భాగస్వామితో పడక పంచుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు
ఎవరైతే తమ జీవిత భాగస్వామితో లేదా తమకు ఇష్టమైన వారితో ఒకే మంచం పంచుకుంటారో వారు మెరుగైన, ఘాడమైన నిద్రను ఆస్వాదిస్తారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.ఒంటరిగా నిద్రపోయే వారితో పోలిస్తే జంటగా నిద్రపోయే వారిలో మెరుగైన REM (రాపిడ్ ఐ మూవ్ మెంట్) నిద్రను కలిగి ఉన్నారని స్పష్టమైంది.
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడమే కాదు, మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. రాత్రి పూట నిద్రపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో శారీరకంగానే కాకుండా మానసిక విశ్రాంతి కలుగుతుంది. ఇది మన శరీరాన్ని రిపేర్ చేయడానికి తగినంత సమయాన్ని వ్యవస్థకి అందజేస్తుంది. ఈ క్రమంలో శారీరక సమస్యలైన అధిక శరీర బరువు, అలసటల నుంచి ఉపశమనంతో పాటు మానసిక సమస్యలైనటువంటి ఒత్తిడి, ఆందోళన, నిరాశ- నిస్పృహలకు లోనయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర మెదడుకి జ్ఞాపకాలను నిర్మించడంలో సహాయపడుతుంది. విషయాలను బాగా గుర్తుంచుకోవడానికి, ఆలోచనలను ప్రాసెస్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
భాగస్వామితో నిద్ర..
అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎవరైతే తమ జీవిత భాగస్వామితో లేదా తమకు ఇష్టమైన వారితో ఒకే మంచం పంచుకుంటారో వారు మెరుగైన, ఘాడమైన నిద్రను ఆస్వాదిస్తారని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఒంటరిగా నిద్రపోయే వారితో పోలిస్తే జంటగా నిద్రపోయే వారిలో ప్రశాంతమైన REM (రాపిడ్ ఐ మూవ్‌మెంట్) నిద్రను కలిగి ఉన్నారని స్పష్టమైంది.
నిద్రలో దశలు..
ఈ REM నిద్ర ఏంటంటే, మనకు నిద్ర మొత్తం ఒకేలా ఉండదు, నిద్రలో వివిధ దశలు ఉంటాయి. మనం నిద్రలోకి జారుకున్న సుమారు 90 నిమిషాల తర్వాత ఈ REM నిద్ర ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి, మైకం ఏదో కమ్మినట్లుగా మీ కళ్లు మూసుకుపోతాయి. మీ పల్స్ రేట్, రక్త ప్రసరణ, శ్వాస వేగవంతం అవుతాయి. ఇదే సమయంలో మనం కలలు కనడం కూడా జరుగుతుంది. దీనినే REM స్థితి అంటారు.
నిద్రలో ఈ దశను అతి ముఖ్యమైనదిగా చెప్తారు. ఎందుకంటే ఈ దశ ఏదైనా నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణ, సామాజిక స్పృహ, సృజనాత్మకమైన పరిష్కారాలు చూపడం తదితర అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఇలాంటి నిద్రను ఎవరైతే అనుభవిస్తే వారు తమ నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు మెరుగైన పరిష్కారాలు చూపగలుగుతారు. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైందని జర్మనీకి చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ సైకియాట్రీ విభాగంలోని డాక్టర్ హెన్నింగ్ జోహన్నెస్ డ్రూస్, బృందం తమ ప్రచురణల్లో పేర్కొన్నారు.
జంటగా పడుకోవడమే కీలకం..
కాబట్టి ఒత్తిడి లేని, చురుకైన జీవనశైలి కోరుకునే వారు మీ జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోవడం అనేది ఎంతో కీలకం. ఇక్కడ మరో విషయం ఏం చెప్పారంటే, మీరు మీ భాగస్వామితో సఖ్యతగా ఉన్నారా, లేదా? మీ మధ్య ఏవైనా బేధాభిప్రాయాలు ఉన్నాయా, మీ వైవాహిక జీవితం ఆటుపోట్లతో సాగుతుందా? అనేవి ఇక్కడ అవసరం లేదు. కేవలం ఒకరితో పక్కని పంచుకోవడం ముఖ్యం. ఇలా కలిసి పడుకోవడం అంటే సుఖమయ, అందమైన నిద్రకు ఆహ్వానం పలికినట్లేనని, అర్థవంతమైన జీవితాన్ని నిర్మంచడంలో అదొక చక్కని చిట్కా అని అధ్యయనాలు పేర్కొన్నాయి.
చివరగా చెప్పేదేంటంటే, మీరు ఎదుర్కొనే సమస్యలకు సంబంధించిన ఆలోచనలను పడుకునే ముందైనా మరిచిపోండి. మీ భాగస్వామితో కలిసి హాయిగా నిద్రపోండి.
సంబంధిత కథనం
టాపిక్