Increase Testosterone Levels: అబ్బాయిలూ ఇలా సహజంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోండి, సంతాన సమస్యలు రాకుండా ఉంటాయి
Increase Testosterone Levels: మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఇది వారిలో స్పెర్మ్ నాణ్యతను, వాటి సంఖ్యను పెంచుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వారిలో లైంగికాసక్తిని మెరుగుపరుస్తుంది.
Increase Testosterone Levels: టెస్టోస్టోరాన్ అనేది మగవారిలో ముఖ్యమైన సెక్స్ హార్మోన్. ఇది వారిలో లిబిడోకు ముఖ్యమైనది. వారి కండర ద్రవ్యరాశిని, ఎముకుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ముఖ్యంగా వారిలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత కాపాడడంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ముఖ్యపాత్ర వహిస్తుంది.
మగవారిలో వచ్చే అంగస్తంభన, తక్కువ సెక్స్ డ్రైవ్, తీవ్ర అలసట, చిరాకు వంటివన్నీ పోవాలంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి అవ్వాలి. ఎప్పుడైతే మీలో ఈ లక్షణాలు కనిపిస్తాయో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కావడం లేదని అర్థం చేసుకోవాలి. దాన్ని పెంచుకోవాలంటే మందులు, హార్మోన్ థెరపీలు ఉంటాయి. అలాంటివి ప్రయత్నించే బదులు ఇంటిదగ్గర సహజంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుకోవడం ఉత్తమం.
తినాల్సిన ఆహారం
మీరు తినే ఆహారం మీ శరీరంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఆహారంలో కొన్ని రకాల పోషకాలు తగ్గినప్పుడు టెస్టోస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు సార్లు పండ్లు తినేందుకు ప్రయత్నించండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోండి. బ్రౌన్ రైస్, గోధుమలు వంటి వాటితో చేసిన ఆహారాలను తింటే మంచిది. అలాగే రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తాగితే టెస్టోస్టెరాన్ హార్మోను ఉత్పత్తి అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
విటమిన్ డి లోపం వల్ల
శరీరంలో విటమిన్ డి లోపించినా టెస్టోస్టెరాన్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం విటమిన్ డి మాత్రమే కాదు, జింక్ కూడా పుష్కలంగా ఉండాలి. జింక్, విటమిన్ డీలలో ఏది తగ్గినా కూడా టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పై ప్రభావం పడుతుంది. కాబట్టి గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, లివర్ వంటివి తరచూ తింటూ ఉండాలి. పగటిపూట ఎండలో ఒక పావుగంట ఉండటం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. చికెన్, తృణధాన్యాలు, నట్స్, బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోండి.
మెగ్నీషియం సప్లిమెంట్లు
మెగ్నీషియం సప్లిమెంట్లు క్రీడాకారుల టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచాయని ఒక అధ్యయనం గతంలో నిరూపించింది. కాబట్టి మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడానికి ప్రయత్నించండి. అయితే మీ వైద్యున్ని అడిగిన తర్వాతే ఈ సప్లిమెంట్లను తీసుకోవాలి. వైద్యుడు అంగీకారంతో మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకుంటే టెస్టోస్టెరాన్ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. లేదా మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలైన చిక్కుళ్ళు, నట్స్, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. ఇవి కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి.
ఒమేగా 3 ఉన్న ఆహారాలు
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యకరమైనవి. ఇవి టెస్టికల్స్ పరిమాణాన్ని పెంచుతాయి. టెస్టికల్స్ పరిణామం పెరగడం వల్ల టెస్టోస్టరాన్ ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల కోసం మీ ఆహారంలో చేపలు, వెజిటబుల్ ఆయిల్, సీడ్స్, చిక్కుళ్ళు వంటివి తినడం ఉత్తమం.
ఈ ఆహారాలు వద్దు
ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిల కోసం ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాలను దూరం పెట్టాలి. అనారోగ్యకరమైన కొవ్వులు నిండిన ఆహారాలు తినడం వల్ల మీ వృషణాల పనితీరు మారిపోతుంది. దీనివల్ల టెస్టోస్టరాన్ స్థాయిలు తగ్గిపోతాయి. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలకు కృత్రిమ స్వీట్‌నర్లు కలిసిన ఆహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. అంటే పిజ్జాలు, బర్గర్లు, సోడాలు, కూల్ డ్రింకులు వంటివి తినడం పూర్తిగా మానేయాలి. అలాగే తీపి పదార్థాలకు కూడా పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
టెస్టోస్టెరాన్ హార్మోన్ పెంచుకోవడానికి ప్రతి రోజు కొంత సమయం వ్యాయామం చేయడం చాలా అవసరం. ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు అధికంగా ఉంటే వెంటనే ముందుగా దాన్ని తగ్గించండి. అధిక బరువు ఉన్న పురుషులు తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలను కలిగి ఉంటారు. అలాగే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ఒత్తిడి పడే వారిలో టెస్టోస్టెరాన్ హార్మోను సరిగా ఉత్పత్తి కాదు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారిలో కూడా టెస్టోస్టెరాన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.
టాపిక్