Milk Anemia: ఏడాది దాటిన పిల్లలు పాలు మాత్రమే తాగితే అది మిల్క్ ఎనీమియాకు దారి తీస్తుంది, జాగ్రత్త-the biggest problem is if the babies drink only milk after one year it leads to milk anemia ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Milk Anemia: ఏడాది దాటిన పిల్లలు పాలు మాత్రమే తాగితే అది మిల్క్ ఎనీమియాకు దారి తీస్తుంది, జాగ్రత్త

Milk Anemia: ఏడాది దాటిన పిల్లలు పాలు మాత్రమే తాగితే అది మిల్క్ ఎనీమియాకు దారి తీస్తుంది, జాగ్రత్త

Haritha Chappa HT Telugu
Aug 07, 2024 04:30 PM IST

Milk Anemia: బిడ్డకు ఏడాది వయసు వచ్చాక కేవలం పాలు మాత్రమే పెట్టకూడదు. ఏ ఆహారం తినకుండా కేవలం పాలతోనే ఏడాది వయసు దాటిన పిల్లలు జీవిస్తే… అతనికి మిల్క్ ఎనీమియా వచ్చే అవకాశం ఉంది.

పిల్లల్లో మిల్క్ ఎనీమియా
పిల్లల్లో మిల్క్ ఎనీమియా (shutterstock)

ఏడాది నుంచి రెండేళ్ల వయసున్న చిన్నారులు ఎక్కువగా కేవలం పాలతోనే జీవిస్తూ ఉంటారు. మిగతా ఆహారాన్ని ఏమీ తినకపోవడం, త్రాగకపోవడం వంటివి జరుగుతాయి. మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే మీరు దాన్ని తీవ్రంగా పరిగణించాలి. బిడ్డ ఎదుగుదలకు పాలు అవసరమే, అయినా పాలు మాత్రమే అన్ని పోషకాలను బిడ్డకు అందించలేవు. ఏడాది దాటిన తర్వాత పిల్లలకు అన్నం, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తినిపించాలి. రోజంతా బిడ్డకు పాలు మాత్రమే ఇస్తే… అది ఆరోగ్యానికి మంచిది కాదు. పాలు ఎక్కువగా తాగడం వల్ల రెండేళ్లు దాటిన పిల్లల్లో మిల్క్ ఎనీమియా వచ్చే అవకాశం ఉంది.

మిల్క్ ఎనీమియా అంటే ఏమిటి?

మిల్క్ ఎనీమియా అనేది పిల్లలు కేవలం పాలపై మాత్రమే ఆధారపడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్య. పిల్లలు ఇతర ఆహారాలు తినకుండా, పాలు మాత్రమే తాగుతున్నప్పుడు అది వారిలో ఐరన్ లోపానికి కారణమవుతుంది. పాలల్లో ఉండే పాల ప్రోటీన్ కేసైన్ ఉంటుంది. ఇది ఇనుము శోషణను నిరోధిస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య మొదలవుతుంది.

పాల వల్ల వచ్చే రక్తహీనత కాబట్టి దీన్ని మిల్క్ ఎనీమియా అని అంటారు. బిడ్డ లోపల ఏర్పడే రక్తహీనత సమస్య అలసట, బలహీనతకు కారణమవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఐరన్ సప్లిమెంట్లను చాలాసార్లు ఇస్తారు. వారికి ఇచ్చే పాల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఈ సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. వారికి అన్నంతో చేసిన ఆహారాన్ని, రాగి జావ, ఓట్స్ జావ, పండ్ల రసాలు, ముద్ద పప్పు, రసం వంటివి తినిపించడం ద్వారా ఈ సమస్యను నయం చేయవచ్చు.

రెండేళ్ల వయసున్న పిల్లలు ఎక్కువ మొత్తంలో పాలు తాగితే వారిలో మలబద్ధకం సమస్యలు కూడా మొదలవుతాయి. ఫైబర్ లోపం వల్ల పిల్లల్లో మలబద్ధకం మొదలవుతుంది. కాబట్టి ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఎక్కువ పాలు తాగే పిల్లలు కొన్నిసార్లు తక్కువ నీరు తాగుతారు. అటువంటి పరిస్థితిలో, పిల్లలకు పొట్ట నొప్పి రావడం ప్రారంభిస్తారు. జీర్ణక్రియకు సంబంధించిన ఈ సమస్యలను అధిగమించడానికి, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, నీరు అధికంగా పిల్లలకు తినిపించడంపై దృష్టి పెట్టాలి.

బిడ్డ పాలు తాగినప్పుడు, అతనికి ఆకలి తగ్గడం ప్రారంభమవుతుంది. పిల్లలకి ఆహారం పట్ల ఆసక్తి కలిగేలా చేయడానికి, వారికి వివిధ రకాల ఆహారాన్ని తినిపించడంపై దృష్టి పెట్టండి.

ఎంత పాలు ఇవ్వాలి?

ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు ఒకటిన్నర కప్పు పాలు రోజుకు ఇవ్వవచ్చు. అదే సమయంలో పిల్లలకు రెండేళ్లు దాటినట్లయితే రోజంతా రెండు నుంచి రెండున్నర కప్పుల పాలు మాత్రమే తాగాలి. అధికంగా పాలు తాగిస్తే పిల్లలలో పోషకాహార లోపం రావచ్చు. అదే సమయంలో, 9 సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు రోజుకు 3 కప్పుల పాలు ఇవ్వాలి.

టాపిక్