Monsoon Destinations | మాన్‌సూన్ జల్లులలో విహారానికి సౌతిండియాలో బెస్ట్ ఇవే!
ఒకవైపు దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి.. మరోవైపు పచ్చని పర్యాటక ప్రాంతాలు తొలకరి జల్లులతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ మాన్‌సూన్‌లో టూర్ ప్లాన్ చేస్తే సౌత్ ఇండియాలో ఇవి బెస్ట్.
రోళ్లు పగిలే ఎండలకు బైబై చెప్పేసి, చల్లటి షవర్‌బాత్ చేయించే మాన్‌సూన్ సీజన్‌లోకి అడుగుపెట్టేశాం. మన భారతదేశం సీజన్‌కు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఇక్కడ చూడటానికి, పర్యటించడానికి ఎన్నో గొప్పగొప్ప ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం రావడంతో భూములన్నీ పచ్చగా మారుతున్నాయి. సెలయేళ్లు, జలపాతాలు గలగలమని నాట్యాలు మొదలుపెడుతున్నాయి. తొలకరి జల్లుల పన్నీరుతో రారమ్మని మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. మరి మీరు పర్యటనకు సిద్ధమేనా?
దక్షిణ భారతదేశం వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రాంతం. పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవులు, నిండుకుండలను తలపించే జలాశయాలు. ఈ సుందర దృశ్యాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఈ వర్షాకాలంలో విహరించడానికి 5 ఉత్తమమైన పర్యాటక ప్రాంతాలను ఇక్కడ జాబితా చేస్తున్నాం.
1. అరకులోయ, ఆంధ్రప్రదేశ్
ఎత్తైన తూర్పు కనుమలతో నడుమ అందాల అరకు లోయ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం విభిన్నమైన సంస్కృతికి, జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. అరకు మీకు తన కాఫీ తోటల ఘుమఘుమలతో స్వాగతం పలుకుతుంది. ట్రెక్కింగ్, కేవింగ్ ఇతర ఎన్నో వినోదభరితమైన కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. వర్షాకాలంలో అరకు లోయలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
2. జోగ్ ఫాల్స్, కర్ణాటక
అల్లంత ఎత్తు నుంచి కిందకు దూకే జోగ్ జలపాతం చూస్తే ఆకాశం నుంచి పాల సముద్రం మేఘమై కురుస్తుందా అనే అనుభూతి కలుగుతుంది. ఈ జలపాతం రాజా, రాణి, రోవర్, రాకెట్ అనే నాలుగు జలపాతాల సంఘమం. నాలుగు జలపాతాలు కలిసి శరావతి నదిపై భారీ జలపాతాన్ని ఏర్పరుస్తాయి. జోగ్ జలపాతం కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది.
3. కొడైకెనాల్, తమిళనాడు
తమిళనాడులోని మధురై నుండి 120 కి.మీ దూరంలో ఉన్న కొడైకెనాల్ ఒక హిల్ స్టేషన్. కొడైకెనాల్ అనే పేరుకు తమిళంలో 'అడవి అందించిన బహుమతి' అనే అర్థం వస్తుంది. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదంలా అనిపిస్తుంది. అద్భుతమైన దృశ్యాన్నిచ్చే పర్వతాలు, సరస్సులు, జలపాతాలు ఉన్నాయి. క్యాంపర్లు, ట్రెక్కింగ్ చేసేవారికి, హనీమూన్ జంటలకు ఈ ప్రదేశం ఎంతో గొప్పగా ఉంటుంది.
4. అలప్పుజా, కేరళ
భారతదేశం నైరుతి తీరంలో ఉన్న అలప్పుజా లేదా అలెప్పీ అపారమైన ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. సముద్రపు మొక్కలు, పూలతో కప్పబడిన బ్యాక్ వాటర్స్ నడుమ అద్భుతమైన హౌస్-బోట్‌ల ద్వారా విహారం ఎన్నటికీ మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. ఆగస్టు నెలలో జరిగే స్నేక్ బోట్ ఫెస్టివల్ ఇక్కడ అత్యంత గుర్తింపు పొందిన క్రీడలలో ఒకటి. నెలల ముందు నుంచే ప్రాక్టీస్ సెషన్‌లు జరుగుతాయి. అలెప్పిలో మరో ప్రత్యేక ఆకర్షణ ఫ్లోటింగ్ త్రివేణి మార్కెట్. ఈ మార్కెట్ నీటిపై తేలుతుంది. వర్షాకాలంలో అలెప్పీలో పర్యటన అస్సలు మిస్ చేసుకోవద్దు.
5. లక్షద్వీప్, యూనియన్ టెరిటరీ
లక్షద్వీప్ అంటే 'లక్ష ద్వీపాలు' అని అర్థం. దేశంలోనే అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్ లో 12 అటోల్‌లు, 3 దిబ్బలు, 5 నీటమునిగిన తీరాలు ఉన్నాయి. ఎంతో వినోదభరితమైన జల క్రీడలకు ఈ ప్రదేశం పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. స్కూబా డైవింగ్, కయాకింగ్, కెనోయింగ్ సహా ఇంకా ఎన్నో జల, సహస క్రీడలను ఆడుతూ లక్ష ద్వీప్‌లో ఎంజాయ్ చేయవచ్చు. స్కూబా డైవింగ్ చేస్తూ అగట్టి ద్వీపాలలో పగడపు దిబ్బలను అన్వేషించవచ్చు. చేపలు పట్టవచ్చు.
సంబంధిత కథనం