Fitness Tips | ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? మీకోసమే ఈ 8 టిప్స్‌!-these are the fitness tips for beginners ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Are The Fitness Tips For Beginners

Fitness Tips | ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? మీకోసమే ఈ 8 టిప్స్‌!

Hari Prasad S HT Telugu
Jan 28, 2022 05:00 AM IST

ఇప్పుడిప్పుడే ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్న వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసమే ఇప్పుడు కొన్ని ఫిట్‌నెస్‌ టిప్స్‌ చెప్పుకోబోతున్నాం. సాధారణంగా ఏ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయినా అప్పుడే కసరత్తులు మొదలుపెడుతున్న వారికి ఇవే సూచనలు చేస్తారు. మరి ఆ టిప్స్‌ ఏంటో మీరూ తెలుసుకొని మీ ఫిట్‌నెస్‌ పనిని మొదలుపెట్టండి.

కొత్తగా వర్కవుట్స్ మొదలుపెడుతున్న వారికే ఈ టిప్స్
కొత్తగా వర్కవుట్స్ మొదలుపెడుతున్న వారికే ఈ టిప్స్ (Pixabay)

Fitness Tips.. ఫిట్‌గా ఉండాలని అనుకోవడం వేరు. ఆ దిశగా అడుగు వేసి ప్రతి రోజూ ఉదయాన్నే లేచి కసరత్తులు చేయడం వేరు. మెజార్టీ శాతం ఫిట్‌గా ఉండాలని మాత్రమే అనుకుంటారు. కొందరు మాత్రమే ఓ అడుగు ముందుకు వేసి పని మొదలుపెడతారు. ఇంకొందరు ఉంటారు.. వీళ్లు కొన్ని రోజులు చాలా ఆసక్తిగా పొద్దున లేవగానే ఎక్సర్‌సైజులు చేస్తారు. అయితే కొంత కాలానికే ఆసక్తి తగ్గిపోయి వదిలేస్తారు. 

1. ఎందుకు చేస్తున్నారు?

ముందుగా తెలుసుకోవాల్సింది అసలు మీరు ఎందుకు ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారు? దీనికోసం ఏమి చేయాలి? ఎలా చేయాలి అనుకుంటున్నారన్నది కూడా తెలుసుకోవాలి. అవసరమైతే వీటిని ఓ చోట రాసుకోండి. ప్రతి రోజూ వాటిని చూస్తుంటే.. మీ ఫిట్‌నెస్‌ వెనుక ఉన్న ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.

2. 30 నిమిషాలు చాలు

కొత్తగా వర్కవుట్స్‌ చేస్తున్న వాళ్లు ఒకే రోజు మీ ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోవాలన్నట్లుగా కసరత్తులు చేయొద్దు. మొదట మెల్లగా 30 నిమిషాల పాటు చేయండి. వారానికి మూడు రోజులే చేయండి. మొదటి నాలుగు వారాలు ఇదే కొనసాగించండి. ఆ తర్వాతే మీ వర్కవుట్స్‌ టైమ్‌ పెంచడం, మూడు రోజులను కాస్తా ఆరు రోజులకు పెంచడం చేయండి. మీరు ఊహించని మార్పును కూడా మీరు చూస్తారు.

3. ప్రోత్సహించే వ్యక్తులను చూడండి

ఎవరికైనా ఓ కొత్త పని చేయాలంటే మోటివేషన్‌ అనేది చాలా అవసరం. అందులోనూ ఫిట్‌నెస్‌ కోసం చేసే వర్కవుట్స్‌ విషయంలో ఇది మరీ ముఖ్యం. కొన్ని రోజుల తర్వాత కాడి వదిలేయకుండా కొనసాగించాలంటే.. ఈ వర్కవుట్స్‌లో మీతోపాటు ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను చూడండి. వాళ్లు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ కావచ్చు, ఫ్రెండ్స్‌ కావచ్చు లేదా బయటి వాళ్లయినా సరే. ఉదయాన్నే ఎక్సర్‌సైజులు చేయడం ఒక్కటే కాదు.. తర్వాత ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎంతసేపు నిద్రపోతున్నాం, ఎన్ని నీళ్లు తాగుతున్నాం అన్నవి కూడా ముఖ్యమే.

<p>మంచి జిమ్ మేట్ ఉంటే ప్రోత్సాహంగా ఉంటుంది</p>
మంచి జిమ్ మేట్ ఉంటే ప్రోత్సాహంగా ఉంటుంది (Pixabay)

4. ఇష్టమైనవే చేయండి

కొందరు ఏవో వీడియోలు చూస్తూ రకరకాల ఎక్సర్‌సైజులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా చేస్తుంటారు. ఇది కొంతకాలమే ఉంటుందని గమనించండి. మొదట్లో మీరు ఎక్కువగా ఇష్టపడే కసరత్తులే చేయడం వల్ల మీకు క్రమంగా ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతుంది. రోజూ చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోవడం కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్‌ చేస్తుంది.

5. గాయాల బారిన పడొద్దు

ఇంతకుముందు చెప్పినట్లు కొత్త కొత్త ఎక్సర్‌సైజులు చేయడం, అతిగా చేయడం వంటివి మొదట్లో మిమ్మల్ని గాయాల బారిన పడేలా చేస్తాయి. మొదట్లోనే గాయపడితే ఇక తర్వాత వ్యాయామంపై ఆసక్తి తగ్గిపోతుంది.

6. వామప్‌ తప్పనిసరి

వ్యాయామం చేస్తున్నప్పుడు గాయపడకుండా ఉండాలంటే ముందుగా వామప్‌ తప్పనిసరి. అసలు వర్కవుట్‌ కంటే ముందు కాస్త బాడీని స్ట్రెచ్‌ చేయాలి. కాళ్లు, చేతులు వంటివి నిద్రలేవగానే బిగుసుకుపోయినట్లు ఉంటాయి. వాటిని సాగేలా చేస్తే.. ఎలాంటి గాయాల బారిన పడకుండా కసరత్తులు చేయవచ్చు.

7. స్క్వాట్స్‌, లంజెస్‌పై పట్టు సాధించండి

<p>స్క్వాట్స్</p>
స్క్వాట్స్ (pexels)

మొదట్లో స్క్వాట్స్‌, లంజెస్‌ వంటి ప్రాథమిక వ్యాయామంపై పట్టు సాధించండి. నిజానికి ప్రాథమిక విషయాలపై పట్టు సాధించడానికే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మరేం ఫర్వాలేదు. ఇది సరిగా చేస్తేనే ముందు ముందు మరింత కఠినమైన ఎక్సర్‌సైజులు చేయడానికి శరీరం సహకరిస్తుంది.

8. వెంటనే ఫలితాలు రావు

రాత్రికి రాత్రే కండలు పెంచాలంటే సాధ్యం కాదు. ఒక్కరోజు వర్కవుట్స్‌ చేసి, బరువులు మోసి అద్దంలో చూసుకుంటే ఎలాంటి మార్పు కనిపించదు. అందువల్లో దీర్ఘకాలంలో వచ్చే సానుకూల ఫలితాలపై దృష్టి సారించి వ్యాయామం చేయడం మంచిది. ఉదయాన్నే కసరత్తులు చేయడం, అందుకు తగిన పౌష్టికాహారం తినడం వల్లే మీరు ఫిట్‌గా ఉంటారన్న విషయం గుర్తుంచుకోండి. ఇక ప్రతి వర్కవుట్ తర్వాత మీలో వస్తున్న చిన్న చిన్న మార్పులను గమనిస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చి చూసుకోవద్దు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్