Saturday Motivation: బొమ్మరిల్లులో నాన్నలా మారకండి, మీ పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వండి
Saturday Motivation: బొమ్మరిల్లు సినిమా చూస్తే నాన్న పాత్రే గుర్తుండిపోతుంది. అలాంటి నాన్నలా మీరూ మారుతున్నారా? ఓసారి చెక్ చేసుకోండి.
Saturday Motivation: ఏం తినాలో నాన్నే నిర్ణయించాలి. ఏ డ్రెస్ వేసుకోవాలో నాన్నే చెప్పాలి. ఏ చెప్పులు బాగుంటాయో నాన్నే నిర్ణయించాలి, ఏం చదవాలో, ఎలా ఉండాలో అన్నీ నాన్నే నిర్ణయం తీసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఇలా ఉండదు, కానీ కొందరి ఇళ్లల్లో మాత్రం జరిగేది ఇదే. ఇలాంటి నాన్నలను చూసినప్పుడు బొమ్మరిల్లు చిత్రంలో ప్రకాష్ రాజ్ గుర్తొస్తాడు. అతనికి నచ్చిందే బెస్ట్ అని, తాను తన పిల్లలకు బెస్ట్ మాత్రమే ఇస్తాను అంటూ... తనకు తెలియకుండానే తన నిర్ణయాలను పిల్లలపై రుద్దేస్తాడు. కనీసం పిల్లలకు ఏమి ఇష్టమో కూడా తెలుసుకోవాలన్న ఆలోచన ఉండదు. అలాగని ఆ నాన్నలు చెడ్డ నాన్నలు మాత్రం కాదు. పిల్లలకు తాము ఉత్తమమైనవే ఎంపిక చేస్తామనే ఉద్దేశంతో ఉన్న నాన్నలు. కానీ అవి పిల్లలకు నచ్చుతాయో లేదో మాత్రం ఆలోచించరు. అలాంటి నాన్నలుగా ఉండడం మానేయండి. మీ పిల్లలతో మనసు విప్పి మాట్లాడే స్నేహితుడిలా మారండి. అవసరమైనప్పుడే దండించండి. అవసరం లేనప్పుడు స్నేహితుడిలా వెంట నడవండి. వారి కష్టాలను, ఉద్దేశాలను, అభిప్రాయాలను వినండి. వాటిని గౌరవించండి.
మీ పిల్లల చిన్నప్పుడు మీరు ఏం చెప్పినా నడుస్తుంది, కానీ వారు ఒక వయసుకు వచ్చాక మంచి చెడులు తెలుసుకునే పరిణతి వారికి ఉంటుంది. కానీ అవి ఏవీ మీరు పట్టించుకోకుండా... మీరే వారి వెంట పడడం కరెక్ట్ కాదేమో. దీని వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. వారి ఆవేదనను తండ్రిగా మీరే వినాలి. కానీ మీరే వారిని వేదనకు గురి చేయకూడదు. వారు మనసు విప్పి మాట్లాడే వాతావరణన్ని ఇంట్లో కల్పించండి. ఒక్కసారిగా మారడం కష్టమే, కానీ కొద్ది కొద్దిగా మిమల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో పూర్తిగా భద్రతారాహిత్యం ఎంత ప్రమాదమో, పూర్తిగా మీ ఇష్టాలను వారిపై రుద్దడం కూడా అంతే ప్రమాదం. వారు స్వేచ్ఛగా ఎదిగే అవకాశాలను మీరే చంపేస్తున్నట్టు లెక్క.
పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం ముఖ్యం, అలా అని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వారికి నచ్చినట్టు వదిలేయమని మేము చెప్పడం లేదు. వారికి స్వేచ్ఛను కొన్ని పరిమితులతో ఇవ్వండి. వారికి నచ్చింది వారు చేయవచ్చు, కానీ మీ అనుమతితో మాత్రమే చేయాలి. వారి సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాలు మీకు కూడా నచ్చాలి. ఇలాంటి పరిమితులు, నిబంధనలు పెట్టాకే వారికి కావలసిన స్వేచ్ఛను ఇవ్వండి. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారి మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలు ఎంత సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కూడా అంత సంతోషంగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.