Sravana Masam 2022 : శ్రావణమాసం ప్రత్యేకం.. దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసా?
Significance of Jyotirlingas : శ్రావణమాసాన్ని శివ భక్తులందరూ గొప్ప ఉత్సాహంతో పూజలు చేస్తారు. మరికొందరు ఉపవాసంతో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు. అయితే ఈ శ్రావణమాసంలో మీరు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసుకుని.. కుదిరితే అక్కడకు వెళ్లి శివుని అనుగ్రహం పొందండి.
Significance of Jyotirlingas : శ్రావణమాసంలో భారతదేశంలోని వివిధ దేవాలయాలలో విస్తరించి ఉన్న.. 12 జ్యోతిర్లింగాల వద్ద అనేక సంఖ్యలో శివ భక్తులు పూజలు చేస్తారు. అయితే ఈ సంవత్సరం మీరు కూడా జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకుంటే ఇది మీకోసమే. ఈ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి? వాటి ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ప్రత్యేక శివాలయాల గురించి తెలుసుకునే ముందు అసలు జ్యోతిర్లింగం అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలి.
జ్యోతిర్లింగం అంటే అర్థం ఇదే..
జ్యోతిర్లింగం అనేది ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ భక్తులు శివుడిని కాంతి స్తంభం రూపంలో పూజిస్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 'జ్యోతి' అంటే ప్రకాశం. 'లింగం' అంటే శివలింగం. ఇది శివునికి చిహ్నంగా నిలుస్తుంది.
మీరు శ్రావణమాసంలో శివుని ప్రసన్నం పొందాలి అనుకుంటే.. ఈ 12 ప్రాంతాలకు వెళ్లి జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.
సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం
సోమనాథ్ ఆలయం గుజరాత్‌లోని.. ప్రభాస్ పటాన్‌లో ఉంది. సోమనాథ్ ఆలయం శివుని అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిదిగా పరిగణిస్తారు. ఈ ఆలయాన్ని చంద్ర దేవుడు స్వయంగా సృష్టించాడని అక్కడి వారు భావిస్తారు. ఈ పవిత్ర స్థలం అనేక దాడులను ఎదుర్కోని.. విజయవంతంగా.. ఇప్పటికీ బలంగా ఉంది.
కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉంది. 'విశ్వనాథ' అంటే.. విశ్వానికి అధిపతి అని అర్థం. మహా శివరాత్రి, శ్రావణమాసంలో ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది.
మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం
శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయంలోని స్వామివారిని.. దక్షిణామూర్తి అని అంటారు. అంటే ఈ జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది. కాబట్టి దీనికి దక్షిణామూర్తి అని పేరు వచ్చింది.
మల్లికార్జున జ్యోతిర్లింగ దేవాలయం
శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో చూడవచ్చు. మల్లికార్జున అనేది శివుని మరో పేరు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో.. మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మల్లికార్జున జ్యోతిర్లింగం.. 275 పాదాల పెత్ర స్థలాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆసియాలోని శివునికి చెందిన గొప్ప దేవాలయాలలో ఒకటి.
ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో ఉన్న మాంధాత వద్ద ఉంది. ఆలయం పేరు - ఓంకారేశ్వర్ అంటే.. 'ఓంకార ప్రభువు' లేదా 'ఓం శబ్దానికి ప్రభువు'. అమరేశ్వరుడు అనే పదం ‘అమర స్వామి’ అని సూచిస్తుంది.
కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ దేవాలయం
రిషికేశ్ నుంచి 3,583 మీటర్ల ఎత్తులో ఉన్న జ్యోతిర్లింగ దేవాలయం కేదార్‌నాథ్. భక్తులు శివాలయం చేరుకోవడానికి ఈ మార్గం అత్యంత కష్టతరమైనది. పైగా ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ ప్రయాణంలో చాలా మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా సరే ప్రాణాలకు తెగించి.. స్వామివారిని దర్శించుకుంటారు.
భీమశంకర్ జ్యోతిర్లింగ దేవాలయం
భీమశంకర దేవాలయం మహారాష్ట్రలోని పూణేలో ఉంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం ఎంతో ఉన్నతంగా ఉంది. దీనిని నగర నిర్మాణ శైలిలో నిర్మించారు.
బైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం
బైద్యనాథ్ ఆలయాన్ని.. బాబా బైద్యనాథ్ ధామ్, బాబా ధామ్ అని కూడా పిలుస్తారు. ఇది శివ భక్తులకు ప్రసిద్ధ నివాసం. ఈ ఆలయం జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం.. ఈ ప్రాంతంలో శివుడు రావణుడిని నయం చేశాడని భావిస్తూ.. జ్యోతిర్లింగానికి 'బైద్య' అని పేరు పెట్టారు.
రామనాథస్వామి జ్యోతిర్లింగ దేవాలయం
రామనాథస్వామి ఆలయంలోని జ్యోతిర్లింగం.. బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించినందుకు పరిహారం చేయడానికి శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని భక్తులు విశ్వసిస్తారు. ఇది తమిళనాడులోని రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఈ దేవాలయం భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాలకంటే పెద్ద వరండా కలిగి ఉంది.
నాగేశ్వరా జ్యోతిర్లింగ దేవాలయం
నాగేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం గుజరాత్‌లోని ద్వారక సమీపంలో ఉంది. శివ పురాణం ప్రకారం.. ఈ జ్యోతిర్లింగం దారుకావనం అనే ఓ పురాతన అడవి పేరు మీదుగా వచ్చింది.
త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం
మహారాష్ట్రలోని నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ శివాలయంలో మరో జ్యోతిర్లింగం ఉంది. శివ పురాణం ప్రకారం.. గోదావరి, గౌతమ ఋషి కోరికపై శివుడు త్రయంబకేశ్వరునిగా నివసించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలయంలోని జ్యోతిర్లింగానికి మూడు ముఖాలు ఉన్నాయి. అవి బ్రహ్మ, విష్ణువు, శివుడు.
ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దేవాలయం
మహారాష్ట్రలోని ఔరగాబాద్‌లో ఉన్న ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయంలో ఉన్న ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం పన్నెండవ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇదే శివుని అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయం కూడా. ఘృణేశ్వర్ అనే పదానికి 'కరుణ గల దేవుడు' అని అర్థం వస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్