బ్లవుజు మీద వర్క్ అంటే ఎంబ్రాయిడరీతోనో, లేదా మగ్గం వర్క్ తోనో చేయించుకుంటారు. లేదంటే సీక్వెన్లున్న లేసులు పెట్టీ డిజైన్ చేసుకుంటాం. కుందన్లు, స్టోన్లు, సీక్వెన్లు, హ్యాంగింగులున్న బ్లవుజులూ మామూలే. కానీ నగలనే వర్క్ లాగా బ్లవుజంతా పరిచి చేసిన బ్లవుజులు మాత్రం చాలా కొత్త ట్రెండ్. మరి మామూలు మనుషులకు అంబానీలకు ఆమాత్రం తేడా ఉండాలి కదా. అందుకే ఇలా నగలను విరగ్గొట్టి మరీ బ్లవుజు తయారు చేశారు. ఇషా అంబానీతో పాటే జాన్వీ కపూర్, హాలీవుడ్ నటి కూడా ఈ రకం బ్లవుజుల్లో కనిపించారు. ఈ కొత్త ట్రెండ్ గురించి వివరాలన్నీ తెల్సుకోండి. వాటిని ఎలా తయారు చేస్తారో చూసేయండి.
అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా ఇషా అంబానీ నగలనే వర్క్ లాగా పొందుపర్చిన బ్లవుజు వేసుకున్నారు. ఈ బ్లవుజును ప్రత్యేకంగా జదావు నగలతో రూపొందించారు. చాలా విలువైన నగలను విరగ్గొట్టి మరీ ఈ బ్లవుజు మీద చేర్చారు. దీని తయారీకి వాడిన నగలు కొన్ని ఇషా అంబానీ పర్సనర్ కలెక్షన్ లోవి. మరికొన్ని నగలు ప్రత్యేకంగా రాజస్థాన్, గుజరాత్ నుంచి తీసుకొచ్చి, విరగ్గొట్టీ మరీఈ బ్లవుజుమీద కుట్టేశారు. పచ్చలు, కెంపులు, డైమండ్లు, విలువైన రత్నాలు పొదిగిన నగలను ఈ బ్లవుజు డిజైనింగ్ కోసం వాడారట. కొత్త ట్రెండ్ సృష్టించాలంటే ఆమాత్రం చేయాల్సిందే మరి.
ఈ బ్లవుజు తయారీ కోసం ముందుగా ఆభరణాలను విరగ్గొట్టి ముక్కలుగా చేస్తారు. వాటిలో పెండెంట్లు, చైన్ల వరస ఏవి కావాలో అవి మాత్రమే తీసుకుంటారు. బ్లవుజు డిజైన్ ను ముందుగా ఒక పేపర్ మీద డిజైన్ గీస్తారు. చాలా రకాలుగా పొందిగ్గా అమరేలా ఆభరణాలు అమర్చే ప్రయత్నం చేస్తారు. చివరికి మంచి రూపం వచ్చాక రకరకాల అల్లికలతో, బంగారం, వెండి జర్దోసీ వర్క్ పనితనంతో ఈ ఆభరణాలను బ్లవుజు మీద కుడతారు.
అంబానీల పెళ్లిలో జాన్వీ కపూర్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయినట్లున్నారు. తను వేసుకున్న పసిడి వర్ణపు బ్లవుజు మీద ఉన్నవన్నీ నగలే. కాస్త గమనిస్తే కాసుల హారాలు, మామిడి పిందెల హారాలు, జదావు పెండెంట్లు, కెంపులు, పచ్చలు, స్టోన్స్ ఒదిగిన పెండెంట్లు కనిపిస్తాయి. అలా కనిపించకుండా చాలా చక్కగా, అందంగా జాన్వీ కపూర్ బ్లవుజు డిజైన్ చేశారు. చూస్తే బంగారాన్నే వేసుకున్నట్లుంది ఆ బ్లవుజు.
హాలీవుడ్ ఫ్యాషన్ మోడల్ గిగి హదీద్ కూడా ఇదే తరహా బ్లవుజులో కనిపించారు. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ముంబయిలో ప్రారంభోత్సవ వేడుకలకు ఆమె హాజరయ్యారు. భారత సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ ఆభరణాల బ్లవుజుతో చీరకట్టులో దర్శనమిచ్చారామె. అది పూర్తిగా ఆభరణాలతో చేసిన బ్లవుజు కాదు కానీ, చాలా విలువైన బంగారు వరుసలు ఒదిగి ఉన్నాయి ఆ బ్లవుజు మీద.
ఈ కొత్త ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏంటీ? ఉన్న నగలు మెడలో వేసుకోకుండా విరగ్గొట్టడం దేనికి అనిపిస్తుందా? లేదంటే పాత నగలంటే ఇలా వాడుకోవడం మంచిదే అనిపిస్తుందా? ఏదేమైనా దేనికైనా ఆలోచన కావాల్సిందే. విరగ్గొట్టాలన్నా, అతికించాలన్నా అంతా సృజనాత్మకతతోనే సాధ్యం మరి. అలాంటి ఆలోచనను మాత్రం మెచ్చుకుంటే తప్పేంటి.