Alu Manchurian: నోరూరించే ఆలూ మంచూరియా, టేస్టీ స్నాక్ రెసిపీ
Alu Manchurian: ఆలూ మంచూరియా ఒక్కసారి తింటే మీకు ఫేవరైట్ స్నాక్ అయిపోతుంది. బంగాళదుంపలతో చేసే స్నాక్స్‌లో ఇది బెస్ట్ స్నాక్ అనుకోవచ్చు. దీనికోసం ఏం కావాలో, తయారీ ఎలాగో చూడండి.
ఆలూ మంచూరియా
సులభంగా చేయగల మంచూరియాల్లో ఆలూ మంచూరియా ముందుంటుంది. అన్ని రకాల మంచూరియాల లాగా దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఆలూ ముక్కల్ని వేయించి, మీరు చేయగల స్పెషల్ సాస్ లో కలిపితే సింపుల్ గా అద్భుతంగా స్నాక్ రెడీ అవుతుంది. తయారీ ఎలాగో చూసేయండి.
ఆలూ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 పెద్ద బంగాళదుంపలు
సగం కప్పు మైదా
పావు కప్పు కార్న్ ఫ్లోర్ (ఆప్షనల్)
అరచెంచా అల్లం ముద్ద
అరచెంచా కారం
సగం టీస్పూన్ ఉప్పు
2 చెంచాల నూనె
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
గ్రేవీ కోసం:
4 చెంచాల నూనె
4 వెల్లుల్లి రెబ్బలు, సన్నటి ముక్కల తరుగు
2 చెంచాల ఉల్లికాడల తరుగు
1 క్యాప్సికం, ముక్కలు
1 ఉల్లిపాయ, ముక్కలు
2 చెంచాల టమాటా సాస్
1 చెంచా సోయాసాస్
అరచెంచా మిరియాల పొడి
ఆలూ మంచూరియా తయారీ విధానం:
- ముందుగా బంగాళదుంపల్ని చెక్కుతీసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- పొయ్యి మీద ఒక పాత్రలో నీళ్లు పోసి అరచెంచా ఉప్పు వేసుకోవాలి. అందులో బంగాళదుంప ముక్కలు వేసి ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిపోకుండా సగం దాకా ఉడికితే చాలు.
- వెంటనే వేడినీటి నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఒక బౌల్ లో మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం ముద్ద, కారం, ఉప్పు వేసి నీళ్లు పోసుకుని బజ్జీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
- కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె మీడియం మంట మీద పెట్టుకోండి.
- ఇప్పుడు ఉడికించుకన్న బంగాళదుంప ముక్కల్ని మైదా మిశ్రమంలో ముంచుతూ నూనెలో వేసుకోవాలి.
- బంగారు వర్ణంలోకి రాగానే ఆలూ ముక్కల్ని బయటకు తీసుకోండి.
- అదే కడాయిలో నూనె కాస్త ఉంచి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
- అవి కాస్త ఉడికిపోయాక టమాటా సాస్, సోయాసాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
- రెండు చెంచాల నీళ్లలో కాస్త కార్న్ ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న సాస్ లో పోయాలి. దీంతో చిక్కదనం వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమం రెండు నిమిషాలు ఉడికిపోయాక వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కలుపుకోవాలి.
- చివరగా ఉల్లికాడల తరుగు చల్లుకుని దింపేసుకుంటే చాలు. ఆలూ మంచూరియా రెడీ.