aloevera for skin: వేసవిలో చర్మానికి కలబంద ఇలా వాడండి
aloevera for skin: వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉంచుకోడానికి కలబందను ఎలా వాడాలో చూడండి.
కలబంద గుజ్జు చర్మానికి చాలా మేలు చేస్తుంది. చాలా ఏళ్ల నుంచి చర్మ వ్యాధులను నయం చేయడానికి దీన్నొక సాంప్రదాయ ఔషదంగా వాడుతున్నారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చర్మం పై దద్దుర్లు, దెబ్బలు అయినప్పుడు కూడా దీన్ని వాడతారు.
చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. దీనికి చర్మాన్ని తేమగా ఉంచే గుణం ఉండటం వల్ల మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్, లోషన్లలో దీన్ని వాడతారు.
వేసవి కాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. సూర్య కిరణాలు, తేమ, స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ వీటన్నింటి వల్ల చర్మం పొడిబారుతుంది. అలోవెరాలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
చర్మంపై ముడతలు తక్కువగా కనిపించేలా చేస్తుంది. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
అలోవెరాలో 98.5 శాతం నీళ్లుంటాయి. అలోవెరా జెల్ లో 99.5 శాతం నీళ్లుంటాయి. మిగతా 0.5 నుంచి 1 శాతం విటమిన్లు, మినరళ్లు, ఎంజైమ్స్, ఆర్గానికి యాసిడ్లు ఉంటాయి. యాంటిసెప్టిక్, శుద్ధీకరణ, చల్లదనానికి ఇవి అవసరం. ఇవన్నీ వేసవిలో కలబందను తప్పకుండా వాడేలా చేస్తాయి.
వేసవిలో కలబందను ఇలా వాడండి:
స్క్రబ్:
ఇది మంచి ఎక్స్ఫోలియేటర్ లా పనిచేస్తుంది. స్క్రబ్ లాగా వాడినపుడు చర్మం మీద ఉన్న మురికి, దుమ్ము, మృత కణాలు తొలగిస్తుంది. వీటివల్ల చర్మ రంధ్రాలు మూసుకోకుండా ఉండి మొటిమలు, యాక్నె సమస్యలు రావు. దీనివల్ల చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. చర్మం మీద ఉన్న నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. వారానికి రెండు సార్లు కలబందతో స్క్రబ్ చేయడం చాలా మంచిది.
మాస్క్:
కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం తాజాగా మారుతుంది. యూవీ కిరణాల వల్ల చర్మం మీద ర్యాషెస్ రాకుండా కాపాడుతుంది. మాస్క్ లాగా వాడితే కొలాజిన్ పెంచుతుంది. చర్మం తేమగా మారుతుంది. తాజాగా ఉంచుతుంది.
టోనర్:
అలోవెరా లో అలాయిన్ ఉంటుంది. ఇది చర్మంమీద ఉన్న మచ్చలు తగ్గేలా చేస్తుంది. చర్మంలో మిలనిన్ ఉత్పత్తి కాకుండా చూస్తుంది. మోచేతులు, చేతుల మీద ఏవైనా నల్ల మచ్చలుంటే తగ్గుతాయి. అలోవెరాతో చేసిన క్రీమ్ చేతులకు, మోచేతులకు రోజుకు రెండు సార్లు రాసుకోవడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది.
మాయిశ్చరైజర్:
దీనికి కొలాజెన్ ఉత్పత్తి చేసే గుణాలున్నాయి. దానివల్ల చర్మం తేమగా ఉంటుంది. దానివల్ల చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. పడుకునే ముందు అలోవెరా ఉన్న మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.