Memory loss | మతి మరుపుతో బాధపడుతున్నారా? జ్ఞాపకశక్తి పెంచుకునే చిట్కాలు ఇవిగో
Memory loss | మతి మరుపు.. మారిన జీవన శైలి కారణంగా ఎదురవుతున్న వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. ఒత్తిడి, క్రమశిక్షణ రాహిత్యంతో కూడిన జీవన శైలి కారణంగా చాలా మందిలో ఈ సమస్య ఎదురవుతోంది. చిన్న చిన్న విషయాలను కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు బాధపడుతుండడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మతి మరుపు వ్యాధిని నయం చేసేందుకు ఇంకా ఔషధాలు అందుబాటులోకి రాలేదు. అయితే జీవన శైలిలో మార్పులు, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మతి మరుపు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే ఈ మతిమరుపు సమస్య కొందరిలో 40 ఏళ్ల నుంచే మొదలవ్వొచ్చు. అందువల్ల యవ్వనంలో ఉండే దురలవాట్లు, ఒత్తిళ్లు అప్పుడు ప్రభావం చూపకపోయినప్పటికీ, 40, 50 ఏళ్ల వయస్సులో విభిన్న సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. మతిమరుపు సమస్య నుంచి బయటపడేందుకు, జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు ఈ టిప్స్ ఉపయోగపడుతాయి.
తగినంత నిద్ర
మీరు ఉద్యోగం లేదా వ్యాపార అభ్యున్నతి కోసం బాగా కష్టించి పని చేసిన రోజుల్లో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చు. ఆ సమయంలో తగినంత నిద్ర మీకు లభించి ఉండకపోవచ్చు. ఆ లోపం కారణంగా ఎదురైన పరిణామాలు మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కచ్చితంగా ఏడు గంటల నుంచి 8 గంటల పాటు నిద్ర అలవాటు చేసుకోండి. మీరు ప్రశాంత జీవనం గడిపేందుకు ఇదే పునాది.
సమతుల ఆహారం
మీరు సమతుల ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోండి. అధిక కొవ్వులు, అధిక కార్బొహైడ్రేట్లకు దూరంగా ఉండండి. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఉడికించిన కోడి గుడ్డు, గింజధాన్యాలు నిత్యం మీ ఆహారంలో భాగమయ్యేలా చూసుకోండి. మాంసాహారులైతే మాంసం, చేపలు, కోడి కూర కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి.
ఆల్కహాల్, పొగ మానేయండి
ఆల్కహాల్ మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పైగా ఇది మీలో కన్ఫ్యూజన్ పెంచుతుంది. మతి మరుపును కూడా పెంచుతుంది. అలాగే పొగ కూడా మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. తక్షణం ఈ రెండింటికి దూరంగా ఉండండి. ఈ రెండూ మీ మానసిక ఆరోగ్యానికి ప్రధాన శత్రువులు. డయాబెటిస్, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బులకు కూడా కారణమవుతున్నాయి.
వ్యాయామం, శారీరక శ్రమ
ఇప్పటి వరకు మీరు వ్యాయామం, శారీరక శ్రమకు దూరంగా ఉంటే.. ఇక వెంటనే మేల్కొండి. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇంకా భారీగా నష్టం జరుగుతుందని గుర్తించండి. వెంటనే నడక లాంటి తేలికపాటి వ్యాయామాలతో మొదలుపెట్టి, క్రమంగా ఎక్కువగా శ్రమించండి. తద్వారా మీలో నూతన ఉత్సాహాన్ని గమనించండి. కనీసం రోజుకు 30 నిమిషాల నడకతో మీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి.
మానసిక వ్యాయామం
మీ మెదడు చురుగ్గా పని చేసేందుకు అన్ని రకాల వనరులు గుర్తించండి. పుస్తక పఠనం, పజిల్స్, క్లాసికల్ మూవీస్ చూడడం, చిన్న పిల్లలతో గేమ్స్ ఆడడం, ఇలా ఏవైనా కావొచ్చు. మీరు ఒత్తిడి లేకుండా కూల్‌గా ఉండేందుకు, మానసికంగా చురుగ్గా ఉండేందుకు తగిన అలవాట్లను ఎంచుకోవడం మంచిది. మొక్కలు, కూరగాయల పెంపకం, జంతువులను పెంచుకోవడం, ప్రకృతితో మమేకమవడం, ట్రావెలింగ్.. ఇలా అనేక వ్యాపకాలతో మీరు మతిమరుపు సమస్యకు క్రమంగా దూరమవ్వొచ్చు.
అందరితో కలవండి
మీ ఉద్యోగ, వృత్తిగతమైన జీవితంలో పడి కొట్టుకుపోయి మీరు మీ బంధువులు, స్నేహితులకు దూరంగా జీవించి ఉంటారు. ఈ తప్పును కొనసాగించకండి. తిరిగి మీ బంధువులు, స్నేహితులను కలుస్తూ సాంఘిక జీవనానికి దగ్గర కావడం అలవాటు చేసుకోండి. ఇది మీ జీవన శైలిని మెరుగుపరుస్తుంది.
ప్లాన్ చేసుకోండి
మీరు హెల్మెట్ ఎక్కడ పెట్టారనో, మాస్క్ ఎక్కడ పెట్టారనో, మొబైల్ ఎక్కడ ఉందో అనో, ఇలా ప్రతి రోజూ మతిమరుపునకు లోనై గందరగోళానికి దారి తీస్తుంటే మీరు ఈ చికాకులు లేకుండా తగిన ప్రణాళిక ఏర్పరచుకోండి. కొన్ని నిర్ధిష్ట వస్తువులను నిర్ధిష్ట ప్లేస్‌లోనే పెట్టుకోండి. వాటి ప్లేస్ ఎప్పటికీ మార్చకుండా చూసుకోండి.
ఇల్లంతా చిందరవందరగా కాకుండా, చక్కగా అమర్చుకుంటే మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి. వస్తువులు ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టుకోండి. మొబైల్ ఛార్జింగ్ పెట్టడం, మందులు వేసుకోవడం వంటివాటికి ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను ఫోల్డర్ల వారీగా, బాక్సుల వారీగా అమర్చుకుంటే మీకు కావాల్సినప్పుడల్లా వెంటనే తీసుకోవచ్చు. ఫార్మసీ షాపులు చూసే ఉంటారు కదా.. రోజుకు వందలాది కస్టమర్లు వచ్చినా, ఫార్మసిస్టు మనం అడిగిన వెంటనే ఒక డబ్బా నుంచి ఔషధాలు తీసి ఇస్తారు. అలా మనం కూడా అన్నీ అమర్చుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి.
టెక్నాలజీని అలవరచుకోండి
ఆధునిక టెక్నాలజీ అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. మీరు మీ ప్రతి భవిష్యత్తు కార్యాచరణను గుర్తు తెచ్చుకోవడం కష్టమని అనిపిస్తే గూగుల్ క్యాలెండర్ ఉపయోగించండి. మీరు చేయబోయే పనులకు రిమైండర్లు పెట్టుకోండి. మీ స్నేహితులు, బంధువులతో వీడియో కాల్ లో మాట్లాడాలనుకుంటే ఇద్దరికీ వీలు చిక్కే సమయంలో ముందే షెడ్యూలు చేసి పెట్టుకోండి.
సంబంధిత కథనం