Conversation Starters | నలుగురితో కలవాలంటే జంకుతున్నారా? మాటలు ఇలా కలపండి
కొంతమంది ఎప్పుడైనా, ఎవరితోనైనా చాలా ఈజీగా కలిసిపోతారు. పులిహోర కలపడంలో వీరికి వేరే మహారాజులు, మహారాణులు. అదే కొంతమంది ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ కలవరు. మరి ఎవరితోనైనా మాటలు కలపాలి? సంభాషణ ఎలా ప్రారంభించవచ్చో నిపుణులు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు.
కొంతమంది ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ కలవరు, వారి ప్రక్కన భూమి బద్దలైనా అస్సలు పట్టించుకోరు. నిజానికి వారి మెదడులో ఎన్నో రకాల ఆలోచనలు, మాటలు ఉన్నా కూడా వాటిని ఏ రూపంలోనూ అవతలి వ్యక్తితో పంచుకోరు. తమలో తామే మాట్లాడుకుంటారు, తమతో తామే ఉంటారు. అంతమాత్రాన వీరేదో తేడా అనుకోనక్కర్లేదు. వీరిని సాధారణంగా ఇంట్రోవెర్ట్స్ (అంతర్ముఖులు) అంటారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, ముఖేశ్ అంబానీ లాంటి అపరకుబేరులు ఇలా ప్రపంచంలో ఎంతోమంది గొప్పగొప్పవారు అంతర్ముఖులేనట.
అయితే వీరు ఏదో గర్వంతో ఒకరితో మాట్లాడవద్దు అనుకునేవారు కాదు, మాట్లాడితే ఎదుటివారికి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమోనని వీరు ఇబ్బంది పడుతుంటారు. సిగ్గు, బిడియం, జంకు వీరిని వెనకడుగు వేసేలా చేస్తాయి. సంభాషణను ఎలా ప్రారంభించాలో తెలియకపోవడం లాంటి సమస్యలతో ఇలాంటివారు ఇబ్బంది పడుతుంటారు.
ఏదేమైనా అందరూ ఒకచోట కలిసి పనిచేస్తున్నపుడు, ఒకచోట ఉంటున్నప్పుడు వారిని పలకరించడం చేయాలి. ముఖ్యంగా పనిచేసే చోట ఇది ఒక బాధ్యత. అప్పుడే మీరు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు, మీ ఆలోచనలు అందరితో పంచుకోగలుగుతారు. మీ స్కిల్స్ పెరుగుతాయి. అది మీకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో మేలు చేస్తుంది.
మరి ఎవరితోనైనా మాటలు కలపాలి? సంభాషణ ఎలా ప్రారంభించవచ్చో నిపుణులు కొన్ని చిట్కాలు అందిస్తున్నారు. అవేంటో చూడండి.
ఏదైనా సహాయం కోసం అడగండి
ఆఫీసులో ఒకరితో సంభాషణ ప్రారంభించడానికి ఇది చాలా సులభమైన మార్గం. మీరు మీ వృత్తిలో కొత్తగా నేర్చుకోవడంలో భాగంగా ఏదైనా సహాయాన్ని మీ సహోద్యోగిని అడగండి. లేదా వారికి ఏదైనా సహాయం అవసరమయితే మీరేమైనా చేయగలుగుతారేమో చూడండి. ఇది మీపై ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. మీ చుట్టూ ఉన్నవారితో మిమ్మల్ని కలిసిపోయేలా చేస్తుంది.
పనిభారాన్ని ఎలా నియంత్రిస్తున్నారో అడగండి
ఒకరి పనిభారం గురించి మనకు తెలిసినా, తెలియకపోయినా పనిభారం ఎలా ఉంది? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఎలా చేయవచ్చు ఇలాంటివి అడిగితే ఏదైనా చెప్పటానికి ఆసక్తి చూపుతారు. ఏవైనా సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ రకంగా మీ మాటలు మొదలవుతాయి. మీ విచక్షణ ప్రకారం మసులుకుంటే సరిపోతుంది.
ఉద్యోగం గురించి అడగండి
మీరు ఏదైనా పార్టీలో లేదా మీటింగ్ లో ఉన్నప్పుడు. ఎవరితోనైనా సంభాషణను ప్రారంభించాలనుకుంటే వారి జాబ్ ఏంటి, ఏం చేస్తారు? అని అడగొచ్చు. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక పరిచయం ఏర్పడుతుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆ పరిచయం ఆ తర్వాత కూడా కొనసాగుతుంది.
ఫుడ్- వీకెండ్ ప్లాన్స్ గురించి
మీ బ్రేక్ టైంలో ఫుడ్ గురించి అడగొచ్చు. ఫుడ్ ఎలా ఉంది? వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అడగొచ్చు లేదా మీ వద్ద ఏమైనా ప్లాన్స్ ఉంటే పంచుకోవచ్చు. కలిసి తింటే ఎక్కువ మందితో సంభాషణలు జరపొచ్చు, ఇలా మీకు ఒక గ్రూప్ ఏర్పడుతుంది.
అభినందించండి
ఒకరిని అభినందించడం ద్వారా కూడా సంభాషణ ప్రారంభించవచ్చు. పనిచేసే చోట ఎవరైనా గొప్పగా చేస్తే దానిని అభినందించాలి. లేదా వారి ఫ్యాషన్ గురించి, వారి సమయపాలన గురించి అభినందించవచ్చు. కాంప్లిమెంట్స్ నచ్చనివారు ఎవరుంటారు? ఎదుటివారికి అసౌకర్యం కలిగించనంతవరకు దేనినైనా అభినందించవచ్చు. ఇది వారి ముఖాల్లో చిరునవ్వుకు కారణమవుతుంది, మీ మాటలు కలుస్తాయి.
ఈ రకంగా మీరు ఎవరితో అయినా మాటలు కలపొచ్చు. మీ వద్ద మాటలు లేకపోయినా ఒక పలకరింపుగా చూసినా, హాయ్.. బాయ్ లాంటివి చెప్పుకుంటూపోతే మెల్లిమెల్లిగా మాటలు అవే ప్రారంభమవుతాయి. అయితే మీరు మాట్లాడే టాపిక్ ఏదైనా స్నేహపూర్వకంగా ఉండాలి. ఒకరిపై విధ్వేషపూరిత మాటలు, గాసిప్స్ మీపై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఇలాంటి ధోరణితో మీకు విపరీతమైన నష్టం కలుగుతుందని మర్చిపోవద్దు.
టాపిక్