Netted saree tips: నెట్ చీర నార్మల్‌గా కట్టుకుంటే అస్సలు బాగుండదు, ఈ టిప్స్ తెల్సుకోండి
Netted saree draping: నెట్ చీర కట్టుకునేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే లుక్ మొత్తం పాడైపోతుంది. పెటికోట్ ఎంచుకోవడం నుంచి ఫాల్ వరకు ఈ టిప్స్ తెల్సుకోండి.
చీరలో ప్రతి ఆడపిల్ల అందంగా కనిపిస్తుంది. కానీ చీరకట్టు సరిగ్గా ఉంటే అందం రెట్టింపు అవుతుంది. చీరల్లో బోలెడు రకాలుంటాయి. షిఫాన్, నెట్, జార్జెట్, సిల్క్ కాకుండా ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని రకాల చీరలు కట్టుకోవడం కష్టమేం కాదు. కానీ పారదర్శకంగా ఉండేవీ, చాాలా తేలిగ్గా ఉండే నెట్ చీరలు కట్టడం మాత్రం సవాలే. ఈ చీరలు కట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే చీర అందం పోతుంది. చూడ్డానికీ చాలా ఎబ్బెట్టుగానూ ఉంటుంది. నెట్ చీర కట్టేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.
పెటికోట్:
నెట్ చీర లాంటివి పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి కాబట్టి పెటికోట్ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిందే. కేవలం రంగొక్కటి నప్పితే సరిపోదు. కాటన్ పెటికోట్స్ ఈ చీరలకు అస్సలు బాగుండవు. బదులుగా మెటాలిక్ రంగులు, శాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పెటికోట్స్ ఎంచుకోండి. చీర అందం పెరుగుతుంది. ఒకసారి దానిమీద చీర పెట్టి చూశారంటే మీకో అవగాహన వస్తుంది. సౌకర్యంగానూ ఉంటుంది.
పెటికోట్ పొడవు:
సరైన ఫ్యాబ్రిక్ తో పాటు పెటికోట్ పొడవును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పాదాలకు మించి పొడవు ఉంటే చీరకట్టు అందంగా కనిపించదు. పెటికోట్ పొడవు సరిగ్గా మడమ దాటి ఉండాలి. దాంతో పెటికోట్ కు, చీరకు మధ్య గ్యాప్ కనిపించదు. పెటికోట్ పొడవు తక్కువగా ఉంటే మధ్యలో నుంచి పాదాలు కనిపించి సౌకర్యంగా అనిపించదు.
బార్డర్‌కు తగ్గ ఫాల్:
నెట్ చీరలకు సాధారణంగా బార్డర్ దగ్గర ఎంబ్రాయిడరీ ఉంటుంది. మీరు ఎంచుకునే ఫాల్ అదే వెడల్పుతో ఉండాలి. పెద్ద ఫాల్ వేయిస్తే అది బయటకు కనిపిస్తుంది. చీర లుక్ మొత్తం పాడవుతుంది.
నాడలు:
మీరు నెట్ చీర కింద పెటికోట్ వేసుకున్నప్పుడు దాన్ని ఎలా కట్టుకుంటున్నారో కూడా ముఖ్యమే. చాలా మంది పెటికోట్ ఒక వైపుకు కట్టేస్తారు. దాంతో చీర నుంచి నాడలు బయటకు కనిపిస్తాయి. అందుకే నెట్ చీర కట్టేటప్పుడు మాత్ర చీర నాడలు మధ్యలో ముందువైపు కట్టుకోండి. పెటికోట్ దారాలు అస్సలు కనిపించవు.
బ్లవుజు డిజైనింగ్:
నెట్ చీర కోసం బ్లవుజ్ డిజైన్ చేసేటప్పుడు హుక్స్ ముందు వైపు పెట్టించుకోకండి. సైడ్ జిప్ లేదా బ్యాక్ హుక్స్ పెట్టించుకుంటే మంచిది. ఈ చీరలు పారదర్శకంగా ఉంటాయి కాబట్టి ఈ ట్రిక్ పని చేస్తుంది. దాంతో ముందు వైపు సింగిల్ పొరలో కొంగు వేసుకున్నా అందంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే బ్లవుజ్ డిజైన్ క్రాప్ టాప్ లాగా లేదా లెహెంగా మీద బ్లవుజు లాగా కాస్త పొడవుగా కుట్టించుకుంటే ఈ చీరలకు మంచి లుక్ వస్తుంది.
టాపిక్