Thursday Motivation: సంతోషకరమైన వివాహ అనుబంధం కోసం ఇన్ఫోసిస్ సుధా మూర్తి చెబుతున్న సలహాలు ఇవే
Thursday Motivation: భార్యాభర్తలు సంతోషకరమైన అనుబంధాన్ని కొనసాగించాలంటే వారిద్దరి మధ్య ప్రేమ, అనుబంధమే కాదు... ఇంకా కావలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలను ఇన్ఫోసిస్ సుధా మూర్తి వివరిస్తున్నారు.
Thursday Motivation: రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ సుధా మూర్తి ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె తన జీవిత అనుభవాలనే పుస్తకాలుగా మార్చి నేటి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలను వివరించారు. జీవితంలో వివాహ బంధం ఎంతో ముఖ్యమైనదని సుధా మూర్తి చెబుతూనే ఉంటారు. వివాహంలో ఆనందం, సంతోషం ఉండాలన్నా, ఆ బంధం కలకాలం నిలవాలన్నా కొన్ని చిట్కాలను పాటించాలని ఆవిడ చెబుతున్నారు.
వివాహ జీవితం సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తల జీవితం చాలా సులువుగా ఉండాలి. జీవితం పై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే ఎక్కువ నిరాశలు ఎదురవుతాయని ఒకసారి బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో వివరించారు. కాబట్టి వివాహ జీవితంలో సంతోషంగా ఉండాలి. ఒత్తిడిని దూరంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాలకి సంతృప్తి చెందాలి. ఆర్థికంగా భావోద్వేగపరంగా, మానసికంగా ఈ విషయాల్లోనూ జీవిత భాగస్వాములు ఒకరిపై ఒకరు ఆధారపడాలి. కష్టాలు అనేవి జీవితంలో ఒక భాగం అని ఇద్దరూ అర్థం చేసుకోవాలి. అప్పుడే వారిద్దరి జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగిపోతుంది అని ఆమె వివరించారు.
సుధా మూర్తి సంతోషకరమైన దాంపత్యానికి సంబంధించిన విషయాన్ని వివరిస్తూ భాగస్వామిని, ఆమె లోపాలను ఉన్నవి ఉన్నట్టు స్వీకరించాలని సూచించారు. వారి బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకొని వారికి అండగా నిలవాలని సుధామూర్తి చెప్పారు. ఏ పనైనా జంటగా కలిసి చేస్తే అది విజయవంతం అవుతుందని వివరించారు. ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన పర్‌ఫెక్ట్ జంటలు ఎవరూ ఉండరు. జీవితం అంటేనే ఇవ్వడం, తీసుకోవడం. ప్రతి జీవితంలో ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి అంటూ ఆమె ఎన్నోసార్లు వివాహ జీవితం గురించి చెప్పుకుంటూ వచ్చారు.
వివాహంలో ఎదురయ్యే విభేదాలను పరిష్కరించడం గురించి ఆమె ఒకసారి మాట్లాడారు. వివాహమైనప్పుడు ఎన్నో గొడవలు రావచ్చు. ఆ సమయంలో మానసికంగా కాస్త పోరాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అంగీకరించాల్సి వస్తుంది. గొడవలు పడకపోతే భార్యాభర్తలే కారు అంటూ సుధా మూర్తి చెప్పారు. ప్రతీ భార్యాభర్త గొడవలు పడతారని మళ్ళీ కలిసి పోతారని అది సాధారణమని వివరించారు. మీ జీవిత భాగస్వాముల్లో ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు సమాధానం ఇవ్వకుండా, తిట్టకుండా ఉంటే ఆ గొడవ పెద్దది కాకుండా సమస్య పోతుందని ఆమె చెబుతున్నారు. తన భర్త నారాయణమూర్తి కోపంగా ఉన్నప్పుడు తాను ఏమీ మాట్లాడనని ఆమె వివరించారు. అలాగే తనకు కోపం వచ్చినప్పుడు తన భర్త కూడా మౌనంగా ఉండిపోతారని చెప్పారు. ఇలా చేయడం వల్ల తమ మధ్య విభేదాలు ఏవీ పెద్దవి కాకుండా చిన్న స్థాయిలోనే ముగిసిపోయాయని వివరించారు. భార్యాభర్తలు ఎవరైనా కూడా ఇలా ఉంటే వారి మధ్య గొడవలు చాలా తక్కువగా వస్తాయని సుధా మూర్తి చెబుతున్నారు.
భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించాలని, ఒకరి ఇష్టాలను అయిష్టాలను ఎదుటివారు గౌరవించాలని... అప్పుడే వారి మధ్య బంధం మరింత బలంగా మారుతుందని చెప్పారు. సుధా మూర్తి చెప్పిన ఈ అంశాలను పాటిస్తే భార్యాభర్తలు నిజంగానే సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశం కచ్చితంగా ఉంటుంది.