Stress Relievers । ఒత్తిడితో చిత్తవుతున్నారా..? అయితే ఈ మార్పులు చేసుకోండి!-these are the best foods that help reduce stress and anxiety levels ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stress Relievers । ఒత్తిడితో చిత్తవుతున్నారా..? అయితే ఈ మార్పులు చేసుకోండి!

Stress Relievers । ఒత్తిడితో చిత్తవుతున్నారా..? అయితే ఈ మార్పులు చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 04:55 PM IST

Stress Relievers: ప్రశాంతంగా ఉండండి, ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడిని తగ్గించే మార్గాలు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Stress Relievers
Stress Relievers (Unsplash)

ఒత్తిడి అనేది ప్రతి వ్యక్తి రోజూవారీగా ఎదుర్కొనే ఒక మానసిక సమస్య. కానీ, కొన్నిసార్లు వ్యక్తులు తాము ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారనేది గుర్తించలేరు. బిజీ షెడ్యూల్స్, రిలేషన్‌షిప్ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, నిశ్చల జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ వినియోగం ఇలా ఒత్తిడికి చాలా కారణాలు ఉన్నాయి. వృత్తిపరమైన సవాళ్ల నుంచి వ్యక్తిగత జీవితంలో జరిగిన గాయాల వరకు నిరంతరమైన ఆలోచనలతో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇవన్నీ ఒత్తిడిని ప్రేరేపించవచ్చు. ఒత్తిడి, ఆందోళనలు తీవ్రమైతే అది మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యం కోసం ఈ ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రతిరోజూ ఒత్తిడి ఏదో ఒక రూపంలో మీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి మీరు ఒత్తిడిని తగ్గించే మార్గాలను (Stress Relievers) కనుగొనవలసి ఉంటుంది. ఆహారంలో మార్పులు, వారానికి కనీసం 150 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల మితమైన కార్యాచరణ ద్వారా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, ఓర్పు పెరుగుతుంది. ఇది వారి జీవనశైలి సంబంధిత వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది.

Stress Relieving Foods- ఒత్తిడిని తగ్గించే ఆహారాలు

ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి కొన్ని గొప్ప ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. మీరు ఒత్తిడికి లోనవుతున్నప్పుడు వీటిని తీసుకోండి, మీ మనసు తేలికపడి ఒత్తిడి తగ్గుతుంది. ఎలాంటివి తీసుకోవాలో ఇక్కడ చూడండి.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు

పీచుపదార్థం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడం ద్వారా మీ జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించవచ్చు. తాజా పండ్లు, ఆకు కూరలు, గింజలు, తృణధాన్యాలలో ఫైబర్ ఉంటుంది.

ప్రాసెస్ చేయని ధాన్యాలు

సెరోటోనిన్ అనేది ఒత్తిడిని తగ్గించి, మీ మూడ్ మార్చే ఒక హార్మోన్. ఈ హార్మోన్ స్థాయిలను పెంచడం ద్వారా మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గిపోయి, ఏకాగ్రత పెరుగుతుంది. అయితే అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, ప్యాకేజ్ పదార్థాలు తినడం మానుకోవాలి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, అప్పటివరకు రక్తంలో చక్కెరను క్రమంగా విడుదల చేస్తుంది. కాబట్టి సహాజమైన ఆహారాలను, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించాలి.

డార్క్ చాక్లెట్

స్వచ్ఛమైన డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సమ్మేళనాలు హార్మోన్లను నియంత్రించగలవు. డార్క్ చాక్లెట్‌ను మితంగా తిన్నప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

గింజలు, విత్తనాలు

మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే నట్స్ ఒత్తిడిని తగ్గించే చిరుతిండిగా పనిచేస్తాయి. బాదం, అవిసె గింజలు, పిస్తాపప్పులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వాల్‌నట్‌లు మితంగా తింటే ఒత్తిడి తగ్గుతుంది.

తులసి టీ

తులసిలో యాంటీ-మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మెటబాలిక్, యాంటీఆక్సిడెంట్ మొదలైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులు నమలడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. లేదా తులసి టీ తాగినా ప్రయోజనం ఉంటుంది. తులసి- ములేతి టీ ఒత్తిడిని తగ్గించడానికి, ఇంద్రియాల ఉపశమనానికి ఒక అద్భుత టీగా ప్రసిద్ధి.

గోరువెచ్చని పాలు

పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగండి. వెచ్చని పాలు విశ్రాంతి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రాత్రికి మంచి నిద్రను ప్రేరేపిస్తుంది. పాలను మూడ్ స్టెబిలైజర్ గా పరిగణిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం