిటానా పట్టణం అవతరించింది. ఇది మొదటి నుంచి పూర్తి శాకాహార పట్టణం కాదు. 2014లో పెద్ద స్థాయిలో జైప సన్యాసులు 200 మంది నిరాహార దీక్షను చేపట్టారు. ఈ నగరం నుంచి మాంసాహారాన్ని నిషేధించాలని కోరారు. అంతవరకు ఈ నగరంలో 250 మాంసం దుకాణాలు ఉండేవి.
జైన కమ్యూనిటీ మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వం ఆ నగరంలో మాంసాహారం పై పూర్తి నిషేధం విధించింది. మాంసం, గుడ్లు వాడకంపై కూడా నిషేధం విధించింది. జంతువులను వధించడం కూడా చేయకూడదు. మాంసాహారం తిన్నా, అమ్మినా, జీవులను చంపినా భారీ జరిమానాలు వేస్తారు.
పాలిటానా పట్టణాన్ని దేవాలయాల నగరంగా గుర్తిస్తారు. 900 సంవత్సరాలలో 800 జైన దేవాలయాలను ఆ గ్రామంలో నిర్మించారు. పాలిటానా పట్టణంలో దొరికే శాఖాహారం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జైన వంటకాలు ఎంతో ప్రత్యేకంగా తయారవుతాయి. ఇవి అహింసా తత్వశాస్త్రం పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి చిన్న సూక్ష్మ జీవికి కూడా హాని కలగకుండా వండుతారు. కొంతమంది జైనులు పాలు, పాల ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉంటారు. స్వచ్ఛమైన శాఖాహారాన్ని తినేందుకు ఇష్టపడతారు.
పట్టణంలో ధోక్లా, గటియా, కధి,ఖాంద్వి వంటి ప్రత్యేకమైన గుజరాతీ వంటకాలు లభిస్తాయి. వీటి తయారీలో మిల్లెట్లను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే బెల్లం, నెయ్యిని కూడా అధికంగా వినియోగిస్తారు. స్పైసీ తడ్కా, లెంటిల్ సూప్ వంటివి ఇక్కడ కచ్చితంగా తిని చూడాల్సిందే. ఇక్కడకి వెళితే తినాల్సిన మరో ప్రసిద్ధ వంటకం కిచ్డీ. ఇది అందరికీ తెలిసిందే కావచ్చు కానీ ఈ పట్టణంలో మాత్రం చాలా రుచిగా వండుతారు. ఇది అక్కడ ప్రత్యేకమైన వంటకం.
జైనులకు పాలిటానా పట్టణం ఎంతో ప్రసిద్ధి చెందింది. జైనులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న ఎనిమిది వందలకు పైగా జైన దేవాలయాలు కొండలపై నెలకొన్నాయి. ఈ ఆలయాలు పాలరాతితో చేసి అందమైన వాస్తు శిల్పాలతో అలరారుతాయి.